స్త్రీ నిధిపైచిన్న చూపు
మార్కాపురం, న్యూస్‌లైన్:
స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు అత్యవసర సమయాల్లో నిధులు ఇవ్వడంతో పాటు మైక్రోఫైనాన్స్ వారి బారిన పడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మహిళలు స్వయంశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. బ్యాంక్‌లు ఇచ్చే రుణం ద్వారా వారి ఇళ్ల వద్దే వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా స్వశక్తితో అభివృద్ధి చెందవచ్చు. జిల్లాలో 5 వేల స్వయం సహాయక
గ్రూపులకు స్త్రీ నిధి కింద రుణాలిచ్చారు. గ్రేడ్ల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారు. ఒక గ్రామ సమైక్య సంఘానికి రూ 10 లక్షల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తారు. సంఘం పనితీరు ఆధారంగా, గతంలో తీసుకున్న రుణాల రికవరీ, సంఘం ఆడిట్‌ను పరిశీలించి ర్యాంకర్లను ఇస్తారు. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘానికి రూ 10 లక్షలు, బీ గ్రేడ్ అయితే రూ7 లక్షలు, సీ గ్రేడ్‌కు రూ 3 లక్షలు, డీ గ్రేడ్ కు లక్ష రూపాయలు ఇస్తారు. ఆడిట్ చేయించుకునేందుకు అవసరమయ్యే పుస్తకాలను జిల్లా వాటర్‌షెడ్ సంస్థ అధికారులు సమైక్య సంఘాలకు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని మండలాల్లో ఇవ్వకపోవడంతో ఆడిట్ కాక రుణాలకు అనర్హత సాధించలేకపోయారు. బేస్తవారిపేట, దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాల్లో పలు సమైక్యసంఘాలు ఆడిట్ కాలేదు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 70 కోట్ల 94 లక్షల 54 వేల 223 రూపాయల రుణాలలివ్వగా, ఇప్పటి వరకు రూ25,90,05,537 మాత్రమే జమ చేశారు. తాము నిర్ణయించుకున్న సమయం లోపు తీసుకున్న రుణాలను ఆయా గ్రూపుల వారు బ్యాంక్‌లకు చెల్లిస్తే వారు తీసుకున్న రుణానికి వడ్డీ ఉండదు. కాగా, పథకంపై అవగాహన లేకపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల బకాయిలు తిరిగి కట్టలేకపోయారు. దీంతో చిన్న మొత్తాల్లో కట్టాల్సిన గ్రూపులకు బ్యాంక్ అధికారులు వడ్డీ విధిస్తున్నారు. ఐకేపీ సిబ్బంది, బ్యాంక్ అధికారులు వడ్డీ లేని రుణ పథకంపై అవగాహన కల్పిస్తే పథకం వర్తించేది. జిల్లాలోని చినగంజాం మండలంలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ3 కోట్ల రుణాలివ్వగా, రూ 20 లక్షల బకాయిలు ఉన్నారు. చీరాల మండలంలో రూ 2.31 కోట్ల రుణాలుగా ఇవ్వగా, రూ11,11,222 చెల్లించాల్సి ఉంది. సింగరాయకొండ మండలంలో రూ2.35 కోట్ల రుణాలివ్వగా రూ 13 లక్షల బకాయిలు చెల్లించాలి. దోర్నాల మండలంలో రూ1.41 కోట్లు ఇవ్వగా రూ9.29 లక్షలు, పెద్దారవీడులో రూ51 లక్షలకు గానూ రూ7.43 లక్షలు, వేటపాలెంలో రూ1.76 కోట్లకు గాను రూ10.47 లక్షలు, పుల్లలచెరువులో రూ 36 లక్షలకు గాను రూ 6 లక్షలు ఇలా జిల్లా వ్యాప్తంగా పలు స్వయం సహాయక సంఘాలు కొద్ది మొత్తంలో రుణాలను బ్యాంక్‌లకు చెల్లించాల్సి ఉంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వీరిపై వడ్డీ భారం పడుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో 20 నుంచి 30 గ్రూపుల వరకు పథకంపై అవగాహన లేక కొద్ది మొత్తంలో బ్యాంక్‌లకు బకాయి ఉండటంతో వడ్డీ లేని రుణ పథకానికి అనర్హులయ్యారు. ఐకేపీ సిబ్బంది, మహిళా గ్రూపులతో సమావేశం ఏర్పాటు చేసి వారు కట్టాల్సిన బకాయిల గురించి వివరిస్తే ఆయా గ్రూపులపై రుణభారం తగ్గుతుంది.
సకాలంలో చెల్లిస్తేనే వడ్డీ రాయితీ
ధర్మేంద్ర, స్త్రీ నిధి జిల్లా మేనేజర్
జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. 60 రోజులు చెల్లించకుండా ఉన్న సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రికవరీ కోసం బృందాలను ఏర్పాటు చేశాం. నిర్ణీత సమయంలో తీసుకున్న రుణాన్ని చెల్లించకపోతే వడ్డీ రాయితీ వర్తించదు. ప్రతి నెలా సంబంధిత గ్రామ సమైక్య సంఘం సమావేశం రోజున చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంక్‌లో జమ చేయాలి.
స్త్రీ నిధిపైచిన్న చూపు
Published Fri, Jan 31 2014 6:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement