'మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా'
హైదరాబాద్: మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతాధికారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చినరాజప్ప మాట్లాడుతూ... గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు.
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అందులోభాగంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 24 పోలీసు స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఏపీలో బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఇకపై జిల్లా కలెక్టర్, ఎస్పీల అనుమతి తప్పనిసరి అని... వారు పర్యవేక్షించి... అనుమతించాకే బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చినరాజప్ప వెల్లడించారు.