ఎక్కడి పని అక్కడే! | slowly construction of Kasturba Gandhi Balika Vidyalaya | Sakshi
Sakshi News home page

ఎక్కడి పని అక్కడే!

Published Mon, Oct 6 2014 12:12 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

slowly construction of Kasturba Gandhi Balika Vidyalaya

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)ల నిర్మాణ పనులు ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్లకు తలనొప్పిగా మారాయి. ఓ వైపు పనులు నత్తనడకన సాగుతుండగా.. మరోవైపు పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో నిర్మాణ పనుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఈ నిర్మాణ  పనులు పూర్తిచేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాలో 24 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. వీటిలో తొలి దశలో 12 నిర్మాణాలు పూర్తి చేశారు. రెండో విడతలలో భాగంగా 2012 సంవత్సరంలో 12 కేజీబీవీలకు భవనాలు మంజూరు కాగా.. నిబంధనల మేరకు పనులు మొదలుపెట్టారు. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు కేవలం మూడు భవనాలు మాత్రమే పూర్తికావడం గమనార్హం.

 చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు..
 ఒక్కో కేజీబీవీ భవనాన్ని రూ.1.25 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టరు చేసే పనికి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారు. రెండో విడతలో భాగంగా షాబాద్, మొయినాబాద్, పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం, బంట్వారం, మోమిన్‌పేట్, మహేశ్వరం, చేవెళ్ల, నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, యాచారం కేజీబీవీలకు గాను కేవలం షాబాద్, మొయినాబాద్, తాండూరు కేజీబీవీ పూర్తయ్యాయి.

 ఈ పనులకు సంబంధించి మొత్తం రూ.15 కోట్లకుగాను రూ.4.17 కోట్లు ఖర్చయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. పనులు పూర్తికాని వాటిలో బంట్వారం, నవాబ్‌పేట కేజీబీవీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు. యాచారం కాంట్రాక్టరు సైతం పనులు నిలిపి వేయడంతో నిర్మాణ పనులు ఆందోళనలో పడ్డాయి.

యంత్రాంగానికి కనీస సమాచారం ఇవ్వకుండా పనులు నిలిపి వేయడం.. వాటిని కొత్తవారికి ఇచ్చే క్రమంలో ఇంజినీర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో పాత కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చి కాంట్రాక్టును రద్దు చేయాలని నిర్ణయించారు. నాలుగైదు రోజుల్లో ఈ తంతు పూర్తిచేసి కొత్తవారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నారు.

 డిసెంబర్ డెడ్‌లైన్..
 ప్రస్తుతం తొమ్మిదిచోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటిలో మూడు చోట్ల కొత్తవారికి తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇటీవలి సమీక్షలో నిర్మాణ పనులపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నత్తనడకన సాగే పనులపై సీరియస్‌గా స్పందించిన ఆయన.. కాంట్రాక్టు రద్దు చేయాలని స్పష్టం చేశారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు వారికి నోటీసులిచ్చారు. డిసెంబర్ వరకు అన్ని నిర్మాణాలు పూర్తిచేయాలంటూ ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్లు.. కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. ఈసారైనా నిర్ధిష్టగడువులోగా పనులు పూర్తిచేయించి వినియోగంలోకి తెస్తారో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement