Special rule
-
నూతనం..ప్రత్యేకం!
పంచాయతీల పాలకమండళ్ల గడువు బుధవారంతో ముగియనుంది. అయితే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగిస్తే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పాలనకే పచ్చజెండా ఊపింది. పంచాయతీకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన ఎంపీడీఓలు కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. బుధవారం సాయంత్రం లోపు ప్రత్యేక అధికారుల లిస్ట్ విడులయ్యే అవకాశముంది. ఆ వెంటనే జిల్లాలోని పాత పంచాయతీలతో పాటు నూతనంగా ఆవిర్భవించిన జీపీల్లో ప్రత్యేక పాలనకు తెరలేవనుంది. సాక్షి, వికారాబాద్ : గ్రామాల్లో ప్రత్యేక పాలనకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్లు కొలువుదీరనున్నారు. నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో 367 పంచాయతీలుండేవి. 500కుపైగా జనాభా కలిగిన అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలను జీపీలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. అదనంగా 198 పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లాలో వీటి సంఖ్య 565కు చేరింది. ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేయాల్సిన బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల జాబితాను రూపొందించిన వీరు లిస్ట్‌ను కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఈ నెల 12వ తేదీ వరకు సెలవులో ఉండడంతో.. పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు అప్పగించారు. జిల్లాలోని 18 మండలాల ఎంపీడీఓలు పంపించిన ప్రత్యేకాధిరుల ప్రతిపాదిత జాబితాను ఐదు రోజుల క్రితం డీపీఓ మాజిద్ సమక్షంలో పరిశీలించారు. జాబితాకు తుది రూపునిచ్చిన అనంతరం స్పెషల్ ఆఫీసర్ల వివరాలను బుధవారం కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. మూడు జీపీలకో అధికారి... ప్రతీ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఇందుకు సరిపడా అధికారులు లేకపోవడంతో జాబితా రూపొందించడం ఎంపీడీఓలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రభుత్వ శాఖలనుంచి అధికారుల లిస్ట్ తయారు చేసి కలెక్టర్‌కు అందజేశారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన తదితర శాఖలతో పాటు సీనియర్ అసిస్టెంట్లు, ఫ్యానల్ గ్రేడ్– 1 ప్రధానోపాధ్యాయులను కూడా పరిగణనలోని తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పంచాయతీ బాధ్యతలు అప్పగించాలని భావించనప్పటికీ అధికారుల కొరత కారణంగా మూడు లేదా నాలుగు జీపీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 35 పంచాయతీలున్నాయి. మండలానికి సగటున 30 జీపీలు ఉండడంతో.. పది మంది అధికారులను గుర్తించి వీరికి కనీసం మూడు పంచాయతీల చొప్పున అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా మండలాల ఎంపీడీఓలు అందించిన ప్రత్యేకాధికారుల జాబితాను పరిశీలించిన డీపీఓ.. కలెక్టర్ సమక్షంలో దీనికి తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆమోదంతో బుధవారంలోపు ప్రత్యేక అధికారులకు నియామకపత్రాలు అందజేయనున్నారు. పండుగ వాతావరణంలో.. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 198 పంచాయతీల్లో గురువారం నుంచి ప్రత్యేక పాలన ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జీపీలకు ప్రభుత్వ భవనాలు తీసుకోవాలని, అందుబాటులో లేని గ్రామాల్లో అద్దె భవనాల్లో ఆఫీసులు తెరవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త పంచాయతీల్లో పాలన ప్రారంభం పండుగ వాతావరణంలో ఉండాలని పేర్కొంది. నూతన జీపీలకు బోర్డులు రాయించడంతో పాటు కార్యాలయం పేరుతో రబ్బరు స్టాంపు, ఫర్నిచర్, రికార్డుల నిర్వహణకు కొత్త పుస్తకాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. నూతన పంచాయతీల్లో పాలన నిర్వహించే భవనాలకు రంగులు వేయాలని సూచించింది. వీటి కొనుగోలు, తదితర ఖర్చులకు ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ఆగస్టు రెండో తేదీనుంచి అమలయ్యేలా పంచాయతీలకు సంబంధించి బ్యాంకులో అకౌంట్ తెరవాలని సూచించింది. ఆయా జీపీల అభివృద్ధికి ఈ ఖాతాలో నిధులను జమచేయనున్నట్లు ప్రకటించింది. పాత పంచాయతీల నుంచి జనాభావారీగా కొత్త జీపీలకు నిధుల పంపకం జరగనుంది. పాత పంచాయతీలోని రికార్డులు, స్థిర, చరాస్తులు దామాషా ప్రకారం పంపకం జరగాలని.. పీఆర్ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో 2వతేదీ నుంచి పంచాయతీల్లో పాలన పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
