girls protection
-
ఆదర్శలో నిఘా
బజార్హత్నూర్ : ఓ వైపు విద్యాలయాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో రాత్రింబవళ్ళు భయంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. బాలికలకు భద్రత కరువై తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యాలయంలో నిరంతరం నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటితో తరగతి గది, పాఠశాల ఆవరణలో నిఘా పెరగడంతో అనుక్షణం అప్రమత్తత కనిపిస్తోంది. బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాలలో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థినిల చదువుకు భరోసా ఏర్పడింది. బాలికల వసతి గృహాలకు భద్రత మండల కేంద్రంలో 2013లో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేశారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 2014లో ఆదర్శ పాఠశాల నూతన భవనంలో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలో మండలంలోని 13 గ్రామపంచాయతీల పరిధిలోని 45 గ్రామాలకు చెందిన 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 485 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2015లో ఆదర్శ పాఠశాల ఆవరణలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేశారు. 100 మంది బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. బజార్హత్నూర్కు 3కిలో మీటర్ల దూరంలో పాఠశాల ఉండడంతో రాత్రి సమయంలో పోకిరిల బెడద ఉండేది. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటుతో భద్రంగా చదువుకొంటున్నారు. చేకురనున్న ప్రయోజనాలు సీసీ కెమెరాలతో తరగతి గదుల్లో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల బోధన తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. ఏ తరగతి గదిలోనైనా విద్యార్థులు అల్లరి చేస్తున్నారంటే వెంటనే అక్కడికి ఉపాధ్యాయులను పంపించే అవకాశం ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు భోధన చేస్తున్నారా, పిల్లలతో ముచ్చటిస్తున్నారా అనే విషయం తెలిస్తుంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా అనే విసయాన్ని పై అధికారులు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. వంట గదుల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రాంగణంలో అపరిచితులు వచ్చిన వెంటనే స్పందించడంతో పాటు వారి కదిలికలను గుర్తించి పోలీస్‌లకు సమాచారం అందించవచ్చు. సీసీ కెమెరాలతో సత్ఫలితాలు ఆదర్శ పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులపై నిఘా ఉంచడం సులభమైంది. సీసీ కెమెరాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, భద్రతతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు సత్పాలితాలనిస్తుంది. – రాజశేఖర్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, బజార్హత్నూర్ -
మహిళకు భరోసానిద్దాం
టెక్నికల్‌గా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న భారతావని.. ఆడపిల్లల భద్రత విషయంలో పాతాళానికి దిగజారుతోంది. రాజధాని వీధుల నుంచి పల్లెసీమ వరకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ(అగ్రికల్చర్ ప్రొడక్షన్) పూనం మాలకొండయ్య, హోంశాఖ సెక్రటరీ సౌమ్య మిశ్రా, ఐజీ (ట్రైనింగ్) స్వాతి లక్రా, సీఐడీ ఐజీ చారు సిన్హా తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ రంగాల్లోని మహిళ ల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. శనివారం బషీర్‌బాగ్‌లోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్, టీచర్లతో సమావేశమైంది. మారేడ్‌పల్లిలోని పద్మశాలి కళ్యాణమంటపంలో పలువురు స్థానిక మహిళలు, బాలికల అభిప్రాయాలను తీసుకుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం.. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని పూనం మాలకొండయ్య అన్నారు. కమిటీ తక్షణ నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తామన్నారు. కమిటీ నివేదిక మహిళలకు భరోసా ఇస్తుందన్నారు. సమావేశంలో సలహాలు, సూచనలు - నైతిక విలువలు, సెక్స్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేయాలి - సమాజంలో దుష్ర్పభావం కలిగించే సినిమాలు.. బాలికలను, మహిళలను కించపరిచే విధంగా వచ్చే టీవీ సీరియల్స్‌ను నియంత్రించాలి - పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగ టీచర్లను కఠినంగా శిక్షించాలి - దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి - పాఠశాలల్లో సెల్ఫోన్లు నిషేధించాలి, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలి సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాలి తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల కంటే 6, 7, 8 తరగతుల విద్యార్థులే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్‌ను ముందుగానే నేర్పించాలి. తల్లిదండ్రులే పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. - శుభా శుక్లా, సైకాలజిస్టు, కౌన్సిలర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యాలు ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆపదలో పిల్లలే రియాక్ట్ అయ్యేవిధంగా శిక్షణ ఇవ్వాలి. అధికారులను, పోలీసులను కన్సల్ట్ చే సేలా చూడాలి. అవసరమయ్యే లీగల్ పాయింట్స్, ఫోన్ నంబర్లపై అవగాహన కల్పించాలి. - సంగీత వర్మ, ప్రధాన కార్యదర్శి, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం సమాజంతో భయం మహిళలు ఎక్కువగా భయపడుతున్నది చుట్టూ ఉన్న సమాజం గురించే. కూతురుకు ఏదైనా జరిగితే బయటకు చెప్పుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. చట్టానికి తెలిసే లోపే సొసైటీలోని పెద్దలు తమ పలుకుబడితో దోషులకు అండగా నిలుస్తున్నారు. ఈ సమస్యను స్త్రీలే ఎదుర్కోవాలి. - భార్గవి, స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్పు ఇంటి నుంచే ముస్లిం యువతులపై ఇంటా, బయటా వివక్ష ఉంటోంది. మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. పెళ్లి చేస్తే ఆడపిల్ల భారం తగ్గుతుందనుకునే తల్లిదండ్రులు మారాలి. వారిని బాగా చదివించడంతో పాటు అన్ని విధాలా ప్రోత్సహించాలి. - సబియా సుల్తాన, టీచర్ - కేజీ బీవీ - ముషీరాబాద్/కంటోన్మెంట్ -
కేజీబీవీల్లో బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కేజీబీవీ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాసరావు ఆదేశించారు. గుంటూరు పాతబస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో సోమవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల ప్రత్యేకాధికారులు, సిబ్బందికి ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్ విద్యామిషన్ జిల్లా ప్రాజెక్టు అధికారి డాక్టర్ తన్నీరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీబీవీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి వ్యక్తిగత భద్రతపై ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ఉదయం పూట ఉపాధ్యాయులు వచ్చిన తరువాత, మెయిన్ గేట్లు మూసివేసి తిరిగి సాయంత్రం తరగతులు ముగిసిన తరువాతే తెరవాలని, పనివేళల్లో విజిటర్స్‌ను లోపలికి అనుమతించరాదని సూచించారు. విద్యాలయాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహిస్తూ, సిలబస్ సకాలంలో పూర్తిచేసి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర జీసీడీవో ఎ.విజయలక్ష్మి, కేజీబీవీ సొసైటీ సీఎంవో కె.జయకర్, జీసీడీవో రమాదేవి, ఏఎంవో రామకృష్ణ ప్రసాద్, ఆర్వీం సెక్టోరల్ అధికారులు సుభానీ, రుహుల్లా, ఇమ్మానియేల్, గుంటూరు జిల్లాలోని 24, కృష్ణా జిల్లాలోని మూడు కేజీబీవీల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.