N Chinna Rajappa
-
నాడు ‘ఎస్’ అని.. నేడు కస్సుబుస్సా?
2011 సాగుసమ్మె సమయంలో మద్దతిచ్చిన చంద్రబాబు అండ్ కో పంటవిరామమంటూ రాజకీయాలు చేస్తే సహించబోమంటూ నేడు కన్నెర్ర రాజప్ప వ్యాఖ్యలపై మండిపడుతున్న రైతులు ఎన్నికల ఏరు దాటేదాకా ‘ఓటు మల్లన్న’.. ఆ ఏరు దాటాక ‘ఓటి మల్లన్న’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. సమస్యలపై ఉద్యమిస్తున్న రైతులకు.. అధికార అందలాలు ఎక్కే సమయంలో అండగా ఉంటామంటూ వెంటపడి మరీ బలవంతంగా భరోసా ఇచ్చిన టీడీపీ నేతలే.. నేడు గద్దెనెక్కాక వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. పంటభూముల్లో సమస్యల సంద్రాన్ని ఈదలేక.. పోరుబాట పడుతున్న తమను.. రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ సాక్షాత్తూ కోనసీమ ప్రాంతానికే చెందిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించడం.. ఖాకీబలంతో పంటవిరామ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు రైతుల్లో తీరని ఆగ్రహం కలిగిస్తున్నాయి. కాకినాడ : ప్రభుత్వ విధానాల పుణ్యమా అని పంటలు పండించేందుకు సానుకూల పరిస్థితులు లేవని పేర్కొంటూ.. దేశంలోనే తొలిసారిగా కోనసీమ రైతులు 2011లో సాగుసమ్మె చేశారు. ఇది అప్పట్లో దేశంలోనే సంచలనం కలిగించింది. జాతీయ స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించింది. అప్పుడు సాగుసమ్మె చేసిన రైతులకు మద్దతుగా నాటి ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కోనసీమకు తీసుకువచ్చారు. సాగుసమ్మె చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. బండార్లంక తదితర ప్రాంతాల్లోని పొలాల్లో ఆర్భాటంగా పర్యటించారు. రైతు డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖపై చంద్రబాబు, చినరాజప్ప తదితరులు సంతకాలు కూడా చేశారు. రైతులకు తామే భరోసా ఇస్తున్నామన్న స్థాయిలో ఫొటోలకు పోజులిచ్చారు. చివరకు నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తమ 20 డిమాండ్లనూ ఆమోదించిన తరువాతే కోనసీమ రైతులు తమ ఉద్యమానికి ఫుల్స్టాప్ పెట్టారు. అనంతరం రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రస్తుతం అదే టీడీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే చినరాజప్ప నేడు డిప్యూటీ సీఎంగా అందలమెక్కారు. సరిగ్గా ఇదే సమయంలో దాదాపు 2011నాటి పరిస్థితులనే రైతులు ఎదుర్కొంటున్నారు. సాగుసమ్మె సందర్భంగా.. ఏటా ఏప్రిల్ 15న పంటకాలువలు మూసివేసి మే 15న నీరు విడుదల చేయాలని, ముంపునకు కారణమయ్యే మురుగు కాల్వలను ఆధునికీకరించాలని, లాభసాటి ధర వచ్చే వరకూ పంట దిగుబడులు నిల్వ చేసేందుకు నియోజకవర్గానికో గోడౌన్ నిర్మించాలని, సీజన్లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర ఇవ్వాలని.. ఇలా రైతులు 20 డిమాండ్లు పెట్టారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ నెరవేరలేదు. దీంతో గత్యంతరం లేక రెండోసారి పంటవిరామానికి కోనసీమ రైతులు సిద్ధపడుతున్నారు. నిజానికి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు నాడు ఇచ్చిన హామీలు గుర్తుకురావాలి. నాడు భరోసా ఇచ్చినవిధంగా రైతులకు మేలు కలిగించే పనులేవైనా చేపట్టాలి. కానీ, గద్దెనెక్కిన పెద్దల పరిస్థితి వేరేలా ఉంది. ఐదేళ్ల కిందట అదే రైతులకు ఇచ్చిన హామీలను వారు మరచిపోయారు. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అన్న కోపమో ఏమో కానీ.. ‘‘ఎవరో డెడ్‌లైన్ పెడితే మా ప్రభుత్వం దిగిరాదు’’ అని అంటున్నారు. ‘‘పంట విరామమంటూ రాజకీయాలు చేస్తే సహించం’’ అని చినరాజప్ప అన్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ‘‘నాటి డిమాండ్ల సాధన కోసం ఇప్పుడు మరోమారు సాగుసమ్మె చేస్తూంటే రాజకీయాలు చేయవద్దంటున్నారు. అంటే అప్పుడు చినరాజప్ప చేసింది కూడా రాజకీయమేనా? అప్పుడు వారు చేస్తే ఉద్యమం, ఇప్పుడు మేం చేస్తే రాజకీయమా?’’ అంటూ ఆయన తీరును గర్హిస్తున్నారు. రాజప్ప కూడా రైతుబిడ్డే కావడంతో తమకు న్యాయం జరుగుతుందనుకున్నామని, తీరాచూస్తే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటవిరామంపై గత నెల 30న అమలాపురం ఈదరపల్లిలో జరిగిన కోనసీమ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశాన్ని పోలీసులతో అడ్డుకున్నారని, ఇందులో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. 