ఏడు జిల్లాలకే ప్రత్యేక హోదా: జైరాం రమేష్
సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలకు ప్రత్యేక హోదా వర్తిస్తుందని ఇన్నాళ్లూ భావించిన వారి ఆశల మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ నీళ్లు చల్లారు. అలాగే, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి మొత్తం 7 జిల్లాలకు మాత్రమే ప్రత్యేక హోదా అమలవుతుందని ఆయన విశాఖపట్నంలో చెప్పారు.
బుందేల్ఖండ్ మాదిరిగానే సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా ఉంటుందని జైరాం రమేష్ తెలిపారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే పరిశ్రమలకు మాత్రమే పన్నురాయితీలు వర్తిస్తాయని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వర్తించబోవని స్పష్టం చేశారు. సీమాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని కూడా ఆయన తెలిపారు.