స్థానిక సమరం.. ఖర్చు అధికం
సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి : స్థానిక సంస్థల సమరానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018, జులై నెలాఖరుతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహాలు మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఉత్తర్వులు అందాయి. జనాభా ప్రతిపదికన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారుచేసే అంశమై జిల్లావ్యాప్తంగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికకు ప్రధానమైన వ్యయం అంశంలో అధికారులు స్పష్టతకు వచ్చారు. వివిధ ఖర్చులకు గానూ రూ.17.72 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు రూ.4 కోట్లు మాత్రమే వెచ్చించారు. ప్రస్తుతం నిత్యావసరాలు, వివిధ సామగ్రి, ఇంధనం తదితర ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఎన్నికలకు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల వ్యయానికి, ప్రస్తుత వ్యయానికి రూ.13.72 కోట్ల మేర వ్యత్యాసం ఏర్పడింది. గత ఎన్నికల ఖర్చు : రూ.4 కోట్లు ప్రస్తుత ఖర్చు : రూ.17.72 కోట్లు మొత్తం పంచాయతీలు : 970 పూర్తిస్థాయిలో పాలకవర్గంలేనిది : 1 ఉప సర్పంచ్ల ద్వారా నడుస్తున్నవి : 30 జిల్లావ్యాప్తంగా.. జిల్లాలో 49 మండలాలు, వాటి పరిధిలో 970 పంచాయతీలు ఉన్నాయి. అందులో 120 మేజర్ పంచాయతీలు. 2013లో అన్ని పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం 49 పంచాయతీలను విజయవాడ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ముసాయిదా మేరకు రిజర్వేషన్ల కల్పన ఆయా గ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా విభజన జరగనుంది. ఈనెల 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం తీవ్రంగా కృషిచేస్తోంది. తద్వారా ఓటర్ల ముసాయిదా జాబితా వెలువడితే.. ఓటర్ల జాబితాను పంచాయతీల వారిగా రూపొందించి, ఓటర్లను కులాలవారీగా విభజించనున్నారు. విభజించిన ఓటర్ల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో కులాలవారీగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారు. ఎన్నికలా.. ప్రత్యేక పాలనా? ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందా? లేక ప్రధాన ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? అప్పటివరకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకాధికారుల పాలనతో కాలం వెల్లదీస్తారా? అన్న వాదనలు వినవస్తున్నాయి. పాలకవర్గాలు లేని వాటికీ ఎన్నికలు పంచాయతీ పాలక వర్గాలు లేని వాటికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1 పంచాయతీలో మాత్రమే పూర్తి స్థాయిలో పాలకవర్గం లేదు. మిగిలిన 30 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లతో పాలన కొనసాగుతోంది. పాలకవర్గం లేని పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఓట్ల వివరాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా, 29,25,100 మంది ఓంటర్లు ఉండగా, అందులో 14,68,763 మంది పురుషులు, 14,56,451 మంది మహిళలు ఉన్నారు. కానీ, ఈసారి ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 49 మండలాల పరిధిలో ఎస్టీ పురుషులు 51,331, మహిళలు 50,733 మంది ఉన్నారు. ఎస్సీ పురుషులు 3,50,376, మహిళలు 3,48,831 మంది. ఇతరులు 10,67,056 మంది పురుషులుండగా, 10,56,847 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల ఖర్చు రూ.17.72 కోట్లు ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు టీఏ, డీఏ, స్టేషనరీ కొనుగోలు, పోస్జేజీ, వాహనాలు, పబ్లికేషన్, ఎన్నికల బూత్‌ల వద్ద ఏర్పాట్లు, అధికారుల పర్యవేక్షణకు వినియోగించే వాహనాలకు ఇంధనం ఖర్చులకు రూ.17.72 కోట్లు అవసరమని పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో ఖర్చు వివరాలు పరిశీలిస్తే.. సామగ్రి ఖర్చు ఓటర్ల జాబితా తయారీ రూ.90,21,290 ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏ రూ.4,57,83,600 స్టేషనరీ కొనుగోలు రూ.2,95,95,000 పోస్టేజీ, టెలిఫోన్ బిల్లులు రూ.2,00,000 వాహనాలు రూ.55,17,000 పబ్లికేషన్ రూ.3,22,00,000 పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లు రూ.5,34,35,000 ఇంధనం (వాహనాలకు పెట్రోల్, డీజిల్) రూ.14,16,000 న్యాయవాదుల ఫీజులు రూ.1,00,000 -
అక్కడికి వెళ్లారంటే.. అంతేనా?
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి మన జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాలకు ప్రత్యేక పాలన అందిస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇప్పటివరకు అక్కడి ప్రజ లకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టని పాలకులు ఆయా మండలాలకు, గ్రామాలకు నియమిస్తున్న అధికారులను మాత్రం ఏరికోరి ‘ప్రత్యేకం’గా ఎంపిక చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వివిధ ఆరోపణలపై గతంలో సస్పెండైన ఉద్యోగులు, శాఖాపరమైన విచారణ ఎదుర్కొన్న అధికారులు, చార్జ్‌మెమోలు అందుకున్న సిబ్బంది, ఉద్యోగ బాధ్యతల పరంగా లెక్కకు మించి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న వారినే ఆయా ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారన్న వాదనలు బలంగా ఉన్నాయి. అందరూ కాదు గానీ.. ఎక్కువగా పనిష్మెంట్ బ్యాచ్‌నే ఆ రెండు మండలాలకు కేటాయిస్తున్నారన్న వాదనలు సాక్షాత్తు అధికార వర్గాల నుంచే వినిపిస్తుండటం గమనార్హం. పోలీస్ శాఖాపరంగా గతంలో ఉండి, భీమవరంలో పనిచేసిన ఒకరిని అక్కడికి బదిలీ చేశారు. గతంలో సస్పెండైన సదరు ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తివేశాక తొలి పోస్టింగ్ విలీన మండలాల్లోనే ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పీఎస్‌లో లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన మరో ఉద్యోగిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ విలీన మండలానికి పంపించారు. అక్కడ నియమితులైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లోనూ చాలామందిపై వివిధ ఆరోపణలు ఉన్నాయి. కుకునూరుకు బదిలీ అయిన ఓ రెవెన్యూ అధికారి వాణీమోహన్ కలెక్టర్‌గా ఉన్న సందర్భంలో కలెక్టరేట్లోనే పనిచేసేవారు. అప్పట్లో ఆయన పనితీరుపై నిందలు రాగా, ఎన్నికల సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేశారు. ఆ ఉద్యోగి సతీమణి ఏలూరులోనే పనిచేస్తుండటంతో ఈ జిల్లాకు బదిలీ కోసం యత్నించగా, చివరకు ఆయన్ని ఆ విలీన మండలాలకు పంపించారు. మరో రెవెన్యూ ఉద్యోగిది కూడా ఇటువంటి కథే. ఆ ఉద్యోగి డెల్టా ప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో విద్యార్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కూడా నాకేంటి అని లెక్కలు వేసుకునే వాడన్న ఆరోపణలు ఉన్నాయి. మండల పరిషత్ ఉద్యోగుల్లో కూడా చాలామంది ఆరోపణలు ఉన్న వారే. వేలేరుపాడుకు బదిలీ అయిన ఓ ఉద్యోగి గతంలో గోపాలపురం నియోజకవర్గంలోని మండలాల్లో పనిచేశారు. నల్లజర్లలో ఆయన పనిచేసిన సందర్భంలో నిధుల అవకతవకలపై విచారణ జరిగింది. ద్వారకాతిరుమలలో పనిచేస్తున్నప్పుడు పంచాయతీ విస్తరణ అధికారి సదరు ఉద్యోగి తనను వేధిస్తున్నారంటూ కేసు కూడా పెట్టారు. కుకునూరుకు కేటాయిం చిన మరో ఉద్యోగిదీ ఇంతకుమించిన చరిత్రే. ఏజెన్సీలో పనిచేసినప్పుడు ఈయనపై ఏసీబీ కేసు కూడా నడిచింది. పంచాయతీ ఉద్యోగులు, గ్రామస్థాయి సిబ్బందిలో కూడా చాలామంది ఇదే బాపతు కావడం గమనార్హం. వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులను అక్కడికి బదిలీ చేయడం యాధృచ్ఛికంగా జరిగిందా.. లేదా ఉద్దేశపూర్వకమా..? ఏమో కానీ అభివృద్ధికి సుదూరంలో ఉన్న ఆయా మండలాల్లో సదరు ఉద్యోగులు, అధికారులు ‘ప్రత్యేక’ పాలన ఎలా సాగిస్తారో చూడాల్సిందే!? - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు