సాక్షి, లబ్బీపేట (విజయవాడ) : మూడు దశాబ్ధాల కిందట 55–60 ఏళ్ల వయస్సు వారిలో గుండెపోటు రావడం చూసే వాళ్లం. ఇప్పుడు 35–40 సంవత్సరాల వయస్సు వాళ్లు గుండెపోటుకు గురవుతున్నారు. అంటే 15 ఏళ్ల ముందే గుండె జబ్బులకు గురవుతున్నారు. అందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, జన్యుపరమైన లక్షణాలు ప్రధాన కారణాలని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్న మాట. గుండెజబ్బులపై సరైన అవగాహనతోనే నివారించగలమని వారు సూచిస్తున్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గణాంకాలు ఇలా (ఏడాదిలో అంచనా)
⇒ 14 వేల మంది రక్తపోటు కారణంగా..
⇒ 12 వేల మందిమధుమేహం కారణంగా..
⇒ 40 వేలు గుండె జబ్బుల బారిన పడుతున్న వారు
⇒ 3 వేలుగుండెపోటు మరణాలు
⇒ 10 వేల మంది గుండెపోటుకు గురవుతున్నవారు
గుండెపోటుపై అవగాహన అవసరం
గుండెపోటు విషయంలో సరైన అవగాహన లేక పోవడంతో అధిక శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుకు గురైన వారు గ్యాస్‌ట్రబుల్‌గా భావించి సకాలంలో వైద్యం చేయించుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈసీజీ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో గుండెపోటును సకాలంలో నిర్ధారించడం కష్టతరంగా మారుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు సైతం గుండెజబ్బుల విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
► రక్తపోటుకు గురికాకుండా ఉండేందుకు ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవాలి. ఒకరు రోజుకు 2 గ్రాములకు మించి తీసుకోరాదు. అయితే ప్రస్తుతం 5 నుంచి 8 గ్రాములు వాడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది.
► ప్రతి ఒక్కరూ అఆఇ (ఏబీసీ) మెయిన్‌టెన్ చేయాలి. అ హెచ్‌బీఎ1సీ 6.5 శాతానికి మించకూడదు. ఆ బీపీ 130/80, చెడు కొలస్ట్రాల్ 70 కన్నా మించకుండా చూసుకోవాలి. 1 శాతం హెచ్‌బీఏ1సీని అదుపుచేసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ అవకాశాలు 14 శాతం తగ్గించుకోవచ్చు.
► అధిక క్యాలరీలు కలిగిన ఆహార పదార్థాలు, కొవ్వుశాతం అధికంగా ఉండే ఆహారం, నెయ్యి, నూనెలు అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
► మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి.
► రక్తపోటు 120/80 నార్మల్ కాగా, 120–139, 80–89 ఉంటే రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
► రోజుకు 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు
ఛాతీలో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ తీయించుకోవడం అవసరం. నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయడం ద్వారా ఒక్కో సమయంలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి చేయాలి. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిది. సీటీ కార్డియాక్ యాంజియోతో ఐదేళ్ల ముందుగానే గుండెపోటు నిర్ధారించవచ్చు.
– డాక్టర్ పర్వతనేని నాగ శ్రీహరిత, సీనియర్ కార్డియాలజిస్టు
Comments
Please login to add a commentAdd a comment