panchayathi office
-
పంచాయతీ రికార్డుల కాల్చివేత
చిత్తూరు, సాక్షి/ వాల్మీకిపురం: వాల్మీకిపురం మేజర్ పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు కార్యాలయానికి సెలవులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సిబ్బంది కార్యాలయానికి రావడంతో విషయం బయటపడింది. అప్పటికే కార్యాలయంలో రికార్డులన్నీ కాలి బూడిదయ్యాయి. కుర్చీలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. కంప్యూటర్లను దుండగులు పగులగొట్టారు. సమాచారం నిక్షిప్తమై ఉన్న హార్డ్ డిస్కులను పట్టుకెళ్లారు. బీరువాను పగులగొట్టి రికార్డులకు నిప్పు పెట్టారు. దీనిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దశాబ్దాల రికార్డులన్నీ బూడిదయ్యాయి. పట్టణంలో వేలాది ప్రైవేటు కుళాయిలకు సంబంధించినరికార్డులు, ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతి వివరాలు, పంచాయితీ ఆధ్వర్యంలో లక్షలకు లక్షలు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన ఎంబుక్‌లు అన్నీ బూడిదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయితీకి నిధులు వరద పారింది. వీటిఖర్చుకు సంబంధించిన వివరాలు, మేజర్ పంచాయితీ ఆధ్వర్యంలో వసూలు చేసే ట్యాక్సులు, పన్నులు, రుసుములు, అద్దెలకు సంబం ధించిన విలువైన వివరాలన్నీ కాలిబూడిదైపోవడంతో వాల్మీకిపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఆరోపణలు.. వాల్మీకిపురం జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఒకటి. పంచాయతీకి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.3 కోట్ల వరకు నిధులు వచ్చాయి. వీటిని మాజీ సర్పంచ్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. ఇష్టారీతిన ఖర్చు చేసి దొంగ బిల్లులు సృష్టించారని స్థానిక నాయకులు చెబుతున్నారు. లే అవుట్లకు అధిక ఫీజులు వసూలు చేసి ఖజానాకు జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారని సమాచారం. మంచినీటి కుళాయిల అనుమతులకు ప్రజల నుంచి ఇష్టానుసారం వసూలు చేశారు. ఒక్కో కుళాయికి రూ.5 వేలు వసూలు చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం రూ.10 నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసి అంతమేరకు బిల్లులు ఇచ్చారు. దీనికి ఇన్చార్జి ఈవో ఉదయ్‌కుమార్, స్పెషలాఫీసర్ అహ్మద్‌కు స్థానిక అధికారుల పూర్తి సహాయ సహకారా లున్నాయని సమాచారం. ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.3 కోట్ల వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాల్మీకిపురం పంచాయతీకి రూ.45 లక్షల నిధులు వచ్చాయి. వీటి ఖర్చుకు సంబంధించిన లెక్కలు ఇప్పటికీ ప్రభుత్వానికి సమర్పించలేదు. ఆడిట్లో బయట పడకూడదనేనా? మరో వారంలో ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించున్నారు. అవినీతి మొత్తం బయట పడుతుందనే రికార్డులన్నింటినీ తగులబెట్టారని ఆరోపణలు వినపడుతున్నాయి. కంప్యూటర్లలో సమాచారం ఉంటుందనే ఉద్దేశంతో వాటిని కూడా పగులగొట్టారు. మంచినీటి కుళాయి బిగించడానికి చేసిన వసూళ్లు, ఆస్తిపన్నులు, లే అవుట్లపై అధిక వసూళ్లు బయటపడుతాయని ఉద్దేశంతోనే రికార్డులను కాల్చివేశారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు రవి విమర్శించారు. నిందితులను పట్టుకుంటాం రికార్డులను కాల్చివేసిన దుండగులను త్వరలోనే పట్టుకుంటాం. కాల్చివేత వెనుక దురుద్దేశం ఏదైనా ఉంటే విచారణలో బయటపడుతుంది. దుండగులు బీరువాలో ఉండే రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారు. తెలిసిన వారే ఇదంతా చేసి ఉంటారని అనుమానం. ఏది ఏమైనా కేసును త్వరలోనే ఛేదిస్తాం. నిందితులను పట్టుకుంటాం. – ఉలాసయ్య, సీఐ, వాల్మీకిపురం -
దేశంలో తెలంగాణ నంబర్‌వన్
నిజాంసాగర్(జుక్కల్) : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అ హర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, గున్కుల్, తె ల్గాపూర్, గిర్నితండా, దూప్‌సింగ్ తండాల్లో గురు వారం పంచాయతీ భవనాలను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశాల్లో ఆయన మాట్లాడారు. పరిపాలన సౌల భ్యం కోసం ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పా టు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చడం లక్ష్యంగా పంచాయతీలను బలోపేతం చేస్తున్నారన్నారు. గున్కుల్‌లో మొక్కలు నాటారు. సుపరిపాలన ఆగస్టు మాసంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అద్భుతాలు చేకూరుస్తున్నాయని దఫేదార్ రాజు అన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడంతో గ్రామాలు, గిరిజన తండాల్లో సుపరిపాలన సాధ్యమైందన్నారు. అలాగే కంటి సమస్యతో బాధపడుతున్న వృద్ధు లు, మహిళలకు వెలుగునివ్వాలన ఉద్దేశ్యంతో ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ప్రమాదవశాత్తు, సాధారణ మరణం పొందిన బాధిత కుటుంబానికి మేలు చేకూరేలా ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, ఎంపీడీవో రాములునాయక్, టీఆర్ఎస్ నాయకులు వినయ్‌కుమార్, గడ్డం గంగారెడ్డి, వాజిద్‌అలీ, అహ్మద్‌హుస్సేన్, బేగరి రాజు, లింగాల రాంచందర్, కలకొండ నారాయణ, సాయాగౌడ్, చందర్‌గౌడ్, బల్రాం, చెందర్, దఫేదార్ విజయ్, కాశయ్య, మహేందర్, రాజన్న యువసేన సభ్యులు సంపత్, గోవీర్, ప్రవీణ్, శ్యాం, వికాస్‌గౌడ్, బొర్ర నరేశ్, స్వామిగౌడ్ పాల్గొన్నారు. -
కొత్త పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోండి
జోగిపేట(అందోల్) సంగారెడ్డి : జిల్లాలో మొదటి నూతన పంచాయతీ భవనాన్ని బ్రాహ్మణపల్లిలోనే నిర్మిస్తానని, అందుకు అవసరమైన నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ ప్రకటించారు. గురువారం అందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుణ్యమాఅని నియోజకవర్గంలో చాలా వరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త పంచాయతీల్లో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాన్ని అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా నాకు ఇష్టమైన బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చానని అన్నారు. తనకు భగవంతుడు ఆకాశమంత కీర్తిని ఇవ్వగలిగాడని, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా ఉంటే ఆస్ట్రేలియాలో ప్రధాని పక్కన కూర్చునే కార్యక్రమానికి వెళ్లే వాడినని, అలాంటి గుర్తింపు తనకు ఉందని, గ్రామాల్లో కొన్ని కలుపు మొక్కల వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింగ్‌రావు, తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వర్కల అశోక్, కౌన్సిలర్లు శ్రీకాంత్, గోపాల్, లక్ష్మణ్, నవీన్, గ్రామ పెద్దలు నారాయణ భట్టాచారి, సుదర్శన భట్టాచారి, ఈఓ పీఆర్డీ శ్రీనివాసరావు, ఏపీఓ అర్చన, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, మాణిక్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ యశస్విని, టీఆర్ఎస్ పట్టణ, యవత అ«ధ్యక్షుడు సీహెచ్. వెంకటేశం, జి.రవీంద్రగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జాకీర్, శ్రీధర్‌రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
నూతనం..ప్రత్యేకం!
పంచాయతీల పాలకమండళ్ల గడువు బుధవారంతో ముగియనుంది. అయితే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగిస్తే చట్టపరంగా చిక్కులు ఎదురవుతాయని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పాలనకే పచ్చజెండా ఊపింది. పంచాయతీకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన ఎంపీడీఓలు కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. బుధవారం సాయంత్రం లోపు ప్రత్యేక అధికారుల లిస్ట్ విడులయ్యే అవకాశముంది. ఆ వెంటనే జిల్లాలోని పాత పంచాయతీలతో పాటు నూతనంగా ఆవిర్భవించిన జీపీల్లో ప్రత్యేక పాలనకు తెరలేవనుంది. సాక్షి, వికారాబాద్ : గ్రామాల్లో ప్రత్యేక పాలనకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి స్పెషలాఫీసర్లు కొలువుదీరనున్నారు. నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాలో 367 పంచాయతీలుండేవి. 500కుపైగా జనాభా కలిగిన అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలను జీపీలుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. అదనంగా 198 పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లాలో వీటి సంఖ్య 565కు చేరింది. ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేయాల్సిన బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల జాబితాను రూపొందించిన వీరు లిస్ట్‌ను కలెక్టర్‌కు పంపించారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఈ నెల 12వ తేదీ వరకు సెలవులో ఉండడంతో.. పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు అప్పగించారు. జిల్లాలోని 18 మండలాల ఎంపీడీఓలు పంపించిన ప్రత్యేకాధిరుల ప్రతిపాదిత జాబితాను ఐదు రోజుల క్రితం డీపీఓ మాజిద్ సమక్షంలో పరిశీలించారు. జాబితాకు తుది రూపునిచ్చిన అనంతరం స్పెషల్ ఆఫీసర్ల వివరాలను బుధవారం కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. మూడు జీపీలకో అధికారి... ప్రతీ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఇందుకు సరిపడా అధికారులు లేకపోవడంతో జాబితా రూపొందించడం ఎంపీడీఓలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రభుత్వ శాఖలనుంచి అధికారుల లిస్ట్ తయారు చేసి కలెక్టర్‌కు అందజేశారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన తదితర శాఖలతో పాటు సీనియర్ అసిస్టెంట్లు, ఫ్యానల్ గ్రేడ్– 1 ప్రధానోపాధ్యాయులను కూడా పరిగణనలోని తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పంచాయతీ బాధ్యతలు అప్పగించాలని భావించనప్పటికీ అధికారుల కొరత కారణంగా మూడు లేదా నాలుగు జీపీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రతి మండలంలో సుమారు 20 నుంచి 35 పంచాయతీలున్నాయి. మండలానికి సగటున 30 జీపీలు ఉండడంతో.. పది మంది అధికారులను గుర్తించి వీరికి కనీసం మూడు పంచాయతీల చొప్పున అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా మండలాల ఎంపీడీఓలు అందించిన ప్రత్యేకాధికారుల జాబితాను పరిశీలించిన డీపీఓ.. కలెక్టర్ సమక్షంలో దీనికి తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆమోదంతో బుధవారంలోపు ప్రత్యేక అధికారులకు నియామకపత్రాలు అందజేయనున్నారు. పండుగ వాతావరణంలో.. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 198 పంచాయతీల్లో గురువారం నుంచి ప్రత్యేక పాలన ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జీపీలకు ప్రభుత్వ భవనాలు తీసుకోవాలని, అందుబాటులో లేని గ్రామాల్లో అద్దె భవనాల్లో ఆఫీసులు తెరవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త పంచాయతీల్లో పాలన ప్రారంభం పండుగ వాతావరణంలో ఉండాలని పేర్కొంది. నూతన జీపీలకు బోర్డులు రాయించడంతో పాటు కార్యాలయం పేరుతో రబ్బరు స్టాంపు, ఫర్నిచర్, రికార్డుల నిర్వహణకు కొత్త పుస్తకాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు అందాయి. నూతన పంచాయతీల్లో పాలన నిర్వహించే భవనాలకు రంగులు వేయాలని సూచించింది. వీటి కొనుగోలు, తదితర ఖర్చులకు ఇప్పటికే నిధులు విడుదల చేసింది. ఆగస్టు రెండో తేదీనుంచి అమలయ్యేలా పంచాయతీలకు సంబంధించి బ్యాంకులో అకౌంట్ తెరవాలని సూచించింది. ఆయా జీపీల అభివృద్ధికి ఈ ఖాతాలో నిధులను జమచేయనున్నట్లు ప్రకటించింది. పాత పంచాయతీల నుంచి జనాభావారీగా కొత్త జీపీలకు నిధుల పంపకం జరగనుంది. పాత పంచాయతీలోని రికార్డులు, స్థిర, చరాస్తులు దామాషా ప్రకారం పంపకం జరగాలని.. పీఆర్ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో 2వతేదీ నుంచి పంచాయతీల్లో పాలన పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
పంచాయతీ నిధులకు బ్రేకు
మోర్తాడ్(బాల్కొండ) : గ్రామాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయనీయకుండా సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ బ్రేకు వేసింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరైన నిధులతో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడంతో పంచాయతీ పాలకవర్గాలు అయోమయానికి గురవుతున్నాయి. ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడం వల్ల ఆర్థిక సంఘం నిధులను వినియోగించలేక పోతున్నామని సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పంచాయతీల పదవీ కాలం త్వరలో ముగిసిపోనున్న తరుణంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపు పూర్తి కాకపోవడంతో మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రెండు విడతలలో నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాలలో నీటి సమస్య పరిష్కారం కోసం బోరుబావుల ఫ్లెష్సింగ్, పంపుసెట్ల మరమ్మతులు, కొత్త వాటిని కొనుగోలు చేయడం, మురికి కాలువల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక సంఘం నిధులను వినియోగించాల్సి ఉంది. నిధులు జనవరి తరువాత విడుదల కాగా పంచాయతీ ఖాతాల్లో ఉన్నతాధికారులు జమ చేశారు. కాని ఇంత వరకు నిధులను వినియోగించడానికి అవకాశం రాలేక పోయింది. పంచాయతీల పరిధిలోని జనాభా ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయి. పంచాయతీల జనాభాను పరిగణనలోకి తీసుకుని ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులను కేటాయించారు. ఇందులో దాదాపు 20 శాతం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మినహాయిస్తున్నారు. మిగిలిన 80 శాతం నిధులను అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంది. ప్రతి పంచాయతీకి గతంలో బీఆర్జీఎఫ్, ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ తదితర నిధులు మంజూరయ్యేవి. పంచాయతీల కోసం నిర్దేశించిన కార్యక్రమాల ద్వారా నిధులు కేటాయించే విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులపైనే పంచాయతీలు ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ట్రెజరీలలో ఫ్రీజింగ్ అమలు కావడంతో ఏమి చేయాలో పంచాయతీల పాలకవర్గాలకు పాలుపోవడం లేదు. జిల్లాలో 393 పాత పంచాయతీలు ఉండగా ఈ అన్ని పంచాయతీలలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా పంచాయతీ పాలకవర్గాలలో ఎక్కువ భాగం అధికార పార్టీ నాయకులే ఉన్నారు. ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించిన విషయంపై తాము ఏమి మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందని అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించకుండా ప్రభుత్వం ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించడం వల్ల జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రెజరీలలో ఫ్రీజింగ్ ఎత్తివేసి బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలుపాలని పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి. పది రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చు ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్‌కు సంబంధించిన సమస్య పది రోజుల్లో పరిష్కారం కావచ్చు. ఫ్రీజింగ్ ఎత్తివేసిన సమయంలో బిల్లులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. తొందరలోనే ఫ్రీజింగ్ నిలిపివేసి బిల్లులు చెల్లింపు చేసే అవకాశం ఉంది. – రామానాయుడు, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ట్రెజరీ శాఖ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధిం చడం వల్ల పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి పనులు వేగంగా జరుగాలంటే నిధులు ఎంతో అవసరం. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తు ఫ్రీజింగ్ విధించడం సరికాదు. – శివన్నోల్ల వైష్ణవి, సర్పంచ్, ఏర్గట్ల ఫ్రీజింగ్ ఎత్తివేయాలి పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలి. ట్రెజరీలలో నిధుల వినియోగంపై ఫ్రీజింగ్ విధించడం వల్ల అభివృద్ధి పనులు చేయలేక పోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్రీజింగ్ ఎత్తివేయాలి. – ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్ -
