‘అభివృద్ధి’లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం | 'Development' and 'negligence in the public representatives | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధి’లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

Published Mon, Jan 6 2014 3:42 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

'Development' and 'negligence in the public representatives

సాక్షి ప్రతినిధి నిజామాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికోసం మంజూర య్యే నిధులను కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్రహరీలు, ఆలయాలు, ప్రార్థన మంది రాలు, తాగునీటి అవసరాలకోసం వినియోగించవచ్చు. డ్రైనేజీల నిర్మాణం, నీటి ట్యాంకులు, బ్రిడ్జిలు, గ్రామ పంచాయతీ భవనాలు, మైనర్ ఫీడర్ చానల్స్, ట్రాన్స్‌ఫా ర్మర్ల మంజూరు తదితర వాటికోసం కూడా వెచ్చించవచ్చు. వీటితో పాటు అదనంగా కళాశాలలు, పాఠశాలల్లో కంప్యూటర్ల కొనుగోళ్ల కోసం నిధులను వినియోగించుకు నే అవకాశం ఎంపీలకు ఉంది.
 
అభివృద్ధి నిధులు ఇలా
ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున మంజూరైతే అందులోంచి రూ. 50 లక్షల పనులను స్థానిక ఎమ్మెల్యే నేరుగా ప్రతిపాదించవచ్చు. మిగిలిన మొత్తాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోటాగా పరిగణిస్తారు. నిబంధనల మేరకు వీటిని కూడా స్థానిక ఎమ్మెల్యే సిఫారసుల మేరకు ఖర్చు చేస్తారు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికార పార్టీ ఈ నిధులను దారి మళ్లిస్తోందన్న ఆరోపణలున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సూచించిన పనులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంజూరు చేస్తున్న ట్లు తెలుస్తోంది.
 
 ఖజానాలోనే
 జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 2010-11 నుంచి 2012-13 వరకు రూ. 22.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అయితే ఎమ్మెల్యేలందరూ కలిపి రూ. 16.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ. 5.98 కోట్ల నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయి. 2013-14 చివరి ఏడాది కావడంతో నిధులు పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. రూ. 4.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అయినప్పటికీ ఆగమేఘాలపై రూ. 6.07 కోట్ల విలువ చేసే 518 పనులను మంజూరు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పరిచేందుకు పెద్దమొత్తంలో పనులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
 
 బోధన్ లాస్ట్
 మూడేళ్లలో ఎమ్మెల్యే కోటా నిధుల వినియోగంలో బోధన్ నియోజక వర్గం అట్టడుగు స్థానంలో ఉంది. మూడేళ్లలో రూ. 2.50 కోట్ల నిధులు విడుదల కాగా వివిధ పనులకోసం రూ. 1.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మంత్రి కావడంతో వివిధ పథకాల నుంచి భారీగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నారని, అందుకే నియోజకవర్గ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ విప్ సైతం తక్కువగా నిధులను వినియోగించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆయన రూ.1.62 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే మాత్రమే కాస్త మెరుగ్గా(రూ.2.18 కోట్లు) నిధులను ఖర్చు చేశారు.
 
 నిధులు తక్కువ.. పనులు ఎక్కువ
 ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది తక్కువగా నిధులు విడుదలయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున  మాత్రమే వచ్చాయి. అయితే ఎమ్మెల్యేలు మాత్రం విడుదలైన నిధులకన్నా ఎక్కువ పనులను మంజూరు చేయడం గమనార్హం. నిజామాబాద్ అర్బన్‌లో రూ. 92 లక్షలతో 57 పనులు మంజూరు చేశారు. నిజామాబాద్ రూరల్‌లో రూ.89.50 లక్షలతో 96 పనులు, ఆర్మూర్‌లో రూ. 50 లక్షలతో 64 పనులు, కామారెడ్డిలో రూ. 95 లక్షలతో 90 పనులు, ఎల్లారెడ్డిలో రూ. 83 లక్షలతో 73 పనులు, బాన్సువాడలో రూ. 73 లక్షలతో 43 పనులు, జుక్కల్‌లో రూ. 50 లక్షలతో 54 పనులను చేపట్టారు. కాగా ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ నియోజకవర్గమైన బాల్కొండలో రూ. 31.50 లక్షలతో 25 పనులు, మంత్రి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గమైన బోధన్‌లో రూ. 44.50 లక్షలతో 16 పనులను మాత్రమే మంజూరు చేశారు.
 
 ఎంపీ రూటు సపరేటు
 నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ మాత్రం ఇందుకు భిన్నంగా నిధులను ఖర్చు చేశారు. నాలుగేళ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద రూ. 11.50 కోట్లు విడుదల కాగా.. ఆయన రూ. 13.47 కోట్ల పనులు మంజూరు చేశారు. 2009-10, 2010-11 సంవత్సరాల్లో రూ. 2 కోట్ల చొప్పున రూ. 4 కోట్లు విడుదలయ్యాయి. 2011-12, 2012-13 సంవత్సరాల్లో ఎంపీ ల్యాడ్స్ కింద ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున రూ. 10 కోట్లు విడుదల కావాల్సి ఉండగా.. రూ. 7.50 కోట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి మొత్తంగా రూ. 11.50 కోట్లు విడుదల కాగా 449 పనుల కోసం రూ. 13.47 కోట్ల నిధులను ఖర్చు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement