హోదాతోనే ప్రకాశం అభివృద్ధి | Special Status With Development Of AP | Sakshi
Sakshi News home page

హోదాతోనే ప్రకాశం అభివృద్ధి

Published Wed, Mar 27 2019 11:52 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Special Status With Development Of AP - Sakshi

సాక్షిప్రతినిధి, ఒంగోలు: ‘‘హోదా ఏమైనా సంజీవనా.. ఎక్కువ ప్రయోజనం కోసమే ప్యాకేజీకి ఒప్పుకున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. హోదా అంశాన్ని బాబు గాలికొదిలేసిన తరుణంలో హోదా అవసరం అని నినదించి ఐదేళ్లపాటు పోరాటం చేసి, ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన నాయకుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. జగన్‌ పోరాటాల ఫలితంగానే నేడు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదాను ఎన్నికల ప్రచారంగా మార్చారు. ఈ ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద యూటర్న్‌  తీసుకున్న సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ప్రత్యేక ప్యాకేజీ నిధులు అంటూ మోసం చేసింది.

ఇక తెలుగుదేశం పార్టీ తొలుత ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని మరలా ఎన్నికల మైలేజీ కోసం ఇప్పుడు ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తుంది. ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి హోదా ఆవశ్యకతపై ఇటు విద్యార్థులను, అటు ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్శిటీల స్థాయిలో విద్యార్థులతో సదస్సులు నిర్వహించి హోదా వల్ల కలిగే లాభాలు, రాష్ట్రాభివృద్ధిని కళ్లకు కడుతున్నారు. హోదా కోసం దీక్షలు చేపట్టారు. ఢిల్లీ స్థాయిలో పోరుబాట సాగించారు. జగన్‌ హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం డ్రామాలు ఆడుతూ పబ్బం గడిపేస్తున్నారు.  


హోదాను పణంగా పెట్టి స్వప్రయోజనాలు
ఓటుకు నోటు కేసులో  పీకల్లోతు కూరుకుపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీసే పరిస్థితి లేకపోవడంతోనే  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిందన్న విమర్శలున్నాయి. విభజన పుణ్యమాని రాష్ట్ర లోటు బడ్జెట్‌తో కోలుకోలేని స్థితిలో ఉన్నా బాబు సర్కార్‌ ప్రత్యేక హోదాపై గట్టిపట్టు పట్టలేదు. స్వప్రయోజనాల కోసం ప్యాకేజీ ఇవ్వాలని అడగడం తప్ప హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేసింది లేదు.  ఏపీ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వచ్చి మట్టి, నీళ్లిచ్చారు. అప్పడుకూడా చంద్రబాబు కేవలం ప్యాకేజీ కావాలంటూ కోరారు తప్ప ప్రత్యేక హోదా అడగలేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మోదీ వద్ద సాగిలపడ్డారన్న విమర్శలున్నాయి.

యూటర్న్‌ బాబు 
ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు.. నరేంద్రమోదీ లాంటి ప్ర«ధాని దేశంలో ఇంత వరకు లేరని అసెంబ్లీ సాక్షిగా పొగిడారు. కేంద్రం నిధుల లెక్కలు అడగడం, ఓటుకు కోట్లు కేసు భయంతో ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి హోదా రాగం అందుకున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో హోదా కోసం జగన్‌ మాత్రమే పోరాడుతున్నారని వైఎస్సార్‌ సీపీకి మైలేజీ వస్తుందని భావించిన చంద్రబాబు జగన్‌ దారిలో నడిచారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. 

పరిశ్రమల ప్రచారమంతా బూటకం 
పరిశ్రమలు వస్తున్నాయంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బూటకం. ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో పేపర్‌ పరిశ్రమకు సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టుకూ పునాది రాయి వేశారు. ఇది కేవలం ఎన్నికల కోసమే తప్ప మరొకటి కాదు. కేంద్ర అనుమతి లేకుండా పోర్టును రాష్ట్రం ఎలా నిర్మిస్తుందో చంద్రబాబు చెప్పాలి. ప్రజలను పిచ్చొళ్లను చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే ఈ పోర్టులు, పరిశ్రమలు ఎప్పుడో వచ్చి ఉండేవి.   
 – కె.వసంతరావు, కందుకూరు

కంపెనీలు క్యూకడతాయి
బీటెక్‌ పూర్తి చేసిన నేను గత 4 సంత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి రాయితీలు ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తారు. తద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. నాలాగా ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. 
– మన్నేపల్లి రవి, నిరుద్యోగి, సీఎస్‌పురం 