జీపీ భవనాలకు అదనపు నిధులు
మోర్తాడ్(బాల్కొండ) : ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి నిర్మిస్తున్న పంచాయతీలకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో భవనానికి రూ. 3 లక్షల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాలకు కొత్త భవనాలను నిర్మించడానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ. 13 లక్షల చొప్పున కేటాయించారు. అయితే ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడానికి నిధులు సరిపోకపోవడంతో పంచాయతీ భవనాలు వినియోగంలోకి రాలేకపోయాయి. అదనంగా నిధులు కేటాయిస్తేనే పనులు పూర్తి చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు భావించారు. జిలాŠోల్ల మొదటి విడతలో కొన్ని భవనాలను నిర్మించగా అప్పట్లో ఒక్కో భవనానికి రూ. 11 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడంతో నిధులు సరిపోయాయి. అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మరో 52 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 6 కోట్ల 76 లక్షలను కేటాయించారు. భవనాల నిర్మాణం పూర్తయినా సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ వేయడానికి నిధులు సరిపోలేదు. అంచనాలకు మించి వ్యయం పెరిగిపోవడంతో అదనంగా మరింత నిధులు అవసరం అని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీకి రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు సూచిస్తున్నారు. సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్ కోసం రూ. 3 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 1.56 కోట్ల నిధులు అదనంగా అవసరం అవుతున్నాయి. ఈ నిధులను కేటాయిస్తే జిల్లాలోని పంచాయతీ భవనాల కోసం ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 8.32 కోట్లు కేటాయించినట్లు జరుగుతుంది. ప్రభుత్వమే అదనపు నిధులను విడుదల చేయడానికి ప్రతిపాదనలు కోరగా ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నిధులు తొందరలోనే విడుదల అవుతాయని నిధుల కేటాయింపు జరగగానే పంచాయతీ భవనాలను వినియోగంలోకి తీసుకు రావడానికి పనులను పూర్తి చేయిస్తామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. అదనపు నిధులు కేటాయించడం సబబే.. గ్రామ పంచాయతీ భవనాలకు అదనంగా రూ. 3 లక్షల చొప్పున నిధులను కేటాయించడం సబబే. రూ. 13 లక్షలతో భవన నిర్మాణం పూర్తి కాగా ఇతర సౌకర్యాల కోసం అదనంగా నిధులు అవసరం ఉన్నాయి. పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం సమంజసమే. – నాగం పోశన్న, సర్పంచ్, వడ్యాట్ నిధులు మంజూరైతేనే భవనాలు వినియోగంలోకి ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కేటాయించిన రూ. 13 లక్షల నిధులతో భవనాలను నిర్మించారు. కానీ సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పుడు రూ. 3 లక్షల అదనపు నిధులు మంజూరైతే సౌకర్యాలు వృద్ధి చెంది భవనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి. – లింగన్న, సర్పంచ్, దోన్పాల్ -
పంచాయతీలకు బకాయిల షాక్!
శ్రీకాకుళం ,పాలకొండ రూరల్: పంచాయతీలకు బకాయిల షాక్ తగలనుంది. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుండటంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. నిధులు లేకపోవడంతో వీటిని ఎలా చెల్లించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 2016 నుంచి 2017 ఫిబ్రవరి వరకు సుమారు రూ.56 కోట్ల బకాయిలు పంచాయతీల నుంచి రావాల్సి ఉందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. వీటిపై పలు పంచాయతీలు అప్పట్లో కోర్టులను ఆశ్రయించగా కొంతమేర వెసులుబాటు ఇచ్చిన ఈపీడీసీఎల్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసే పనిమిలో నిమగ్నమైంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 11 వందల పంచాయతీలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రూ.4కోట్ల పైబడి ఉన్నాయి. ఈ బిల్లులను ఈ నెల 20వ తేదీలో చెల్లించాలని విద్యుత్ శాఖ పంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తేల్చిచెప్పటంతో పంచాయతీ అధికారులు డైలమాలో పడ్డారు. పండగల సీజన్లో సరఫరా నిలిపివేస్తే పంచాయతీ వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని భావించి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో పంచాయతీ బిల్లులను ప్రభుత్వమే భరించేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాధారణ నిధులతోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ భారం గ్రామ పంచాయతీలపై పడింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో వార్షిక ఆదాయం తగ్గిపోవటంతో బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. గ్రామ పంచాయతీలకు ఒక్క మీటరే ఉండటం, వాడకం పెరిగిన కొద్దీ శ్లాబురేటు పెరగటంతో తెలియకుండానే భారం పెరిగిపోతోంది. వేధిస్తున్న నిధుల కొరత.. జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి నిధుల కొరత వేధిస్తోంది. ఉన్న నిధులు స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుండగా తాజాగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో అటు పాలకవర్గాలు, కార్యదర్శులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీలకు ఆదాయ వనరులుగా ఉన్న ఇంటిపన్నులు, ఆస్తిపన్నులు, కుళాయి పన్నులు గ్రామస్థాయిలో పేరుకుపోవంటతో పంచాయతీ ఆదాయానికి గండి పడింది. సీతంపేట సబ్‌డివిజన్ పరిధిలో.. ఒక్క సీతంపేట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో 2017 ఫిబ్రవరికి ముందు ఉన్న బకాయిలిలా ఉన్నాయి.. పాలకొండలో రూ.68 లక్షల 48 వేలు, సీతంపేటలో రూ.142.44 లక్షలు, వీరఘట్టంలో రూ.150.03 లక్షలు, బూర్జలో రూ.28.61 లక్షలు, వంగరలో రూ.76.10 లక్షల వంతున మొత్తం రూ.4కోట్ల 65 లక్షల 66 వరకు బకాయిలు ఉన్నాయి. 2017 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఐదు మండలాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.56 లక్షల 12వేలు. ఇప్పటివరకు వసూలైన మొత్తం కేవలం రూ.11 లక్షల 30 కావడంతో విద్యుత్ శాఖ సిబ్బంది బకాయిల వసూలు ఒత్తిడి తెస్తున్నారు. మరోసారి సందేశాలు పంపిస్తున్నాం బకాయిల వసూలుకు కసరత్తు చేస్తున్నాం. జిల్లావ్యాప్తం గా దాదాపు నాలుగు కోట్లు వసూలుకు లక్ష్యాలు విధించుకున్నాం. 2017 ఫిబ్రవరి నుం చి ఆగస్టు వరకు ఉన్న బకా యిల్లో ఇప్పటికి సుమారు రూ.రెండు కోట్లు వసూలైంది. మిగిలిన మొత్తాలు చెల్లించేలా పంచాయతీలకు మరోసారి సందేశాలు పంపిస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తాం. – దత్తి సత్యనారాయణ, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ఆళ్లగడ్డలో జల యుద్ధం
► నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు ► 500 మంది తరలివచ్చి నిరసన ► నగర పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయింపు మొదలైన నీటి మాఫియా..: ఆళ్లగడ్డలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటి మాఫియా డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని కొందరు ట్యాంకర్ల యజమానులు గొప్పలు చెప్పుకుంటున్నా నగర పంచాయతీ నుంచి ట్యాంకరుకు రూ. 400 నుంచి రూ. 500 వరకు బిల్లులు చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు నీరు కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే పరిస్థితిని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు గుంజుతున్నారని ఆరోపణలున్నాయి. నగర పంచాయతీ సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పందే ట్యాంకర్లను పంపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆళ్లగడ్డ: గుక్కెడు నీటి కోసం వందలాదిగా మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన సోమవారం ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల, నాయిబ్రాహ్మణ కాలనీ, ముస్లిం వీధి, కొత్త మసీదు, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులుగా కుళాయిలకు నీరు రావడం లేదు. ఇందుకు సంబంధించి నగర పంచాయతీ అధికారులు, పాలక వర్గానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగెత్తిపోయిన మహిళలు సోమవారం వివిధ కాలనీల నుంచి 500 మందికిపైగానగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమస్యపై చైర్పర్సన్ ఉషారాణిని నిలదీశారు. కనీసం రెండు రోజులకు ఓసారైనా నీటిని విడుదల చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెబుతున్నా మున్సిపాల్టీ ఉద్యోగులు, వారి బంధువులు, పలుకుబడి ఉన్న వారికి తప్ప పేదలకు చుక్కనీరు అందడం లేదన్నారు. -
పంచాయతీలకు సొంత గూడు
95 పంచాయతీలకు ఆర్‌జీపీఎస్‌ఏ నిధులు మంజూరు 5 వేల జనాభా దాటితే రూ.13.50 లక్షలు 5 వేలలోపు జనాభా ఉంటే రూ.12 లక్షలు ఏలూరు, న్యూస్‌లైన్ : పరాయి పంచన.. అద్దె భవనాలు.. బడి, గుడుల్లో నడుస్తున్న పంచాయతీ కార్యాలయాలకు సొంతగూళ్లు సమకూరనున్నారుు. జిల్లాలో 158 పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. వీటిలో 95 పంచాయతీలకు గూడు సమకూర్చేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా అమల్లోకి వచ్చిన రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరణ్ అభియాన్ (ఆర్‌జీపీఎస్‌ఏ) పథకం కింద భవనాలు నిర్మించదలిచారు. 5వేలకు మించి జనాభా గల పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున, 5వేల జనాభా ఉండే పంచాయతీ లకు రూ.12 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు చేపట్టనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజు వర్మ తెలిపారు. పర్యవేక్షణకు ఆదేశాలు పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలను ఈవోపీఆర్డీ, సర్పంచ్, కార్యదర్శులు, ఎంపీడీవోలు పర్యవేక్షించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదే శించారు. మిగిలిన 63 పంచాయతీలకు త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ గ్రామాలకు.. జిల్లాలో అత్యధికంగా లింగపాలెం మండలంలో 13 పంచాయతీలకు భవనాలు సమకూరనున్నాయి. ద్వారకాతిరుమల మండలంలో 10 పంచాయతీలకు కార్యాలయూలు నిర్మించనున్నారు. భీమవరం మం డలం దిరుసుమర్రు, కాళ్ల మండలం పెదఅమిరం, నల్లజర్ల మండలం పోతవరం, నిడదవోలు మండ లం తాడిమళ్ల, పాలకొల్లు మండలం లంకలకోడేరు, తాళ్లపూడి మండలం అన్నదేవరపేట, ఉండి మండ లం చెరుకువాడ, వీరవాసరం పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున వెచ్చించి పంచాయతీ కార్యాలయూలు నిర్మిస్తారు. ఆకివీడు మండలం చినకాపవరం, చినమిల్లిపాడు, భీమవరం మండలం దెయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్, నాగిడిపాలెం, పెదగరువు, యనమదుర్రు, చాగల్లు మండలం గౌరీ పల్లి, నందిగంపాడు, దెందులూరు మండలం మేది నరావుపాలెం, పెరుగ్గూడెం, ద్వారకాతిరుమల మం డలం సీహెచ్ పోతేపల్లి, జి.కొత్తపల్లి, గుండుగొలనుకుంట, జాజులకుంట, కోడిగూడెం, కొమ్మర, మద్దులగూడెం, రాళ్లకుంట, రామన్నగూడెం, తిమ్మాపు రం, యలమంచిలి మండలం అడవిపాలెం, బాడవ, కాజ వెస్ట్, లక్ష్మీపాలెం, మట్లపాలెం, నేరేడుమిల్లి, శిరగాలపల్లి, ఏలూరు మండలం కాట్లంపూడి, గణపవరం మండలం సీహెచ్ అగ్రహారం, ముగ్గుళ్ల, వీరేశ్వరపురం, కరగపాడు, వేళ్లచింతలగూడెం, కాళ్ల మండలం జక్కరం, ఎల్వీఎన్ పురం, కామవరపుకోట మండలం ఆడమిల్లి, తూర్పు యడవల్లి, కొవ్వూరు మండలం పెనకనమెట్ట, తోగుమ్మి, కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామాల్లో పంచాయతీ కార్యాలయూల నిర్మాణానికి నిధులు మంజూరయ్యూయి. లింగపాలెం మండలం ఆశన్నగూడెం, అయ్యపరాజుగూడెం, బాదరాల, బోగోలు, కలరాయనగూడెం, కొత్తపల్లి, లింగపాలెం, మఠంగూడెం, ములగలంపాడు, నరసన్నపాలెం, రంగాపురం, టీసీహెచ్‌ఆర్ పాలెం, యడవల్లి, మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, వారతిప్ప, నల్లజర్ల మండలం జగన్నాథపురం, పశ్చిమ చోడవరం, నరసాపురం మండలం కె.నవరసపురం, పసలదీవి, మర్రితిప్ప, రాజుగారితోట, వైఎస్ పాలెం, పాలకోడేరు మండలం కోరుకొల్లు, పెదపాడు మండలం గోగుంట, జయపురం, పెదవేగి మండలం జానంపేట, కె.కన్నాపురం, నడుపల్లి, పోడూరు మండలం కొమ్ముచిక్కాల, తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం, కొత్తూరు, కుంచనపల్లి, ఎల్.అగ్రహారం, మారంపల్లి, నందమూరు, నీలాద్రిపురం, పుల్లాయగూడెం, వెంకట్రావుపాలెం, ఉండి మండలం అర్తమూరు, ఉంగుటూరు మండలం ఎ.గోకవరం, అప్పారావుపేట, కంసాలిగుంట, తిమ్మయ్యపాలెం, వీఏ పురం, వీరవాసరం మండలం దూసనపూడి గ్రామాలకు పంచాయతీ కార్యాలయూలు సమకూరనున్నాయి. వీటిలో ఒక్కొక్క పంచాయతీకి రూ.12 లక్షల చొప్పున కేటాయించారు.