బాచుపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు
భారీగా హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి అంత్యక్రియలు బాచుపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి 7.30 గంటలకు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమ యాత్ర రాత్రి 7 గంటలకు ఫామ్ హౌస్‌కు చేరుకుంది. అంతిమ సంస్కారాలను శ్రీహరి పెద్ద కొడుకు శశాంక్ వెంకట్‌కుమార్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రు నయనాలతో శ్రీహరికి అంతిమ వీడ్కోలు పలికారు. భార్య శాంతి, కుమారులు శశాంక్, మేఘాంశ్, తల్లిదండ్రులు రఘుముద్రి సత్యనారాయణ, శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శ్రీహరి భౌతిక కాయాన్ని కడసారిగా చూసి కన్నీరు మున్నీరయ్యారు. కూతురు అక్షర సమాధి పక్కనే శ్రీహరి భౌతికకాయాన్ని సమాధి చేశారు. శ్రీహరి బుధవారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే.
అశ్రునయనాలతో అంతిమయాత్ర: అంతకుముందు గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీహరి భౌతికకాయం ముంబై నుంచి జూబ్లీహిల్స్‌లోని శ్రీహరి స్వగృహానికి చేరుకుంది. ఆ సమయంలో ఆయన భార్య శాంతి, ఇద్దరు కుమారులు శశాంక్ వెంకట్‌కుమార్, మేఘాంశ్‌లను ఓదర్చాడం ఎవరితరం కాలేదు. ఇతర కుటుంబసభ్యులూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అప్పటికే అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. దాంతో శ్రీహరి భౌతికకాయాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో వారిని కట్టడిచేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. పలుమార్లు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి భౌతికకాయాన్ని మొదట ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌కు తరలిద్దామనుకున్న నిర్ణయాన్ని చివరిక్షణంలో మార్చుకుని బాలానగర్‌లోని ఇంటికి తరలించారు. అక్కడ కాసేపుంచి అనంతరం బాచుపల్లికి అంతిమయాత్ర ప్రారంభించారు. బాచుపల్లి వరకు దారిపొడవునా శ్రీహరికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. భార్య, కుమారులతో పాటు శ్రీహరి తల్లిదండ్రులు, అన్న శ్రీనివాసరావు, తమ్ముడు శ్రీధర్ పాల్గొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు భారీగా అంతిమయాత్రలో పాల్గొన్నారు.
చివరి చూపు కోసం...
శ్రీహరి భౌతిక కాయానికి నివాళులర్పించి చివరి చూపు చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసం వద్దకు, అంత్యక్రియలు నిర్వహించిన బాచుపల్లిలోని వ్యవసాయక్షేత్రం వద్దకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. శ్రీహరి భార్య శాంతి, కుమారులు, కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. శ్రీహరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన వారిలో దాసరి నారాయణరావు, చిరంజీవి, డి.రామానాయుడు, మోహన్‌బాబు, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, డి. సురేష్‌బాబు, జీవిత, రాజశేఖర్, రాంచరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, రవిరాజ పినిశెట్టి, దర్శకుడు ఎన్.శంకర్, సి.కల్యాణ్, సునీల్, ప్రకాశ్‌రాజ్, కృష్ణ, విజయనిర్మల, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, తరుణ్, వేణుమాధవ్, వివి. వినాయక్, కె. రాఘవేందర్‌రావు, రంగనాథ్, రఘుబాబు, బ్రహ్మానందం, జయసుధ, మంచులక్ష్మిప్రసన్న, విష్ణు, సుమన్, వంశీ పైడిపల్లి, రాజకీయ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి దానం నాగేందర్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీైశైలంగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖ, గద్దర్ తదితరులు ఉన్నారు. శ్రీహరి మృతి పట్ల పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి గురువారం సంతాపం ప్రకటించారు.