తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు ప్రత్యేక పాలన అందిస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇప్పటివరకు అక్కడి ప్రజ లకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టని పాలకులు ఆయా మండలాలకు, గ్రామాలకు నియమిస్తున్న అధికారులను మాత్రం ఏరికోరి ‘ప్రత్యేకం’గా ఎంపిక చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వివిధ ఆరోపణలపై గతంలో సస్పెండైన ఉద్యోగులు, శాఖాపరమైన విచారణ ఎదుర్కొన్న అధికారులు, చార్జ్‌మెమోలు అందుకున్న సిబ్బంది, ఉద్యోగ బాధ్యతల పరంగా లెక్కకు మించి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న వారినే ఆయా ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారన్న వాదనలు బలంగా ఉన్నాయి. అందరూ కాదు గానీ.. ఎక్కువగా పనిష్మెంట్ బ్యాచ్‌నే ఆ రెండు మండలాలకు కేటాయిస్తున్నారన్న వాదనలు సాక్షాత్తు అధికార వర్గాల నుంచే వినిపిస్తుండటం గమనార్హం.
పోలీస్ శాఖాపరంగా గతంలో ఉండి, భీమవరంలో పనిచేసిన ఒకరిని అక్కడికి బదిలీ చేశారు. గతంలో సస్పెండైన సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తివేశాక తొలి పోస్టింగ్ విలీన మండలాల్లోనే ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పీఎస్‌లో లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన మరో ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ విలీన మండలానికి పంపించారు. అక్కడ నియమితులైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లోనూ చాలామందిపై వివిధ ఆరోపణలు ఉన్నాయి. కుకునూరుకు బదిలీ అయిన ఓ రెవెన్యూ అధికారి వాణీమోహన్ కలెక్టర్‌గా ఉన్న సందర్భంలో కలెక్టరేట్‌లోనే పనిచేసేవారు. అప్పట్లో ఆయన పనితీరుపై నిందలు రాగా, ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేశారు. ఆ ఉద్యోగి సతీమణి ఏలూరులోనే పనిచేస్తుండటంతో ఈ జిల్లాకు బదిలీ కోసం యత్నించగా, చివరకు ఆయన్ని ఆ విలీన మండలాలకు పంపించారు. మరో రెవెన్యూ ఉద్యోగిది కూడా ఇటువంటి కథే.
ఆ ఉద్యోగి డెల్టా ప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో విద్యార్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కూడా నాకేంటి అని లెక్కలు వేసుకునే వాడన్న ఆరోపణలు ఉన్నాయి. మండల పరిషత్ ఉద్యోగుల్లో కూడా చాలామంది ఆరోపణలు ఉన్న వారే. వేలేరుపాడుకు బదిలీ అయిన ఓ ఉద్యోగి గతంలో గోపాలపురం నియోజకవర్గంలోని మండలాల్లో పనిచేశారు. నల్లజర్లలో ఆయన పనిచేసిన సందర్భంలో నిధుల అవకతవకలపై విచారణ జరిగింది. ద్వారకాతిరుమలలో పనిచేస్తున్నప్పుడు పంచాయతీ విస్తరణ అధికారి సదరు ఉద్యోగి తనను వేధిస్తున్నారంటూ కేసు కూడా పెట్టారు. కుకునూరుకు కేటాయిం చిన మరో ఉద్యోగిదీ ఇంతకుమించిన చరిత్రే. ఏజెన్సీలో పనిచేసినప్పుడు ఈయనపై ఏసీబీ కేసు కూడా నడిచింది. పంచాయతీ ఉద్యోగులు, గ్రామస్థాయి సిబ్బందిలో కూడా చాలామంది ఇదే బాపతు కావడం గమనార్హం. వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులను అక్కడికి బదిలీ చేయడం యాధృచ్ఛికంగా జరిగిందా.. లేదా ఉద్దేశపూర్వకమా..? ఏమో కానీ అభివృద్ధికి సుదూరంలో ఉన్న ఆయా మండలాల్లో సదరు ఉద్యోగులు, అధికారులు ‘ప్రత్యేక’ పాలన ఎలా సాగిస్తారో చూడాల్సిందే!?
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
అక్కడికి వెళ్లారంటే.. అంతేనా?
Published Sun, Dec 28 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM
Advertisement