సాక్షి, అమరావతి : సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన జనరంజకులైన పాలకుల్ని, ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిన మహానుభావుల్ని వారు మరణించాక కూడా ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా వారి గొప్పతనాన్ని స్మరించుకుంటూ పుస్తకాలు, సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు రావడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలు తెలుగు ప్రజల జీవితాలతో ఎంతలా పెనవేసుకుపోయాయో, వాటితో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో చెప్పనలవి కాదు. అందుకే కన్నుమూశాక కూడా ఆయన కీర్తిప్రతిష్టలు తెలుగు రాష్ట్రాల్లో మరే ఇతర నాయకుడికి లేనంతగా ఇనుమడించాయి.
‘యాత్ర’ అపూర్వం..: ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ 1467 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్ర (ప్రజాప్రస్థానం) ఇతివృత్తంగా ప్రముఖ నటుడు మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన ‘యాత్ర’ చిత్రం సంచలన విజయం సాధించింది. దేశ, విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ దక్కించుకుంది. వైఎస్సార్ మాటతప్పని, మడమ తిప్పని వ్యవహార శైలి, ప్రజల చిన్నచిన్న సమస్యలకే కరిగిపోయే ఆయన దయార్ద హృదయం, ఆయన గుణగణాలను ప్రతిబింబించేలా తీసిన ‘యాత్ర’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ఆ చిత్రంలో వైఎస్సార్ పాత్రలో జీవించిన మమ్ముట్టి పలికిన డైలాగ్ తెలుగునాట జనాల్లోకి చొచ్చుకుపోయింది. పాదయాత్ర చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు, పాదయాత్ర వల్ల వైఎస్సార్‌లో వచ్చిన మార్పు, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, రైతులకు మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టడానికి కారణాలను ఈ సినిమా చక్కగా ప్రజల ముందు ఆవిష్కరించింది.
2019 సాధారణ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం విజయదుందుభి మోగించింది. వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన ‘వైఎస్సార్‌తో ఉండవల్లి అరుణ్‌కుమార్’ అనే పుస్తకం ద్వారా ఆ మహానేత వ్యక్తిత్వాన్ని సామాన్య ప్రజలు మరింత ఎక్కువగా తెలుసుకునే అవకాశం కలిగింది. వైఎస్సార్ కన్నుమూశాక ఆయన గురించి పత్రికల్లో వివిధ ప్రముఖులు రాసిన వ్యాసాలను, ఆయనతో వారి అనుభవాలను సంకలనం చేసి వెలువడ్డ తొలి పుస్తకం.. ‘జననేత’. మాజీ జర్నలిస్టు ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) ఆధ్వర్యంలో వచ్చిన ఈ పుస్తకాన్ని నాడు ఎంపీగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్సార్‌కు సన్నిహితుడైన షేక్ ఇమాం (కదలిక పత్రిక సంపాదకుడు) ‘జనం చెక్కిన శిల్పం’ పేరుతో రూపొందించిన వ్యాసాల సంపుటి పుస్తకం వైఎస్ వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించింది. పేద, బడుగు వర్గాల సమస్యల పట్ల మహానేత వైఖరి, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయంపై ఆయన ఆసక్తి, అన్నిటి కంటే మించి.. పేదలకు విద్య వంటి అంశాలపై వైఎస్ ఆలోచనలు ఎలా ఉండేవో ఈ పుస్తకంలో ఇమాం చక్కగా వివరించారు. ‘వైఎస్సార్.. ది మ్యాన్ ఆఫ్ ది పీపుల్ (ప్రజల మనిషి.. వైఎస్సార్)’ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రాణస్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు 150 ఫొటోలతో ఆకర్షణీయంగా ఒక పుస్తకాన్ని రూపొందించారు. 2011లో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం వైఎస్ పాలన, సంక్షేమంపై నిర్వహించిన సెమినార్‌కు దేశవ్యాప్తంగా ఎందరో విద్యావేత్తలు హాజరయ్యారు. రామగంగిరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఎస్సార్ పాదయాత్రపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం గమనార్హం.
70 రోజులు వెంటిలేటర్‌పైనే..
గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన ఈశ్వరరెడ్డి, రమాదేవి దంపతులది నిరుపేద కుటుంబం. ఈశ్వరరెడ్డి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుమస్తాగా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక చాలాకాలంపాటు వీరికి పిల్లలు లేరు. 2008లో ఈశ్వరరెడ్డి భార్య గర్భం దాల్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే.. ఈ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రమాదేవికి 7వ నెలలోనే ప్రసవమై ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు. ఒక్కో పాప కేవలం 900 గ్రాములు మాత్రమే బరువు ఉంది. ఆ చిన్నారుల బరువు చూసి వైద్యులు ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. వైద్యుల మాటలతో లేకలేక పుట్టిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది.ఆ చిన్నారులను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించుకోండని వైద్యులు చెప్పారు. దీంతో ఆ చిన్నపిల్లలిద్దరినీ వెంటిలేటర్‌పై గుంటూరులోని శ్రీరామచంద్ర చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఆ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చుకున్నారు. పిల్లలిద్దరికీ 70 రోజులపాటు వెంటిలేటర్‌పైనే వైద్యమందించారు. సాధారణంగా వెంటిలేటర్‌పైన ఉంటే రోజుకు వేలల్లోనే ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులిద్దరికీ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నయాపైసా తీసుకోకుండా 70 రోజుల పాటు వైద్యమందించి వారి ప్రాణాలు కాపాడారు. ఆ చిన్నారులు మోహనదీప్తి, మోహనరూప ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నారు. వైఎస్సార్ పుణ్యమాని ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వైఎస్సార్ తమ కుటుంబంలో సంతోషం నింపారని దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు పుట్టినప్పుడు వైద్యం చేయించడానికి డబ్బులు లేవని, ఆస్తులమ్ముకుని బతికించుకుందామన్నా ఆస్తులు లేవని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పిల్లలిద్దరినీ చూసినప్పుడు బాధ, భయమూ వెంటాడాయని వివరించారు. ఆ దేవుడే ఆరోగ్యశ్రీ రూపంలో తన పిల్లలకు ప్రాణభిక్ష పెట్టారని చెబుతున్నారు. 70 రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఒక్క నయాపైసా అడగలేదని, మందుల నుంచి ఇంజక్షన్ల వరకూ అన్నింటికీ ఆరోగ్యశ్రీ వర్తించిందని, తమకు నిజమైన దైవం వైఎస్సారే అంటున్నారు..
ఆ దంపతులు.
దేవుడు ఎక్కడో లేడు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపంలో దేవుడు ఉన్నారంటున్నారు.. విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉదయశ్రీ. ఆమె తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తుండేవారు. ఉదయశ్రీతోపాటు ఆమె అన్న చలపతి కుమార్ 2008లో ఒకేసారి బీటెక్‌లో చేరారు. దీంతో ఇద్దరికీ ఫీజులు చెల్లించడం శ్రీనివాసరావుకి కష్టమైంది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టడంతో తాను, తన అన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తిచేసుకోగలిగామని, లేదంటే చాలా కష్టాలు పడేవాళ్లమని నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ దయతో తాను ప్రస్తుతం బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో అసోసియేట్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.9 లక్షల వేతనం తీసుకుంటున్నానని సంతోషం వ్యక్తం చేశారు. తన అన్న కూడా మైసూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment