మోర్తాడ్(బాల్కొండ) : గ్రామాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయనీయకుండా సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ బ్రేకు వేసింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరైన నిధులతో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడంతో పంచాయతీ పాలకవర్గాలు అయోమయానికి గురవుతున్నాయి. ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధించడం వల్ల ఆర్థిక సంఘం నిధులను వినియోగించలేక పోతున్నామని సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.
పంచాయతీల పదవీ కాలం త్వరలో ముగిసిపోనున్న తరుణంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపు పూర్తి కాకపోవడంతో మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రెండు విడతలలో నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాలలో నీటి సమస్య పరిష్కారం కోసం బోరుబావుల ఫ్లెష్సింగ్, పంపుసెట్ల మరమ్మతులు, కొత్త వాటిని కొనుగోలు చేయడం, మురికి కాలువల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గ్రామాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక సంఘం నిధులను వినియోగించాల్సి ఉంది.
నిధులు జనవరి తరువాత విడుదల కాగా పంచాయతీ ఖాతాల్లో ఉన్నతాధికారులు జమ చేశారు. కాని ఇంత వరకు నిధులను వినియోగించడానికి అవకాశం రాలేక పోయింది. పంచాయతీల పరిధిలోని జనాభా ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయి. పంచాయతీల జనాభాను పరిగణనలోకి తీసుకుని ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులను కేటాయించారు. ఇందులో దాదాపు 20 శాతం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు మినహాయిస్తున్నారు. మిగిలిన 80 శాతం నిధులను అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సి ఉంది.
ప్రతి పంచాయతీకి గతంలో బీఆర్‌జీఎఫ్, ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ తదితర నిధులు మంజూరయ్యేవి. పంచాయతీల కోసం నిర్దేశించిన కార్యక్రమాల ద్వారా నిధులు కేటాయించే విధానానికి కేంద్రం స్వస్తి పలికింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధులపైనే పంచాయతీలు ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ట్రెజరీలలో ఫ్రీజింగ్ అమలు కావడంతో ఏమి చేయాలో పంచాయతీల పాలకవర్గాలకు పాలుపోవడం లేదు. జిల్లాలో 393 పాత పంచాయతీలు ఉండగా ఈ అన్ని పంచాయతీలలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలా ఉండగా పంచాయతీ పాలకవర్గాలలో ఎక్కువ భాగం అధికార పార్టీ నాయకులే ఉన్నారు.
ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించిన విషయంపై తాము ఏమి మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందని అధికార పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించకుండా ప్రభుత్వం ట్రెజరీలలో ఫ్రీజింగ్ విధించడం వల్ల జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రెజరీలలో ఫ్రీజింగ్ ఎత్తివేసి బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలుపాలని పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి.
పది రోజుల్లో సమస్య పరిష్కారం కావచ్చు
ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్‌కు సంబంధించిన సమస్య పది రోజుల్లో పరిష్కారం కావచ్చు. ఫ్రీజింగ్ ఎత్తివేసిన సమయంలో బిల్లులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. తొందరలోనే ఫ్రీజింగ్ నిలిపివేసి బిల్లులు చెల్లింపు చేసే అవకాశం ఉంది.
– రామానాయుడు, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా ట్రెజరీ శాఖ
పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది
ట్రెజరీ కార్యాలయాల్లో ఫ్రీజింగ్ విధిం చడం వల్ల పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి పనులు వేగంగా జరుగాలంటే నిధులు ఎంతో అవసరం. కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తు ఫ్రీజింగ్ విధించడం సరికాదు.
– శివన్నోల్ల వైష్ణవి, సర్పంచ్, ఏర్గట్ల
ఫ్రీజింగ్ ఎత్తివేయాలి
పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి ప్రభుత్వం ఫ్రీజింగ్‌ను ఎత్తివేయాలి. ట్రెజరీలలో నిధుల వినియోగంపై ఫ్రీజింగ్ విధించడం వల్ల అభివృద్ధి పనులు చేయలేక పోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్రీజింగ్ ఎత్తివేయాలి.
– ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్
Comments
Please login to add a commentAdd a comment