
జూవిలాపం
- ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో జంతువులు కరువు
- వృద్ధాప్యంతో దర్శనమివ్వని సింహాలు
- షెడ్లకే పరిమితమైన ఏనుగులు
- భూతద్దం పెట్టి వెతికినా కనిపించని మొసళ్లు
- ఉసూరుమంటున్న సందర్శకులు
తిరుపతి(మంగళం) : శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతి పెద్దది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇదంతా కేవలం పేరుకు మాత్రమే. సందర్శకులు మాత్రం జూపార్క్ ఏమాత్రమూ అలరించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో జూ పార్క్ పేరు పరంగా దినదినాభివృద్ధి జరుగుతున్నప్పటికీ జంతువుల పరంగా ఏమాత్రమూ ఎదుగుబొదుగు లేకుండా ఉంది. 2200 హెక్టార్ల విస్తీర్ణంలో 1100 జంతు, పక్షి జాతులతో సందర్శకులను రంజింపజేస్తున్నాయని అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కనపడడంలేదు. ఒకటి, రెండు మినహా గడిచిన 30 ఏళ్లలో అవే జంతువులు సందర్శకులకు దర్శనమిస్తున్నాయి.
అందులో వయస్సు మీరినవి, ఒంటరిగా ఉన్నవి, గాయాలపాలైనవే ఎక్కువుగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల పరిధిలో జంతువుల నివాస ప్రాంతం ఉన్నప్పటికి 1100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ సందర్శకులకు కనిపించేవి పదుల సంఖ్యలో కూడా ఉండవు. దీంతో సందర్శకులు నిరుత్సాహంతో ఉసూరుమంటున్నారు. పేరుకు జింకల సఫారీ, సింహాల సఫారీని ఏర్పాటు చేసినా అసలు వాటిలో సింహాలు, జింకలు మచ్చుకైనా కనపడవు. సఫారీలో మధ్యలో ఏర్పాటు చేసిన రింగురోడ్ల నిర్మాణానికి, జంతువులు సేద తీరేందుకు నిర్మించిన షెడ్లకు ఏమాత్రమూ అనుసంధానం లేకుండా పోయింది.
ఈ కారణంగా సఫారీ వాహనంలో వెళ్లే సందర్శకులకు గంటల తరబడి వేచిచూసినా ఒక్క జంతువు కూడా కనబడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గడిచిన పదేళ్లకాలంలో కొత్త జంతువులను తీసుకొస్తామని చెబుతూ వచ్చిన అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. హిమాలయ బ్లాక్ బియర్, ఆడ జిరాఫీ, జీబ్రాలు, నీటి ఏనుగులు తీసుకొస్తామని గత పాలకులు, అటవీ శాఖ అధికారులు, సెంట్రల్ జూ అథారిటీ(సీజెడ్‌ఏ) ప్రకటనలు చేసినప్పటికి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. జిరాఫీ విషయానికి వస్తే అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో కోల్‌కతా జూపార్క్ నుంచి ఒక మగ జిరాఫీని తెప్పించారు.
త్వరలోనే మరో ఆడ జిరాఫీని మగ జిరాఫీకి తోడు తెప్పిస్తామని చెప్పారు. అయితే ఐదేళ్లు గడిచిపోయినా తెప్పించలేదు. నక్కలు, తోడేళ్లు, హైనాలు జూలో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా సందర్శకులకు కనిపించిన పాపానపోలేదు. అసలు అవి ఉన్నాయా లేవా అనే అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. మొసళ్లు అయితే పేరుకు ఉన్నప్పటికీ సందర్శకులకు కనిపించని దుస్థితిలో వాటి నివాస స్థావరాలు ఉన్నాయి. ఏనుగుల విషయానికి వస్తే జూలో నాలుగు ఏనుగులు ఉన్నప్పటికి అవి కేవలం షెడ్లకే పరిమితమ య్యాయి. గతంలో షెడ్లలో కట్టేసిన ఏనుగులను కనీసం దగ్గర నుంచైనా చూడనిచ్చేవారు. అయితే ఇప్పుడు భద్రతా కారణాలు చూపిస్తూ సందర్శకులు చూసే దూరాన్ని అమాంతం పెంచేశారు.
గతంలో నిర్వహిస్తున్న ఏనుగుల అంబారీని సైతం నిలిపివేశారు. జూను అంతర్జాతీయ స్థాయిలో అన్ని విధాలా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉన్నప్పటికీ ఇందుకు అనుకూలంగా ఒక్క అడుగు పడడంలేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తిరిగి అటవీ శాఖ మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటికే జూపార్క్‌ను నాలుగైదు సార్లు సందర్శించి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కొత్త జంతువులను తెప్పిస్తామని చెప్పినప్పటికీ అటు వైపు దృష్టి సారించడంలేదు. ఇప్పటికైనా మంత్రిగారు జూకు కొత్త జంతువులను తెప్పిం చాలని ఆశిద్దాం.