అయ్యన్నకు అందలం
గంటాకు అప్రాధాన్యం
చింతకాయలకు పంచాయతీరాజ్ శాఖ
శ్రీనివాసరావుకు విద్యా శాఖ
జిల్లాపై పెత్తనం అయ్యన్నదేనని చంద్రబాబు సంకేతాలు
డీలా పడిన గంటా వర్గం
విశాఖపట్నం: అసలే ఉప్పూ నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య శాఖల కేటాయింపు ఆజ్యం పోయనుంది. జిల్లాలో ఆధిపత్య పోరును మరింత రాజేసేలా జిల్లా మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. కీలకమంత్రిత్వ శాఖలు దక్కించుకోవాలన్న పోటీలో గంటాపై అయ్యన్న పెచైయ్యి సాధించారు. అయ్యన్నపాత్రుడికి కీలకమైన పం చాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖను చంద్రబాబు కేటాయించారు.ఆయనతో పోలి స్తే గంటా శ్రీనివాసరావుకు తక్కువ ప్రాధాన్యమున్న విద్యా శాఖను కేటాయించడం గమనార్హం. కీలకమైన విధులూ, నిధులతో సంబంధమున్న పరిశ్రమల శాఖ గానీ, పురపాలక శాఖగానీ వస్తుందని ఆశించిన గంటాకు తాజా పరిణామం కొంత అశనిపాతమే. అదే సమయంలో అత్యధిక నిధులతోపాటు విస్తారమైన అధికార పరిధి ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ అయ్యన్నకు దక్కడం గమనార్హం.
గంటాకు తగ్గిన ప్రాధాన్యం: కీలక శాఖను దక్కించుకోవడం ద్వారా జిల్లాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాల న్న గంటా శ్రీనివాసరావు ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లా రు. గత ప్రభుత్వంలో ఆయన కీలకమైన మౌలికవసతుల కల్పన, పెట్టు బడులు, వాడరేవుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈసారి కూడా భారీ నిధులు, విధులతో విస్తారమై న అధికార పరిధి ఉన్న శాఖను ఆయన ఆశించారు. గంటా కు పరిశ్రమ శాఖ కేటాయించవచ్చని తొలుత వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాల్సి ఉంటుంది. అందుకే ఆ శాఖను గంటా ఆశించారని టీడీపీ వర్గాలే లీకులు ఇచ్చాయి. పరిశ్రమల శాఖ కాకుంటే ఆయన కు పురపాలక శాఖను కూడా కేటాయించవచ్చని భావించా రు. భారీ నిధులతో కొత్త రాజధాని నిర్మాణ బాధ్యతను పురపాలక శాఖే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన శాఖ తమ నేతకు దక్కితే పండగేనని గంటా అనుచరులు సంబర పడ్డారు. కానీ వారి ఆశ అడియాశే అయ్యింది. గంటా కు విద్యా శాఖను కేటాయిస్తూ చంద్రబాబు బుధవారం నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యా శాఖ కూడా ప్రాధాన్యమైనదే కానీ పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలతో పోలిస్తే అధికార పరిధి తక్కువేనని చెప్పొచ్చు.
అయ్యన్నదే ఆధిపత్యం: శాఖల కేటాయింపులో అయ్యన్న కు చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. ఆయనకు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖను కేటాయిం చారు. నిధుల లభ్యత, బడ్జెట్ కేటాయింపు, అభివృద్ధి పనుల విషయంలో ఈ శాఖ ప్రాధాన్యమైనదే. పంచాయతీరాజ్‌శాఖకు స్థానిక సంస్థల నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి దండిగా నిధులు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక సంఘం నిధులు కావలసినన్ని వస్తాయి.
గంటా వర్గానికి చెక్ : ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లా లో గంటా వర్గానికి చంద్రబాబు మెల్లగా చెక్ పెడుతున్నారు. గంటాకు అనుకూలుడైన సీనియ ర్ నేత బండారు సత్యానారాయణమూర్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. బండారు సామాజిక వర్గానికే చెందిన అయ్యన్నపాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఇక ఆయనకు అవకాశం లేనట్లే. శాఖల కేటాయింపులోనూ గంటా కంటే అయ్యన్నకే ప్రాధాన్యం లభించింది. దాంతో అయ్యన్న వర్గం జోష్ మీద ఉండగా... గంటా వర్గం కొంతవరకు డీలా పడిపోయింది. శాఖల కేటాయింపులో అసంతృప్తి టీడీపీ వర్గ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.