2011లో తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చి, ఇప్పుడు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కోనసీమను రాజప్ప తన ఇలాకాగా భావిస్తూ.. అక్కడ సర్కార్‌కు వ్యతిరేకంగా పెదవి విప్పకూడదన్నట్టు రైతు సమావేశాలను కూడా నిరోధిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాపు ఉద్యమాన్ని అణచివేసిన స్థాయిలోనే పంటవిరామ పోరాటాన్ని కూడా అణగదొక్కే వ్యూహంతో సర్కార్ ఉందనే అనుమానం కలుగుతోందంటున్నారు. కొంతమంది పనిలేని వారు పంటవిరామం అంటున్నారని రాజప్ప చేస్తున్న వ్యాఖ్యలు తమను అవమానించినట్టుగా ఉన్నాయని రైతులు భావిస్తున్నారు. చేతనైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లు సాధించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలతో పంటలు పండుతాయా? రాజకీయాలతో పంటలు పండవు. పెట్టుబడులు పెరిగిపోయి సాగు చేయలేక పంట విరామమే మేలని ఆలోచిస్తున్న రైతులు, రైతు నాయకులనుద్దేశించి రాజకీయం చేయవద్దని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సరికాదు. రైతులు రాజకీయాలు చేస్తే పండేవి పంటలు కావు... కాలేవి కడుపులు. మాకు పంటలు పండించటమే తెలుసు. రైతుగానే కాదు.. రైతు నాయకులుగా ఏ ప్రభుత్వాన్నైనా ఎప్పుడూ మేం అడిగేది లాభసాటి సాగు మాత్రమే. రైతు సమావేశాలను పోలీసులతో అడ్డగించి రైతు ఆవేదనాభరిత ఆలోచనలను అణచివేయాలనుకోవటం మంచిది కాదు. - ఉప్పుగంటి భాస్కరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీకేఎస్, బండార్లంక ఇది ముమ్మూటికీ అణచివేత చర్యే నాలుగు రోజుల క్రితం సాగు సమ్మెపై రైతులు సమావేశమైతే పోలీసులను పంపించాల్సిన పనేమిటి? మేము ఏమైనా కుట్రలు పన్నుతున్నామా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామా? ఉద్యమాన్ని అణచివేసేందుకు కాక మరెందుకు పోలీసులను పంపించారు? రాజకీయం చేయవద్దని రైతు నాయకులను రాజప్ప పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇది రాజకీయం కాదు. సాగు సమస్యలతో రాజీ పడలేక రైతులు చేస్తున్న పోరాటం. ఇదే రాజప్పగారు 2011లో జరిగిన పంటవిరామ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదు? - ముత్యాల జమ్మీలు, రాష్ట్ర కార్యదర్శి, బీకేఎస్, అంబాజీపేట -
'గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు'
కాకినాడ: గోదావరి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్ చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతూ... హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తాననడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు, కేంద్రం కూర్చుని చర్చిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చినరాజప్ప తెలిపారు. -
'ముద్రగడతో మరోదఫా చర్చలు జరుపుతాం'
విజయవాడ : కాపు సామాజిక వర్గం నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో మరోదఫా చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు. ముద్రగడ ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలసి చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. కేసుల విషయంలో చట్టానికి లోబడే పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ముద్రగడకు అత్యవసర వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కామినేని శ్రీనివాస్ చెప్పారు. -
అనంత తాగు నీటి సమస్య పరిష్కరానికి చర్యలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప అనంత వాసులకు హామీ ఇచ్చారు. శుక్రవారం చినరాజప్ప అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలంలోని వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ.... జిల్లాలో 7లక్షల హెక్టార్లకుగాను, 2.3లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే వేరుశనగ పంట సాగుచేశారని చెప్పారు. మిగిలిన భూముల్లో ఇతర పంటలు సాగుచేశారన్నారు. కాగా, వేరుశనగ పంట సాగు పెరిగినప్పటికి వర్షాభావ పరిస్థితుల్లో వేరుశనగ కాయలు పెరగలేదని చెప్పారు. తద్వారా 2.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట చేతికొచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగు నీటి సమస్య కూడా ఏర్పడిందని మంత్రి చినరాజప్ప అన్నారు. -
'రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్ సీపీ రాజకీయం'
హైదరాబాద్ : విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వెళ్లడంపై చినరాజప్ప గురువారం హైదరాబాద్‌లో స్పందించారు. తమ ప్రభుత్వంలతో మహిళలకు రక్షణ లేదనడం సరికాదన్నారు. నాగార్జున యూనివర్శిటీలోని నాన్ బోర్డర్లను ఇప్పటికే ఖాళీ చేయించామన్నారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల రక్షణకు డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తామని చినరాజప్ప చెప్పారు. -
'కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి'
కాకినాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మండిపడ్డారు. కేసీఆర్ క్రిమినల్ మైండ్ ముఖ్యమంత్రి అని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎస్ సర్కార్ కావాలనే రేవంత్‌ను ట్రాప్ చేసి ఇరికించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. గతేడాది జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మంగళవారం కాకినాడలో నవ నిర్మాణ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఎన్. చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అంశంలో చంద్రబాబు పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు... ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని చినరాజప్ప వెల్లడించారు. -
'ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రాజకీయ నేతలున్నారు'
చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కొందరు రాజకీయ నేతలు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. ఎలాంటి వారినైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం వెలుపల చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. ఈ స్మగ్లింగ్‌లో పోలీసుల హస్తం ఉన్నట్లు తెలిసే వారని ఉపేక్షించమని తెలిపారు. ఆ తర్వాత మదనపల్లిలో గాలివానకు దెబ్బతిన్న ప్రాంతాలను చినరాజప్ప పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని... పంటలు కొల్పోయిన రైతులకు రెండు, మూడు రోజుల్లో పరిహరం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
'మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా'
హైదరాబాద్: మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి ఎన్.చినరాజప్ప తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతాధికారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చినరాజప్ప మాట్లాడుతూ... గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. అందులోభాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించినట్లు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 24 పోలీసు స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఏపీలో బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే ఇకపై జిల్లా కలెక్టర్, ఎస్పీల అనుమతి తప్పనిసరి అని... వారు పర్యవేక్షించి... అనుమతించాకే బాణా సంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చినరాజప్ప వెల్లడించారు. -
'పోలీసులకు సెలవు ఇవ్వడం కుదరదు'
రాజమండ్రి: రాష్ట్ర పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ, డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బుధవారం రాజమండ్రిలో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు వారంతపు సెలవుపై ఏం నిర్ణయం తీసుకున్నారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు చినరాజప్పపై విధంగా సమాధానం చెప్పారు. నెలరోజుల్లో పోలీస్ శాఖను ప్రక్షాళిస్తామని చెప్పారు. ఇసుక తవ్వకాలుపై కొత్త పాలసీని త్వరలో వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయాంటే ప్రభుత్వంపై రూ. 43 వేల కోట్ల భారం పడుతుందని చినరాజప్ప తెలిపారు. కోనసీమ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిత్యవసర ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాకినాడలో షెల్ ఆధ్వర్యంలో ఎల్ఎన్జీ టర్మినల్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పెట్రో యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల వాహనాల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు.