ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి.
ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్‌మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది.
రామ్వా, మణిపూర్‌లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం.
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు.
కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్‌ఐఆర్ పేర్కొందని అన్నారు.
గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి.
ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు.
1983లో నాగా పీపుల్స్ మూవ్‌మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్‌ఎస్‌పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది.
ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్‌తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది.
మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్‌గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది.
ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది.
2021 డిసెంబర్‌లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్‌ఎస్‌పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి.
– నందితా హక్సర్
మానవ హక్కుల న్యాయవాది, రచయిత
Comments
Please login to add a commentAdd a comment