బాలల పరిరక్షణకు ప్రత్యేక చట్టం | Special law for the protection of children | Sakshi
Sakshi News home page

బాలల పరిరక్షణకు ప్రత్యేక చట్టం

Published Wed, Apr 20 2016 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

Special law for the protection of children

నిడమర్రు : బాలల సంరక్షణకు భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)-2015 పేరుతో 2016 జనవరి 15 నుంచి అమల్లోకి తెచ్చింది. మనదేశంలో 1997లో చేసిన చట్టప్రకారం.. 16 ఏళ్లలోపు బాలలను జువనైల్స్‌గా గుర్తించేవారు. 1992 డిసెబర్ 11న భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి చేపట్టిన బాలల హక్కుల పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామిగా మారింది. దీనిప్రకారం  2000లో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చి  బాలల వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచింది.
 
 తాజాగా నిర్భయ కేసులో మహిళలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వయసును 18 ఏళ్లుగానే ఉంచి నేరాలను స్వల్ప, తీవ్ర, క్రూర నేరాలుగా వర్గీకరించి 16 నుంచి 18 ఏళ్లలోపు వారు క్రూర నేరాలకు పాల్పడితే మేజర్లకు విధించే శిక్షలే అమలు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఈచట్టంలో బాలనేరస్తులకు సంబంధించే కాకుండా శిశు క్రయ, విక్రయం, దత్తత, అనాథ బాలలకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు చేశారు.  
 
 చట్టంలో ముఖ్యాంశాలు
  నేరాలను మూడు రకాలుగా విభజించారు. స్వల్ప శిక్షనేరాలు (మూడేళ్లలోపు జైలు), తీవ్ర శిక్ష నేరాలు (ఏడేళ్లలోపు జైలు), క్రూర శిక్ష నేరాలు (ఏడేళ్లకు పైబడి జైలు)గా వర్గీకరించారు.
 
 ప్రతి జిల్లాలో బాలల నేర కేసులను విచారించడానికి జువనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డులో ఫస్ట్‌క్లాస్ స్థాయి మెజిస్ట్రేట్, ఇద్దరు సభ్యులను నియమించాలి. ఆ ఇద్దరి సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళా సభ్యురాలై ఉండాలి.
 18 ఏళ్లలోపు బాలలపై కేసు నమోదై, విచారణ తేదీకి  18 ఏళ్లు దాటినా ఈ చట్టం కిందే విచారణ చేస్తారు.
 
 బాలనిందితుడిని లాకప్‌లోగానీ, జైల్లోగానీ పెట్టకూడదు.
 బెయిలబుల్ నేరాలు లేదా నాన్‌బెయిలబుల్ నేరాల్లో బాలలు వెంటనే పోలీసుల వద్దే బెయిల్ పొందే అవకాశం ఉంది. కానీ నిందితుడు మళ్లీ నేరం చేస్తాడని, చెడు ప్రవర్తనకు అలవాటు పడతాడని పోలీసులు భావిస్తే స్టేషన్‌బెయిల్ ఇవ్వకపోవచ్చు.
 బాలనేరాల విచారణ బోర్డు నాలుగు నెలల్లోపు ముగించాలి. కారణాలు చూపించి మరో రెండు నెలలే పొడిగించే అవకాశం ఉంది. ఆరు నెలల తర్వాత విచారణ ముగించలేకుంటే విచారణ రద్దవుతుంది. తీవ్ర, క్రూర నేరాల్లో విచారణ కాలం ఆరునెలలు తర్వాత కూడా పెంచుకునే అధికారం బోర్డుకు ఉంది.
 
 16ఏళ్లలోపు స్వల్ప, తీవ్ర నేరాల్లో బాలలకు ఎటువంటి శిక్షలూ వేయకూడదు.ప్రొటెక్షన్ హోమ్‌లో 21 ఏళ్లు దాటిన తర్వాత ఉంచకూడదు.
 
 16 ఏళ్లు దాటిన బాలలు క్రూర శిక్ష నేరాలకు పాల్పడినప్పుడు చిల్డ్రన్ కోర్టు వేసిన శిక్షను 21ఏళ్లు నిండిన తర్వాత అమలు చేయాలి. 21 ఏళ్ల వరకూ ప్రొటెక్షన్ హోమ్‌లో ఉంచాలి.
 
 బాలనేరస్తులకు జీవిత ఖైదుగానీ మరణ శిక్షగానీ విధించకూడదు. స్వల్ప, తీవ్ర నేరాలకు పాల్పడిన బాలలను ఉద్యోగాలకు, రాజకీయాలకు అనర్హులుగా చూడకూడదు.
 బాల నేరస్తుల పేర్లను, వారి చిరునామాలను పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వెల్లడించకూడదు.
 బాలలను బాధ పెడితే శిక్షలు, జరిమానాలు
 బాలలను సంరక్షించాల్సిన బాధ్యత గల వ్యక్తులు, సంస్థలు ఉద్దేశపూరకంగా వారిని పట్టించుకోకపోయినా, మానసికంగా, శారీరకంగా బాధకు గురిచేసినా వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. ఆ సంస్థల నిర్లక్ష్యం వల్ల బాలలకు శారీరక , మానసిక వైకల్యం కలిగినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ. ఐదులక్షల వరుకూ జరిమనా విధించవచ్చు
 బాలలను భిక్షాటనకు ప్రోత్సహిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
 18 ఏళ్లలోపు వారిని మద్యం, సిగెరెట్లు, మారక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించినా, వాటిని తాగేందుకు  ప్రోత్సహించినా, అమ్మేందుకు, కొనుగోలుకు వారిని వినియోగించినా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
 బాలలను పనికి పెట్టుకున్నా.. వారితో వెట్టిచాకిరీ చేయించి వారి జీతభత్యాలను స్వలాభం కోసం వాడుకున్నా, బాలలను అమ్మినా, కొన్నా  ఐదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు.
 ఆస్పత్రులు, బాలల వసతిగృహాల నిర్వాహకులు లేదా యజమానులు బాలలను అమ్మితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల ఏళ్ల వరుకూ శిక్ష విధిస్తారు.
 బాల సంరక్షణ సంస్థలు బాలలను శారీరకంగా దండిస్తే, మొదటి తప్పుకు రూ.10వేలు జరిమానా తర్వాత నేరానికి మూడు నెలల వరుకూ జైలు శిక్ష విధించవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement