నూతనం..ప్రత్యేకం!    | Special Officers Rule From Tomorrow | Sakshi
Sakshi News home page

నూతనం..ప్రత్యేకం!   

Published Wed, Aug 1 2018 9:02 AM | Last Updated on Wed, Aug 1 2018 9:02 AM

Special Officers Rule From Tomorrow - Sakshi

నూతనంగా ఏర్పాటైన బురాన్‌పల్లి పంచాయతీ కార్యాలయం

పంచాయతీల పాలకమండళ్ల గడువు బుధవారంతో ముగియనుంది. అయితే సర్పంచులనే పర్సన్‌ ఇన్‌చార్జులుగా కొనసాగిస్తే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పాలనకే పచ్చజెండా ఊపింది. పంచాయతీకో స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన ఎంపీడీఓలు కలెక్టర్‌ ఆమోదం కోసం పంపారు. బుధవారం సాయంత్రం లోపు ప్రత్యేక అధికారుల లిస్ట్‌ విడులయ్యే అవకాశముంది. ఆ వెంటనే జిల్లాలోని పాత పంచాయతీలతో పాటు నూతనంగా ఆవిర్భవించిన జీపీల్లో ప్రత్యేక పాలనకు తెరలేవనుంది.    

సాక్షి, వికారాబాద్‌ : గ్రామాల్లో ప్రత్యేక పాలనకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్లు కొలువుదీరనున్నారు. నూతనంగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లాలో 367 పంచాయతీలుండేవి. 500కుపైగా జనాభా కలిగిన అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలను జీపీలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు.. అదనంగా 198 పంచాయతీలు ఏర్పడ్డాయి.

దీంతో జిల్లాలో వీటి సంఖ్య 565కు చేరింది. ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేయాల్సిన బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల జాబితాను రూపొందించిన వీరు లిస్ట్‌ను కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఈ నెల 12వ తేదీ వరకు సెలవులో ఉండడంతో.. పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావుకు అప్పగించారు.

జిల్లాలోని 18 మండలాల ఎంపీడీఓలు పంపించిన ప్రత్యేకాధిరుల ప్రతిపాదిత జాబితాను ఐదు రోజుల క్రితం డీపీఓ మాజిద్‌ సమక్షంలో పరిశీలించారు. జాబితాకు తుది రూపునిచ్చిన అనంతరం స్పెషల్‌ ఆఫీసర్ల వివరాలను బుధవారం కలెక్టర్‌ అధికారికంగా విడుదల చేయనున్నారు.   

మూడు జీపీలకో అధికారి... 

ప్రతీ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఇందుకు సరిపడా అధికారులు లేకపోవడంతో జాబితా రూపొందించడం ఎంపీడీఓలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రభుత్వ శాఖలనుంచి అధికారుల లిస్ట్‌ తయారు చేసి కలెక్టర్‌కు అందజేశారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన తదితర శాఖలతో పాటు సీనియర్‌ అసిస్టెంట్లు, ఫ్యానల్‌ గ్రేడ్‌– 1 ప్రధానోపాధ్యాయులను కూడా పరిగణనలోని తీసుకున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కో పంచాయతీ బాధ్యతలు అప్పగించాలని భావించనప్పటికీ అధికారుల కొరత కారణంగా మూడు లేదా నాలుగు జీపీలకు ఒక గెజిటెడ్‌ ఆఫీసర్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 35 పంచాయతీలున్నాయి.

మండలానికి సగటున 30 జీపీలు ఉండడంతో.. పది మంది అధికారులను గుర్తించి వీరికి కనీసం మూడు పంచాయతీల చొప్పున అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా మండలాల ఎంపీడీఓలు అందించిన ప్రత్యేకాధికారుల జాబితాను పరిశీలించిన డీపీఓ.. కలెక్టర్‌ సమక్షంలో దీనికి తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌ ఆమోదంతో బుధవారంలోపు ప్రత్యేక అధికారులకు నియామకపత్రాలు అందజేయనున్నారు.   

పండుగ వాతావరణంలో.. 

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 198 పంచాయతీల్లో గురువారం నుంచి ప్రత్యేక పాలన ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జీపీలకు ప్రభుత్వ భవనాలు తీసుకోవాలని, అందుబాటులో లేని గ్రామాల్లో అద్దె భవనాల్లో ఆఫీసులు తెరవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త పంచాయతీల్లో పాలన ప్రారంభం పండుగ వాతావరణంలో ఉండాలని పేర్కొంది.

నూతన జీపీలకు బోర్డులు రాయించడంతో పాటు కార్యాలయం పేరుతో రబ్బరు స్టాంపు, ఫర్నిచర్, రికార్డుల నిర్వహణకు కొత్త పుస్తకాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. నూతన పంచాయతీల్లో పాలన నిర్వహించే భవనాలకు రంగులు వేయాలని సూచించింది. వీటి కొనుగోలు, తదితర ఖర్చులకు ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ఆగస్టు రెండో తేదీనుంచి అమలయ్యేలా పంచాయతీలకు సంబంధించి బ్యాంకులో అకౌంట్‌ తెరవాలని సూచించింది.

ఆయా జీపీల అభివృద్ధికి ఈ ఖాతాలో నిధులను జమచేయనున్నట్లు ప్రకటించింది. పాత పంచాయతీల నుంచి జనాభావారీగా కొత్త జీపీలకు నిధుల పంపకం జరగనుంది. పాత పంచాయతీలోని రికార్డులు, స్థిర, చరాస్తులు దామాషా ప్రకారం పంపకం జరగాలని.. పీఆర్‌ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో 2వతేదీ నుంచి పంచాయతీల్లో పాలన పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement