పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.
భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.
ఈ రంగాల నుంచి డిమాండ్..
ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్‌ఎఫ్‌టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్‌అండ్‌డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు.
ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులు
సవాళ్లు ఇవే..
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment