నాడు ‘ఎస్’ అని.. నేడు కస్సుబుస్సా? | east godavari district farmers takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

నాడు ‘ఎస్’ అని.. నేడు కస్సుబుస్సా?

Published Sun, Jul 3 2016 8:36 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

east godavari district farmers takes on chandrababu govt

  • 2011 సాగుసమ్మె సమయంలో మద్దతిచ్చిన చంద్రబాబు అండ్ కో
  • పంటవిరామమంటూ రాజకీయాలు చేస్తే     సహించబోమంటూ నేడు కన్నెర్ర
  • రాజప్ప వ్యాఖ్యలపై మండిపడుతున్న రైతులు
  •  
     
    ఎన్నికల ఏరు దాటేదాకా ‘ఓటు మల్లన్న’.. ఆ ఏరు దాటాక ‘ఓటి మల్లన్న’ అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. సమస్యలపై ఉద్యమిస్తున్న రైతులకు.. అధికార అందలాలు ఎక్కే సమయంలో అండగా ఉంటామంటూ వెంటపడి మరీ బలవంతంగా భరోసా ఇచ్చిన టీడీపీ నేతలే.. నేడు గద్దెనెక్కాక వారిపై బెదిరింపులకు దిగుతున్నారు.

    పంటభూముల్లో సమస్యల సంద్రాన్ని ఈదలేక.. పోరుబాట పడుతున్న తమను.. రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ సాక్షాత్తూ కోనసీమ ప్రాంతానికే చెందిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించడం.. ఖాకీబలంతో పంటవిరామ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు రైతుల్లో తీరని ఆగ్రహం కలిగిస్తున్నాయి.
     
    కాకినాడ : ప్రభుత్వ విధానాల పుణ్యమా అని పంటలు పండించేందుకు సానుకూల పరిస్థితులు లేవని పేర్కొంటూ.. దేశంలోనే తొలిసారిగా కోనసీమ రైతులు 2011లో సాగుసమ్మె చేశారు. ఇది అప్పట్లో దేశంలోనే సంచలనం కలిగించింది. జాతీయ స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించింది. అప్పుడు సాగుసమ్మె చేసిన రైతులకు మద్దతుగా నాటి ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కోనసీమకు తీసుకువచ్చారు. సాగుసమ్మె చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు.
     
    బండార్లంక తదితర ప్రాంతాల్లోని పొలాల్లో ఆర్భాటంగా పర్యటించారు. రైతు డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖపై చంద్రబాబు, చినరాజప్ప తదితరులు సంతకాలు కూడా చేశారు. రైతులకు తామే భరోసా ఇస్తున్నామన్న స్థాయిలో ఫొటోలకు పోజులిచ్చారు. చివరకు నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తమ 20 డిమాండ్లనూ ఆమోదించిన తరువాతే కోనసీమ రైతులు తమ ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. అనంతరం రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదు.
     
    ప్రస్తుతం అదే టీడీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే చినరాజప్ప నేడు డిప్యూటీ సీఎంగా అందలమెక్కారు. సరిగ్గా ఇదే సమయంలో దాదాపు 2011నాటి పరిస్థితులనే రైతులు ఎదుర్కొంటున్నారు. సాగుసమ్మె సందర్భంగా.. ఏటా ఏప్రిల్ 15న పంటకాలువలు మూసివేసి మే 15న నీరు విడుదల చేయాలని, ముంపునకు కారణమయ్యే మురుగు కాల్వలను ఆధునికీకరించాలని, లాభసాటి ధర వచ్చే వరకూ పంట దిగుబడులు నిల్వ చేసేందుకు నియోజకవర్గానికో గోడౌన్ నిర్మించాలని, సీజన్‌లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర ఇవ్వాలని.. ఇలా రైతులు 20 డిమాండ్లు పెట్టారు. వీటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ నెరవేరలేదు.
     
    దీంతో గత్యంతరం లేక రెండోసారి పంటవిరామానికి కోనసీమ రైతులు సిద్ధపడుతున్నారు. నిజానికి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు నాడు ఇచ్చిన హామీలు గుర్తుకురావాలి. నాడు భరోసా ఇచ్చినవిధంగా రైతులకు మేలు కలిగించే పనులేవైనా చేపట్టాలి. కానీ, గద్దెనెక్కిన పెద్దల పరిస్థితి వేరేలా ఉంది.

