
ప్రత్యేక హోదా ప్రజల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి అధ్యక్షతన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా - రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశంతో కలిసి 8 జిల్లాలకు తొలుత ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే విజయవాడ, విశాఖపట్టణం లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతాయన్నారు. దీని వలన మళ్లీ కోస్తా ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది తప్ప రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, పీసీసీ అధ్యక్షుడు ఇలా అందరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులే ఉన్నప్పటికీ రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారం వద్దు.. అభివృద్ధి కావాలన్నది కోస్తా ప్రాంతం వారి నినాదమన్నారు. సీమ ప్రాంతం నాయకులు మాత్రం అధికారం కోసం అభివృద్ధి అక్కడే చేస్తామంటుండటం శోచనీయమన్నారు. కోస్తాంధ్రతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నారు.
ఈ ప్రాంతాలు అభివృద్ధి అయ్యేవరకు ఈ ప్రాంతాలకే నిధులు కేటాయించాలన్నారు. ఇతర విద్యాసంస్థలు, వైద్యశాలలతో పాటు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని, ఎయిమ్స్‌తో పాటు అన్ని రకాల సంస్థలను కోస్తా ప్రాంతానికే పరిమితం చేస్తున్నారన్నారు. రాజధాని అవసరాల కోసం పట్టిసీమను నిర్మిస్తున్నారన్నారు. బయటకు మాత్రం సీమకు నీటిని అందించేందుకు అని చెబుతున్నా అందులో కోస్తా వారి ప్రయోజనాలే దాగి ఉన్నాయన్నారు. పట్టిసీమ జీఓలో ఎక్కడా రాయలసీమకు సంబంధించిన అంశం లేదన్నారు. రాత పూర్వకంగా హక్కు లేకుంటే రాబోయే రోజుల్లో ఏవిధంగా పట్టిసీమపై హక్కు ఉంటుందన్నారు.
పట్టిసీమ నిర్మాణంరాయలసీమ ప్రజల నోట్లో దుమ్ముకొట్టడానికేనని విమర్శించారు. రాయలసీమను ఎందుకు అభివృద్ధి చేయాలి.. ఓట్లు వేసిన కోస్తా ప్రాంతానికే మేలు చేస్తానని ముఖ్యమంత్రి అనడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని, పాలకులు ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్‌లో చేసిన తప్పును పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు.
సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడింది రాయలసీమ ప్రాంతవాసులైతే.. ఫలాలు పొందింది మాత్రం కోస్తావారన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులని మళ్లీ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని వెనక్కి వెళ్లమంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చామన్నారు. నేడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేయాలన్నారు. యువత సైతం పదవులు ఆశించకుండా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది రాష్ర్ట ప్రజల హక్కు అని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు సీఎంగా పని చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలక, ప్రతిపక్షం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఉద్యమం గురించి పట్టించుకోకుండా ఉంటే తనకు ఇప్పటికే పదవి వచ్చి ఉండేదని, దానిని కాదనుకుని ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజల్లో చైతన్యం నింపడానికి పోరుబాట పట్టానన్నారు.
ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రత్యేక హోదాపై అఖిల పక్షం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఏడాది గడిచినా ఇపుడు దాని గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీకి పంపి ప్రత్యేకహోదాను సాధించాలన్నారు. దీనికి అవసరమైతే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి సాధించుకుంటామని తెలిపారు.
ప్రత్యేక హోదాపై లక్ష్మణ్‌రెడ్డి వ్యాఖ్యలపై సినీనటుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా స్థానిక బీజేపీ నాయకుడు సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి అడ్డుచెప్పారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని లక్ష్మణ్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండించడం తగదని వాగ్వాదానికి దిగారు. దీంతో సినీనటుడు శివాజీ తనకు ప్రాంతీయ భేదాలు లేవని చెప్పారు. తాను పుట్టింది గుంటూరులో అని ఇల్లు తిరుపతిలో కట్టుకున్నానన్నారు. హైదరాబాద్‌లో సైతం తనను ఆదరిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, ఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు పి. ప్రతాప్‌రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు శివనాయక్, రంగనాథరెడ్డి, ఆర్‌ఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, ఆర్‌ఎస్‌యూ, ఆటోయూనియన్ నాయకులు జాకీర్, షరీఫ్, ఐఎస్‌ఎఫ్ నాయకులు గంగిరెడ్డి, తరుణ్‌కుమార్, రాజ, సిద్ధయ్య, శ్రీనివాసులు, సందీప్, అజీమ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకహోదాపై మహానాడులో ఎందుకు తీర్మానం చేయలేదు?
రాష్ట్ర విభజనకు సీపీఎం తప్ప అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా అంగీకరించాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు. చిత్తశుద్ధి వుంటే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రత్యేకహోదాపై ఎందుకు తీర్మానం చేయలేదు? ప్రత్యేకహోదా వస్తేనే అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివదిృ చెందుతుంది. 90 శాతం గ్రాంట్ల రూపంలో నిధులు వచ్చే అవకాశం ఉంది కనుక విభజన చట్టంలోని అన్ని అంశాలను ఐక్యంగా సాధించుకోవాలి.
- రవిశంకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు
రాజ్యాంగ సవరణ చేసైనా ప్రత్యేకహోదా కల్పించాలి
ప్రత్యేకహోదా విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ సవరణ చేసైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి. వందల సార్లు రాజ్యాంగ సవరణ చేసిన నాయకులు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే సవరణ చేసి హోదాను ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయన్నాయి. శివరామకృ్ణన్ కమిటీ చెప్పిన విధంగా అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి.
- పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కడప