
బజార్‌హత్నూర్ : ఓ వైపు విద్యాలయాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో రాత్రింబవళ్ళు భయంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. బాలికలకు భద్రత కరువై తల్లితండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యాలయంలో నిరంతరం నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటితో తరగతి గది, పాఠశాల ఆవరణలో నిఘా పెరగడంతో అనుక్షణం అప్రమత్తత కనిపిస్తోంది. బజార్‌హత్నూర్ ఆదర్శ పాఠశాలలో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థినిల చదువుకు భరోసా ఏర్పడింది.
బాలికల వసతి గృహాలకు భద్రత
మండల కేంద్రంలో 2013లో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేశారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 2014లో ఆదర్శ పాఠశాల నూతన భవనంలో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలో మండలంలోని 13 గ్రామపంచాయతీల పరిధిలోని 45 గ్రామాలకు చెందిన 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 485 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2015లో ఆదర్శ పాఠశాల ఆవరణలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేశారు. 100 మంది బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. బజార్‌హత్నూర్‌కు 3కిలో మీటర్ల దూరంలో పాఠశాల ఉండడంతో రాత్రి సమయంలో పోకిరిల బెడద ఉండేది. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఏర్పాటుతో భద్రంగా చదువుకొంటున్నారు.
చేకురనున్న ప్రయోజనాలు
సీసీ కెమెరాలతో తరగతి గదుల్లో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల బోధన తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. ఏ తరగతి గదిలోనైనా విద్యార్థులు అల్లరి చేస్తున్నారంటే వెంటనే అక్కడికి ఉపాధ్యాయులను పంపించే అవకాశం ఉంటుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు భోధన చేస్తున్నారా, పిల్లలతో ముచ్చటిస్తున్నారా అనే విషయం తెలిస్తుంది. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా అనే విసయాన్ని పై అధికారులు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. వంట గదుల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రాంగణంలో అపరిచితులు వచ్చిన వెంటనే స్పందించడంతో పాటు వారి కదిలికలను గుర్తించి పోలీస్‌లకు సమాచారం అందించవచ్చు.
సీసీ కెమెరాలతో సత్ఫలితాలు
ఆదర్శ పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో విద్యార్థులపై నిఘా ఉంచడం సులభమైంది. సీసీ కెమెరాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, భద్రతతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు సత్పాలితాలనిస్తుంది.
– రాజశేఖర్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, బజార్‌హత్నూర్
Comments
Please login to add a commentAdd a comment