    ఐదేళ్ల కిందట అదే రైతులకు ఇచ్చిన హామీలను వారు మరచిపోయారు. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా?  అన్న కోపమో ఏమో కానీ.. ‘‘ఎవరో డెడ్‌లైన్ పెడితే మా ప్రభుత్వం దిగిరాదు’’ అని అంటున్నారు. ‘‘పంట విరామమంటూ రాజకీయాలు చేస్తే సహించం’’ అని చినరాజప్ప అన్నారు. దీనిపై రైతులు మండిపడుతున్నారు.
     
    ‘‘నాటి డిమాండ్ల సాధన కోసం ఇప్పుడు మరోమారు సాగుసమ్మె చేస్తూంటే రాజకీయాలు చేయవద్దంటున్నారు. అంటే అప్పుడు చినరాజప్ప చేసింది కూడా రాజకీయమేనా? అప్పుడు వారు చేస్తే ఉద్యమం, ఇప్పుడు మేం చేస్తే రాజకీయమా?’’ అంటూ ఆయన తీరును గర్హిస్తున్నారు. రాజప్ప కూడా రైతుబిడ్డే కావడంతో తమకు న్యాయం జరుగుతుందనుకున్నామని, తీరాచూస్తే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
     
    పంటవిరామంపై గత నెల 30న అమలాపురం ఈదరపల్లిలో జరిగిన కోనసీమ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశాన్ని పోలీసులతో అడ్డుకున్నారని, ఇందులో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు. 2011లో తమ ఉద్యమానికి మద్దతు ఇచ్చి, ఇప్పుడు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

    కోనసీమను రాజప్ప తన ఇలాకాగా భావిస్తూ.. అక్కడ సర్కార్‌కు వ్యతిరేకంగా పెదవి విప్పకూడదన్నట్టు రైతు సమావేశాలను కూడా నిరోధిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాపు ఉద్యమాన్ని అణచివేసిన స్థాయిలోనే పంటవిరామ పోరాటాన్ని కూడా అణగదొక్కే వ్యూహంతో సర్కార్ ఉందనే అనుమానం కలుగుతోందంటున్నారు.
     
     కొంతమంది పనిలేని వారు పంటవిరామం అంటున్నారని రాజప్ప చేస్తున్న వ్యాఖ్యలు తమను అవమానించినట్టుగా ఉన్నాయని రైతులు భావిస్తున్నారు. చేతనైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్‌లు సాధించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
     
     రాజకీయాలతో పంటలు పండుతాయా?
     రాజకీయాలతో పంటలు పండవు. పెట్టుబడులు పెరిగిపోయి సాగు చేయలేక పంట విరామమే మేలని ఆలోచిస్తున్న రైతులు, రైతు నాయకులనుద్దేశించి రాజకీయం చేయవద్దని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సరికాదు. రైతులు రాజకీయాలు చేస్తే పండేవి పంటలు కావు... కాలేవి కడుపులు. మాకు పంటలు పండించటమే తెలుసు. రైతుగానే కాదు.. రైతు నాయకులుగా ఏ ప్రభుత్వాన్నైనా ఎప్పుడూ మేం అడిగేది లాభసాటి సాగు మాత్రమే. రైతు సమావేశాలను పోలీసులతో అడ్డగించి రైతు ఆవేదనాభరిత ఆలోచనలను అణచివేయాలనుకోవటం మంచిది కాదు.
     - ఉప్పుగంటి భాస్కరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీకేఎస్, బండార్లంక
     
     ఇది ముమ్మూటికీ అణచివేత చర్యే
     నాలుగు రోజుల క్రితం సాగు సమ్మెపై రైతులు సమావేశమైతే పోలీసులను పంపించాల్సిన పనేమిటి? మేము ఏమైనా కుట్రలు పన్నుతున్నామా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నామా? ఉద్యమాన్ని అణచివేసేందుకు కాక మరెందుకు పోలీసులను పంపించారు? రాజకీయం చేయవద్దని రైతు నాయకులను రాజప్ప పదేపదే హెచ్చరిస్తున్నారు. ఇది రాజకీయం కాదు. సాగు సమస్యలతో రాజీ పడలేక రైతులు చేస్తున్న పోరాటం. ఇదే రాజప్పగారు 2011లో జరిగిన పంటవిరామ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయలేదు?
     - ముత్యాల జమ్మీలు, రాష్ట్ర కార్యదర్శి, బీకేఎస్, అంబాజీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement