ఆళ్లగడ్డలో జల యుద్ధం
► నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
► 500 మంది తరలివచ్చి నిరసన
► నగర పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయింపు
మొదలైన నీటి మాఫియా..:
ఆళ్లగడ్డలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటి మాఫియా డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని కొందరు ట్యాంకర్ల యజమానులు గొప్పలు చెప్పుకుంటున్నా నగర పంచాయతీ నుంచి ట్యాంకరుకు రూ. 400 నుంచి రూ. 500 వరకు బిల్లులు చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు నీరు కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే పరిస్థితిని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు గుంజుతున్నారని ఆరోపణలున్నాయి. నగర పంచాయతీ సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పందే ట్యాంకర్లను పంపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆళ్లగడ్డ: గుక్కెడు నీటి కోసం వందలాదిగా మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన సోమవారం ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల, నాయిబ్రాహ్మణ కాలనీ, ముస్లిం వీధి, కొత్త మసీదు, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులుగా కుళాయిలకు నీరు రావడం లేదు. ఇందుకు సంబంధించి నగర పంచాయతీ అధికారులు, పాలక వర్గానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగెత్తిపోయిన మహిళలు సోమవారం వివిధ కాలనీల నుంచి 500 మందికిపైగానగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమస్యపై చైర్‌పర్సన్ ఉషారాణిని నిలదీశారు. కనీసం రెండు రోజులకు ఓసారైనా నీటిని విడుదల చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెబుతున్నా మున్సిపాల్టీ ఉద్యోగులు, వారి బంధువులు, పలుకుబడి ఉన్న వారికి తప్ప పేదలకు చుక్కనీరు అందడం లేదన్నారు.