బ్యాంకుల్లో భద్రతను మరింత పెంచాలని పార్వతీపురం ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు...
- బీహారీ ముఠాలు తిరుగుతున్నాయి
- ఏటీఎంల్లో సెక్యూరిటీ, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- వ్యవసాయ రుణాల మంజూరులో దళారుల ప్రమేయం వద్దు
- పార్వతీపురం ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
పార్వతీపురం: బ్యాంకుల్లో భద్రతను మరింత పెంచాలని పార్వతీపురం ఏఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పట్టణంలోని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురంలో బయట ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు తిరుగుతున్నాయని, ఇటీవల బిహారీ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలతో పాటు ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూ చించారు.
అలాగే నగదు విత్‌డ్రాల వద్ద నిఘాను పటిష్టం చేయాలన్నారు. దీంతోపాటు ముఖ్యంగా అమాయకులైన రైతులను మోసగించి... కొంతమంది దళారులు వ్యవసాయ రుణాలకు వస్తారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రుణాల విషయంలో దాదాపు దళారులను దూరంగా ఉంచాలన్నారు. రావివలస పీఏసీఎస్ రుణాల వ్యవహారాన్ని అందరూ గమనించాలన్నారు. అలాగే బ్యాంకుల్లో ఇంటిదొంగలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు సొమ్ము స్వాహా చేసిన సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. దీనిలో భాగం గా బ్యాంకర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.చంద్రశేఖర్, ఎస్సై బి.సురేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.