పరిశ్రమలకు రాయితీ వస్తుంది
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా పామూరు మండలంలోని పాబోలువారిపల్లె, బోడవాడ, మాలకొండాపురం గ్రామాలవద్ద 14,500 ఎకరాల్లో రు.55 వేల కోట్లతో నిమ్జ్‌ (నేషనల్‌ ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌–జాతీయ పారిశ్రామిక ఉత్పాదక కేంద్రం) మంజూరు కాగా దీని ద్వారా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సుమారు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు పలురాయితీలు వస్తాయి. దీంతో ప్రతిపాదిత నిమ్జ్‌ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు త్వరితగతిన ప్రారంభమై నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కరువు ప్రాంతమైన పామూరు మండలం నుంచి వలసలు నివారించవచ్చు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం. 
– ఎం.రామసుబ్బారెడ్డి,డైట్‌ కళాశాల ఇన్‌చార్జి, పామూరు

డీఎస్సీలు ఎక్కువగా విడుదల చేసేవారు 
ప్రత్యేక హోదా ప్రకటించడం ద్వారా ఆంధ్రాకు కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు వస్తాయి. ఐదేళ్లు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోంది. తద్వారా డీఎస్సీలు ఎక్కువగా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల ఖాళీలను బట్టి ఏటా డీఎస్సీ విడుదల చేయవచ్చు. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారికి సకాలంలో ఉద్యోగవకాశాలు లభిస్తాయి.
– ఎం విజయభాస్కర్, ఎమ్మెస్సీ బీఈడీ, పామూరు 

ప్రత్యేక హోదా వస్తే.. 
ప్రత్యేక హోదా వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్‌ రూపంలో వస్తాయి. మిగిలిన పది శాతం నిధులు మాత్రమే లోన్‌గా ఇస్తారు. ప్రధానంగా టాక్స్‌లో రాయితీ ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 
తరలివచ్చే అవకాశాలున్నాయి. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే 
అవకాశముంది. 

  •  చీమకుర్తి ప్రాంతంలో 450కు పైగా గ్రానైట్‌ మైనింగ్‌ లీజులున్నాయి. ఇక్కడి గెలాక్సీకి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. అంతే స్థాయిలో మార్కెట్‌ ఉంది. ఏడాదికి వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్‌ తరలివెళ్తోంది. హోదా వస్తే గ్రానైట్‌ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశముంది. 
  •  జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పొగాకు. హోదాతో సిగరెట్‌ కంపెనీలు జిల్లాకు తరలి వచ్చే అవకాశముంది. దీంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.
  •  మార్కాపురం ప్రాంతంలో గతంలో 150 పలకల పరిశ్రమలుండగా వాటి పరిధిలో 15 వేల మంది కార్మికులు పనిచేసేవారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కరువవడంతో ప్రస్తుతం 35 పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. 4 వేల మంది కార్మికులకు మాత్రమే పనులు దొరుకుతున్నాయి. హోదా వస్తే ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. తద్వారా  కరువు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముంది.
  •  జిల్లాలో నల్లమల అడవులు విస్తారంగా ఉన్నాయి. వీటితోపాటు సుబాబులు సైతం పెద్ద ఎత్తున పెంచుతున్నారు. దీంతో ఈ ప్రాంతం పేపర్‌ పరిశ్రమకు అనువైనదిగా ఉంది. హోదా వస్తే ఇక్కడ పేపర్‌ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. 
  •  జిల్లాలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో రైతులు టమోటా అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ జ్యూస్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పాలన్న ప్రతిపాదన ఉన్నా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. 
  •  హోదా వస్తే రామాయపట్నం పోర్టుతో పాటు మొత్తం కోస్తా కారిడార్‌లో భాగంగా తీరప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. 
  •  జిల్లాలో దొనకొండ పారిశ్రామిక కారిడార్‌ కోసం 50 వేల ఎకరాలు, పామూరులో 20 వేల ఎకరాలు, సీఎస్‌ పురంలో 10 వేల ఎకరాలు గుర్తించారు. రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి 6 వేల ఎకరాలను గుర్తించారు. అయితే ఇప్పటి వరకు పారిశ్రామిక వాడగాని, కనిగిరి ప్రాంతంలో నిర్మించదలచిన నిమ్జ్‌ కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసినట్లపోయాయి. 
  •  ఒంగోలు–నంద్యాల నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడంతో పాటు రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేయాల్సి ఉంది. 
  •  కనిగిరి నేషనల్‌ ఇన్‌ఫ్రాక్టర్చర్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ జోన్‌ అభివృద్ధికి 12,003 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కానీ పనులు మొదలుకాలేదు. 
  •  జిల్లా వ్యాప్తంగా కొత్త పరిశ్రమలు జాతీయ విద్యాసంస్థల కోసం లక్షన్నర ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. సెంట్రల్‌ యూనివర్సిటీ, ఐఐటి, త్రిబుల్‌ ఐటీ ఐఐఎం, ఐఎన్‌టీ కోసం భూమి అందుబాటులో ఉందని ప్రతిపాదనలు పంపినా ఒక్కటీ ఆమోదం పొందలేదు. 
  •  ఒంగోలు నాన్‌మెట్రో విమానాశ్రయం, వెటర్నరీ యూనివర్సిటీ, మినరల్‌ యూనివర్సిటీ తదితర పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరి. పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. బాబు యూటర్న్‌ల కారణంగానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నది వాస్తవం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement