ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
120 ఆటోల సీజ్ డ్రైవర్‌లకు అవగాహన సదస్సు
పట్నంబజారు ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 120 ఆటోలను పోలీసు పేరెడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈస్ట్, వెస్ట్ సిఐలు టి. మురళీకృష్ణ, యు. శోభన్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రధాన కూడళ్ళలో తనిఖీలు నిర్వహించారు. లెసైన్సులు, ధృవీకరణ పత్రాలు సరిగా లేని ఆటోలను సీజ్ చేసి పేరెడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. అనంతర వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో అడిషనల్ ఎస్పీ జె. భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లెసైన్సులు కలిగి ఉండాలన్నారు. ఒకసారి దొరికిన ఆటో డ్రైవర్ మరోమారు దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకోవటంతో పాటు కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.
ఇక తనిఖీలు ముమ్మరం
ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవటం, మద్యం సేవించి వాహనాలు నడపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇకపై తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఈస్ట్ ట్రాఫిక్ సిఐ టి. మురళీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ స్టేడియం, మార్కెట్ సెంటర్, హిందూ కళాశాల కూడలి వద్ద ఆటో సంచారం అధికంగా ఉందని, నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వెస్ట్ ట్రాఫిక్ సిఐ యు. శోభన్‌బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై విద్యార్థులు ముగ్గురు వరకు ఎక్కి తిరుగుతున్నారని, వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటో వాలాలకు జరిమానాలు విధించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐలు సూర్యనారాయణ, రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, సాయిబాబా, బుచ్చిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.