అతివేగం మిగిల్చిన విషాదం
Published Fri, Aug 9 2013 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
రేగులపాడు(వీరఘట్టం), న్యూస్‌లైన్: ఓ వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వ్యాన్ నడిపి రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాడు. మరి కొన్ని నిరుపేదల బతుకులు రోడ్డునపడే పరిస్థితి కల్పించాడు. వయసుపైబడినా చేతనైన పనిచేస్తూ కుమార్తె కుటుంబానికి ఆసరాగా ఉన్న ఓ వృద్ధురాలిని బలిగొన్నాడు. శేషజీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి ఉసురు తీసి ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. వివరాల్లోకి వెళితే... వీరఘట్టం మండలం రేగులపాడు జంక్షన్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పెంకి చిన్నతల్లి(70), అంపావల్లి శ్రీరామ్మూర్తి(72) దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌లో ఉన్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వీరందరినీ శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించగా వారిలో ఇద్దరిని విశాఖపట్నంకు రిఫర్ చేశారు.
అతివేగంగా వస్తున్న వ్యాన్ డ్రైవర్ రోడ్డు దాటుతున్న చిన్నతల్లిని తప్పించబోయి మొదట వృద్ధురాలిని ఆ తర్వాత రోడ్డు పక్కన బస్సు కోసం నిల్చున్న శ్రీరామ్మూర్తిని ఢీకొట్టాడు. వీరిద్దరు సంఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆతర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టుపైకి దూసుకువెళ్లడంతో వ్యాన్‌లో ఉన్న లోచర్ల గంగరాజు, సిరిపురం సుమన్, భోగాది నాగరాజు, బొబ్బిలి లక్షుంనాయుడు, బూసపు సింహాచలం, చాట్ల చంద్రమౌళి, మోసూరు రాము, కోరూడు చంద్రరావు, గుడాల శ్రీను, మండలంలోని విక్రంపురానికి చెందిన సాదు శివకుమార్, సాదు విశ్వేశ్వరరావు, బూర్జ మండలం మదనాపురానికి చెందిన దుప్పాడ గౌరునాయుడు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వీరిలో గంగరాజు, సుమన్, శ్రీను, నాగరాజు, గౌరునాయుడు పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించారు. గంగరాజు, సుమన్‌కు మెరుగైన వైద్యం కోసం విశాఖకు రిఫర్ చేశారు.
ప్రమాదం ఇలా జరిగింది
రేగులపాడుకు చెందిన చిన్నతల్లి పొలంలో వరినాట్లు వేసే పనికోసం వెళుతూ రోడ్డు దాటుతోంది. అదే సమయంలో అతివేగంగా వస్తున్న వ్యాన్ ఆమెను తప్పించబోయి అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. చిన్నతల్లి శరీరం మీద నుంచి వెళ్లిన వ్యాన్ అదేవేగంతో దూసుకుపోయి వీరఘట్టం వెళ్లడానికి రోడ్డుపై వేచివున్న శ్రీరామ్మూర్తిపై దూసుకుపోయింది. దీంతో ఇద్దరు దుర్మరణంపాలయ్యారు. అనంతరం వ్యాన్ చెట్టుపైకి దూసుకుపోవడంతో అందులో ఉన్న వారంతా రోడ్డుపై, పక్కనే ఉన్న పొలాల్లోకి తుళ్లిపోయారు.
వయసుపైబడినా పొలం పనికి...
ఈ దుర్ఘటనలో మృతి చెందిన చిన్నతల్లిది పేద కుటుంబమే. భర్త లేడు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గేదెల ఆరుద్రమ్మ ఇంట్లో ఉంటోంది. వయస్సుపైబడినా కుమార్తెను ఆర్థికంగా ఆదుకోడానికి పొలం పనులకు వెళుతోంది. ఈ క్రమంలోనే పొలానికి వెళుతూ మృత్యువాత పడింది. ఆమెకు రమణమ్మ, గొర్లె సావిత్రమ్మ అనే మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా శేషజీవితాన్ని ఆనందంగా సాగిస్తున్న శ్రీరామ్మూర్తి వ్యక్తిగత పనులపై వీరఘట్టం వెళ్లేందుకు బస్సు కోసం రోడ్డు పక్కన నిలుచున్నారు. ఇంతలో వ్యాన్ ఆయనపైకి దూసుకువచ్చి బలితీసుకుంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు కేశవరావు కత్తులకవిటి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. తండ్రి దుర్మరణ సమాచారం ఫోన్‌లో తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. శ్రీరామ్మూర్తి భార్య భవానమ్మ నడవలేని స్థితిలో మంచంపై ఉన్నారు. భర్త మృత్యువాతపడ్డారని తెలిసి గుండలవిసేలా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
క్షతగాత్రుల్లో అధికులు కూలీలే
క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కూలీలే. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. వీరంతా వీరఘట్టం నుంచి కొల్లివలసకు నిత్యం పనుల కోసం వెళుతుంటారు. ఈ క్రమంలో వ్యాన్‌లో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. కాగా బస్సులో వెళ్లాల్సిన తండ్రీకొడుకులు విశ్వేశ్వరరావు, శివకుమార్ అనూహ్య పరిస్థితుల్లో ఈ వ్యాన్ ఎక్కారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా బస్సులు సమయపాలన పాటించకపోవడంతో వారు వ్యాన్ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు.
పరామర్శకు వచ్చి...
బూర్జ మండలం మదనాపురానికి చెందిన గౌరునాయుడుది మరో గాథ. సమీప బంధువు ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యుల పరామర్శకు ఆయన వీరఘట్టం వచ్చారు. బస్సులు లేకపోవడంతో వ్యాన్ ఎక్కి ప్రమాదంబారిన పడ్డారు.
పీహెచ్‌సీ సిబ్బందిపై బాధితుల ఆగ్రహం
వీరఘట్టం, న్యూస్‌లైన్:ఆపదసమయంలో క్షతగాత్రులను ఆదుకోవాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రేగులపాడు జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో సిరిపురం సుమన్, భోగాది నాగరాజు, బొబ్బిలి లక్షుంనాయులను చికిత్స కోసం మొదట స్థానికి పీహెచ్‌సీకే తీసుకువచ్చారు.
అప్పటి ఉదయం 9 గంటలయింది. ఆ సమయంలో పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సు మాత్రమే ఉన్నారు. ఇంతలో స్థానిక ప్రైవేట్ వైద్యుడు వెంకటరమణ పీహెచ్‌సీకి వచ్చి స్టాఫ్ నర్సు సహాయంతో ప్రాథమిక చికిత్స చేశారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పీహెచ్‌సీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై క్షతగాత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.
Advertisement