► హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ల దాడి
► ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ
► వాట్సాప్‌లో దాడి దృశ్యాలు
క్రమశిక్షణకు మారుపేరు పోలీసు శాఖ. పది మందికి మంచీ చెడు చెప్పాల్సిన ఆ పోలీసులే బజారుకెక్కితే. వీధి రౌడీల్లా పోట్లాడుకుంటే. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వీరే ముష్టి ఘాతాలు కురిపించుకుంటే.. జనం ముక్కున వేలేసుకుని వినోదం చూడాల్సిందే. అందులోనూ ఒకే శాఖకు చెందిన ఉద్యోగులే ఇలా చేయడం మరింత చర్చనీయాంశం. అది కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించమని విధుల్లోని మరో పోలీసు శాఖ ఉద్యోగి చెప్పడంతోనే ఇంతలా గొడవ పడ్డారంటే సామాన్యుల పట్ల వీరి తీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది.
కర్నూలు: నగరంలోని రాజ్‌విహార్ సెంటర్‌లో ట్రాఫిక్ విధుల్లోని హోంగార్డు హుసేన్‌పై తోటి పోలీసులే దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం హోంగార్డు హుసేన్ రాజ్‌విహార్ సెంటర్‌లో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు(సివిల్) మనోజ్, అతని తమ్ముడు మణికుమార్ ద్విచక్ర వాహనంపై రెడ్ సిగ్నల్ పడినప్పటికీ దాటి వెళ్తుండగా అడ్డుకున్నాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించగా డ్రస్‌లో ఉన్న మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హుసేన్‌కు మద్దతుగా నిలవడంతో ఘటన ఉద్రిక్తంగా మారింది. దాడికి సంబంధించిన సెల్‌ఫోన్ దృశ్యాలు ప్రస్తుతం వాట్సాప్‌లో వైరల్ అయ్యాయి. హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయరత్నంతో పాటు ట్రాఫిక్ కానిస్టేబుళ్లంతా మూకుమ్మడిగా రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్ చేరుకుని దాడిపై ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర మనస్థాపంతో ఉన్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం ఎస్పీ వద్దకు చేరింది.
మనోజ్, మణికుమార్ స్వయానా సోదరులు. వీరి తండ్రి డేవిడ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం వీరు శరీన్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఉద్యోగం రాకముందు మనోజ్‌పై నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉన్నట్లు సమాచారం. దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడుతుండటంతో అప్పట్లో వీరిపై రెండు, నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. 2011లో పోలీసు శాఖలో విధుల్లో చేరినప్పటి నుంచి వీరు స్పెషల్ పార్టీలో పనిచేస్తున్నారు. మరి తాజా పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.