గుంటూరు జీజీహెచ్
గుంటూరు మెడికల్: నా ఇష్టం..నా మాటే శాసనం.. ఇక్కడ నేను ఏది చెబితే అదే చేయాలి..నేను చెప్పిన చోట సంతకం చేయకపోతే నీపై మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసి, నీవు వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేందుకు అనర్హుడిని చేస్తా అంటూ వైద్యుల్ని, సిబ్బందిని జీజీహెచ్‌లో ఓ ముఖ్యఅధికారి కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైళ్లపై వైద్యుల్ని సంతకాలు చేయమని ఒత్తిడికి గురి చేస్తున్నారు. సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న ఫైళ్లపై సంతకాలు చేస్తే తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో వణికిపోతున్నారు. కొందరితో భయపెట్టి సంతకాలు పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆర్థికపరమైన ఆంశాలపై సైతం సదరు అధికారి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు నెలల కిందట ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉండగానే తాజాగా విజిలెన్స్ అధికారులకు, డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులకు బాధిత వైద్య సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయం ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదుల వెల్లువ
ఆస్పత్రి అభివృద్ధి సంఘం నిధులు(హెచ్‌డీఎస్), డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ నిధులు(ఆరోగ్యశ్రీ) నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని, దుర్వినియోగం అయ్యాయని ముఖ్యమంత్రికి సైతం సదరు ముఖ్యఅధికారిపై ఫిర్యాదులు వెళ్లాయి. ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సైతం జీజీహెచ్‌లో నిధుల వినియోగం నిబంధనల ప్రకారం జరగడం లేదని, ఐదేళ్లుగా ఆస్పత్రిలో ఆడిట్‌లు జరగడం లేదని అంటూ రెండు నెలల కిందట ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ జరుగుతున్న సమయంలో తాజాగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా ముఖ్య అధికారి వ్యవహరించారనే విషయంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.
ఎన్‌టీఆర్ వైద్యసేవ పారితోషికం పంపిణీ విషయాల్లోనూ అధికారి నిబంధనలకు విరుద్ధంగా తనకు ఇష్టం వచ్చిన వారికి అందజేసినట్టు ట్రస్ట్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరుగుతోంది. గత నెలలో డయేరియా మరణాల విషయంలో అధికారి చేసిన సొంత పెత్తనం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని ఆస్పత్రిలో అందరూ చెప్పుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఉన్నతాధికారులు చెప్పకుండానే తన సొంత నిర్ణయం తీసుకుని జీజీహెచ్‌కు తీసుకురావడంతో వారు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు గుర్తింపు కోసం అనుమతులు మంజూరు చేసే విషయంలో సదరు అధికారి బహుమతుల రూపంలో మామూళ్లు తీసుకున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అధికారి బెడద నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment