సాక్షి, మచిలీపట్నం/చిలకలపూడి : స్థానిక సంస్థల సమరానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018, జులై నెలాఖరుతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహాలు మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఉత్తర్వులు అందాయి. జనాభా ప్రతిపదికన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారుచేసే అంశమై జిల్లావ్యాప్తంగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికకు ప్రధానమైన వ్యయం అంశంలో అధికారులు స్పష్టతకు వచ్చారు. వివిధ ఖర్చులకు గానూ రూ.17.72 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు రూ.4 కోట్లు మాత్రమే వెచ్చించారు. ప్రస్తుతం నిత్యావసరాలు, వివిధ సామగ్రి, ఇంధనం తదితర ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ఎన్నికలకు ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో గత ఎన్నికల వ్యయానికి, ప్రస్తుత వ్యయానికి రూ.13.72 కోట్ల మేర వ్యత్యాసం ఏర్పడింది.
- గత ఎన్నికల ఖర్చు : రూ.4 కోట్లు
- ప్రస్తుత ఖర్చు : రూ.17.72 కోట్లు
- మొత్తం పంచాయతీలు : 970
- పూర్తిస్థాయిలో పాలకవర్గంలేనిది : 1
- ఉప సర్పంచ్‌ల ద్వారా నడుస్తున్నవి : 30
జిల్లావ్యాప్తంగా..
జిల్లాలో 49 మండలాలు, వాటి పరిధిలో 970 పంచాయతీలు ఉన్నాయి. అందులో 120 మేజర్ పంచాయతీలు. 2013లో అన్ని పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం 49 పంచాయతీలను విజయవాడ కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు.
ముసాయిదా మేరకు రిజర్వేషన్ల కల్పన
ఆయా గ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా విభజన జరగనుంది. ఈనెల 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం తీవ్రంగా కృషిచేస్తోంది. తద్వారా ఓటర్ల ముసాయిదా జాబితా వెలువడితే.. ఓటర్ల జాబితాను పంచాయతీల వారిగా రూపొందించి, ఓటర్లను కులాలవారీగా విభజించనున్నారు. విభజించిన ఓటర్ల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో కులాలవారీగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతారు.
ఎన్నికలా.. ప్రత్యేక పాలనా?
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్లనుందా? లేక ప్రధాన ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? అప్పటివరకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకాధికారుల పాలనతో కాలం వెల్లదీస్తారా? అన్న వాదనలు వినవస్తున్నాయి.
పాలకవర్గాలు లేని వాటికీ ఎన్నికలు
పంచాయతీ పాలక వర్గాలు లేని వాటికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1 పంచాయతీలో మాత్రమే పూర్తి స్థాయిలో పాలకవర్గం లేదు. మిగిలిన 30 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లతో పాలన కొనసాగుతోంది. పాలకవర్గం లేని పంచాయతీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఓట్ల వివరాలు
2011 జనాభా లెక్కల ఆధారంగా, 29,25,100 మంది ఓంటర్లు ఉండగా, అందులో 14,68,763 మంది పురుషులు, 14,56,451 మంది మహిళలు ఉన్నారు. కానీ, ఈసారి ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 49 మండలాల పరిధిలో ఎస్టీ పురుషులు 51,331, మహిళలు 50,733 మంది ఉన్నారు. ఎస్సీ పురుషులు 3,50,376, మహిళలు 3,48,831 మంది. ఇతరులు 10,67,056 మంది పురుషులుండగా, 10,56,847 మంది మహిళలు ఉన్నారు.
ఎన్నికల ఖర్చు రూ.17.72 కోట్లు
ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు టీఏ, డీఏ, స్టేషనరీ కొనుగోలు, పోస్జేజీ, వాహనాలు, పబ్లికేషన్, ఎన్నికల బూత్‌ల వద్ద ఏర్పాట్లు, అధికారుల పర్యవేక్షణకు వినియోగించే వాహనాలకు ఇంధనం ఖర్చులకు రూ.17.72 కోట్లు అవసరమని పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో ఖర్చు వివరాలు పరిశీలిస్తే..
సామగ్రి | ఖర్చు |
ఓటర్ల జాబితా తయారీ | రూ.90,21,290 |
ఎన్నికల సిబ్బందికి టీఏ, డీఏ | రూ.4,57,83,600 |
స్టేషనరీ కొనుగోలు | రూ.2,95,95,000 |
పోస్టేజీ, టెలిఫోన్ బిల్లులు | రూ.2,00,000 |
వాహనాలు | రూ.55,17,000 |
పబ్లికేషన్ | రూ.3,22,00,000 |
పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లు | రూ.5,34,35,000 |
ఇంధనం (వాహనాలకు పెట్రోల్, డీజిల్) | రూ.14,16,000 |
న్యాయవాదుల ఫీజులు | రూ.1,00,000 |
Comments
Please login to add a commentAdd a comment