తూర్పుగోదావరి ,రాయవరం (మండపేట): మధ్యాహ్న భోజనం భేషుగ్గా ఉండాలి ... నిధులు మాత్రం అంతంతమాత్రమేనంటూ సర్కారు వ్యవహరించడంతో జిల్లాలోని మూడు లక్షల మంది విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు మంగళవారం (ఈ నెల 23) ఒక రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పడ్డారు. ఓ పక్క కళ్లెంలేని గుర్రంలా నిత్యావసర వస్తువుల ధరలు దౌడు తీస్తుంటే తాము పౌష్టికాహారాన్ని ఎలా అందించగలమంటూ మిడ్ డే మీల్ వర్కర్లు ఈ నెల 23న ఒక రోజు సమ్మె నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలో అమలు తీరిదీ...
జిల్లాలో 4,240 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుంది. 3,335 ప్రాథమిక, 321 ప్రాథమికోన్నత, 574 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. రోజుకు సరాసరిన మూడు లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకుంటున్నారు. జిల్లాలో అనపర్తి మండలం పొలమూరులోని బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 129, రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ సంస్థ ద్వారా 57, కాకినాడలోని అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా 84 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుండగా, మిగిలిన పాఠశాలల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు వండి వడ్డిస్తున్నాయి. జిల్లాలో 7,800 మంది మిడ్‌డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు.
సమ్మె ఎందుకు చేస్తున్నారంటే..
మిడ్ డే మీల్ వర్కర్లకు ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి వంతున ఇస్తుండగా, కనీస వేతన చట్టం ప్రకారం రూ.18 వేలు చెల్లించాలి. ’మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదు. ’విద్యార్థులకు చెల్లించే మెనూ ఛార్జీలు పెంచాలి. ’మిడ్‌డేమీల్ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలి. ’ప్రతి నెలా ఐదో తేదీలోపు బిల్లులు చెల్లించాలి. ’ప్రస్తుతం ఇవ్వాల్సిన గతేడాది జులై, నవంబరు, డిసెంబరు నెలల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ’మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా అవుతున్న బియ్యం 50 కేజీలకు దాదాపుగా నాలుగు కేజీల తరుగు వస్తోంది. దీన్ని నివారించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వీరు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఎలా వండి వార్చాలి..
పిల్లలంటే చాలు..ఎవరైనా ఎంతో ఇష్టంగా కొసరి కొసరి పెడతారు..కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఇంతే..సర్దుకోండంటూ..కోత పెట్టే పరిస్థితి మధ్యాహ్న భోజన పథకంలో కనిపిస్తోంది. కూరగాయల ధరలు చూస్తే..ఆకాశన్నంటుతుంటాయి. పప్పుల ధరలు గమనిస్తే రోజు రోజుకు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజనానికి ఆచితూచీ గతేడాది జూన్‌లో రూ.1.35 పెంచింది. ఈ నేపథ్యంలో చేసేది లేక నీళ్ల సాంబారు..అరాకొర పప్పుతో ఆకుకూర, గుడ్డులో కోత..చాలీ చాలని భోజనం పెడుతూ పిల్లల ఉసురు పోసుకుంటున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. పిల్లలు ఉదయం తినే రెండు ఇడ్లీ రూ.10 పెడితే గానీ రావడం లేదు. అలాంటిది రూ.6.48 ఇస్తే పప్పుకూర, గడ్డుకు ఏమాత్రం సరిపోతుందో ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇలా మధ్యాహ్న భోజనం పథకంలో పౌష్టికాహారం లోపంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ఈ పెంపు ఏపాటి..?
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి వార్చేందుకు వంట ఖర్చుల కింద ఒక్కో విద్యార్థికి గతేడాది జూన్ నుంచి అదనంగా రూ.1.35 చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.7.18 నుంచి రూ.8.53, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.5.13 నుంచి 6.48కు పెరిగినట్లయింది. వారానికి మూడు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. కోడి గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఒక్కో విద్యార్థికి ఇచ్చే మెనూ సొమ్ములో రూ. 2.30 కోత విధించింది. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ పెంపు ఏపాటివన్న విమర్శలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల నుంచి వినిపిస్తోంది. సాంబారు చేయాలంటే కందిపప్పుతోపాటు చింతపండు, తాలింపునకు దినుసులు, నూనె, ఉల్లిపాయలు, టమోటాతోపాటు కూరగాయలు వేయాలి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ కందిపప్పు రూ.70, చింతపండు రూ.150, కేజీ ఉల్లి రూ.50లు ఉంది. ఇలా అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ధరలతో నాణ్యతగా వండాలని ఉపాధ్యాయులు నిర్వాహకులకు గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికితోడు నెల నెలా బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో అప్పుచేసి పప్పుకూడు పెట్టలేక..పెరిగిన ధరలతో అన్నీ తెచ్చి వండలేక కూరల తయారీ ‘మమ’ అనిపిస్తున్నారు.
న్యాయమైన డిమాండ్ల సాధనకే..
న్యాయమైన డిమాండ్ల సాధనకే సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రతను తెలపడమే మా ఉద్దేశం. హాస్టల్ విద్యార్థులతో సమానంగా భోజన పథకం ఛార్జీలు పెంచాలి. సమ్మె విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. – చంద్రమళ్ల పద్మ, జిల్లా అధ్యక్షురాలు, మిడ్‌డే మీల్ వర్కర్స్ యూనియన్
ప్రతి విద్యార్థికి మిడ్‌డేమీల్ అందజేస్తాం..
మధ్యాహ్న భోజన పథకం నిలుపుదల కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందించాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశా. సమ్మె ప్రభావం మధ్యాహ్న భోజనంపై పడకుండా చూస్తాం. – ఎస్.అబ్రహం, జిల్లా విద్యాశాకాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment