వీళ్లకి పదవులే పరమార్థం! | srikakulam congress leaders co operate state division | Sakshi
Sakshi News home page

వీళ్లకి పదవులే పరమార్థం!

Feb 19 2014 2:53 AM | Updated on Mar 18 2019 8:51 PM

వీళ్లకి పదవులే పరమార్థం! - Sakshi

వీళ్లకి పదవులే పరమార్థం!

పంచపాండవులు అంటే మంచం కోళ్లలా ముగ్గురు ఉన్నారు అని రెండు వేళ్లు చూపించారట వెనుకటి ఒకరు.

 రాష్ట్ర విభజనకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
  టీ బిల్లుపై అభ్యంతరం చెప్పని కేంద్రమంత్రులు
  లోక్‌సభలో కుర్చీలకే పరిమితమైన కేంద్రమంత్రులు కిశోర్, కృపారాణి
  ఎంపీ ఝాన్సీ తీరూ అంతే...  విభజనపై సోనియాకు కోండ్రు వత్తాసు
  సీఎం బాటలో మంత్రి శత్రుచర్ల పరోక్ష సహకారం
  కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరుపై భగ్గుమంటున్న జిల్లా
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పంచపాండవులు అంటే మంచం కోళ్లలా ముగ్గురు ఉన్నారు అని రెండు వేళ్లు చూపించారట వెనుకటి ఒకరు. జిల్లాలో సమైక్యాంధ్ర విధానానికి చిత్తశుద్ధితో కట్టుబడిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఎవరంటే సమాధానం మాత్రం అంతకంటే దారుణంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కాదు కదా కనీసం ఒక్కరు కూడా సమైక్యవాదానికి దన్నుగా నిలవలేకపోయారు. అంతా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడమే ఏకైక ధ్యేయంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించారు.  చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు... ఇద్దరు రాష్ట్ర మంత్రులు... ఒక ఎంపీ... నలుగురు ఎమ్మెల్యేలు!. కానీ రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో అడ్డుకోవడానికి కనీసం యత్నించిన కేంద్రమంత్రి గానీ ఎంపీగానీ లేకుండాపోయారు. ఇక రాష్ట్రమంత్రులు ఇద్దరిలో ఒకరు సోనియా రాష్ట్ర విభజనవాదానికి బహిరంగంగా వెనకేసుకొచ్చారు. మరొకరు సీఎం కిరణ్‌తో జట్టుకట్టి విభజనకు పరోక్షంగా సహకరించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ విభజన ఆటలో అరటిపండులా మారిపోయారు. పార్లమెంటు, అసెంబ్లీ లోపల, బయట జిల్లా ప్రయోజనాలను కాపాడతారని ఆశించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరు ఇదీ. తాము ఓట్లు వేసి పార్లమెంట్, అసెంబ్లీలకు పంపిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరు చూసి ప్రజలు నివ్వెరపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

 సీట్లకు అతుక్కున్నారు.. నోరు కట్టుకున్నారు

 జిల్లా నుంచి ముగ్గురు ఎంపీల ప్రాతినిధ్యం. వారిలో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా.. ఒకరేమో కేబినెట్ మంత్రి కిశోర్‌చంద్రదేవ్.. మరొకరు సహాయ మంత్రి కృపారాణి.. ఇక ఎంపీగా ఉన్న బొత్స ఝాన్సీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు సతీమణి.  ప్రజాస్పందనను పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉండీ ఏం ప్రయోజనం!?... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభలో మంగళవారం రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ఈ నలుగురూ స్పందన జిల్లావాసులను హతాశులను చేసింది. కనీసం హడావుడి చేయడానికైనా అన్నట్లు సభలో ఉన్న  కొందరు సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు విభజన బిల్లుపై అభ్యంతరం తెలిపారు. లోక్‌సభలో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కానీ మన కిశోర్‌చంద్రదేవ్, కృపారాణి, బొత్స ఝాన్సీ కనీసం స్పందించ లేదు. పూర్తిగా తమ సీట్లకే అతుక్కుపోయారు. నోరు కట్టేసుకుని సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని చోద్యం చూస్తూ గడిపారు. ఎక్కడ మాట్లాడితే సోనియాగాంధీ ఆగ్రహానికి గురికావల్సి ఉంటుందోనని సభ జరుగుతున్నంత సేపూ మౌనముద్ర దాల్చారు. తమ ప్రాంత ప్రయోజనాలను పట్టని కేంద్రమంత్రులు, ఎంపీల తీరు చూసి జిల్లా వాసులు నిశ్చేష్టులయ్యారు.  బిల్లు ఆమోదం పొందిన తరువాత కొందరు కాంగ్రెస్ కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామాలు ప్రకటించారు. కానీ మనవాళ్లకు అవేం పట్టవు కదా!... సీమాంధ్రకు ఏమీ అన్యాయం జరగలేదన్నట్లుగా మళ్లీ సోనియా గాంధీ ప్రాపకం కోసం టెన్ జనపథ్ చుట్టూ చక్కర్లు కొట్టేందుకు సిద్ధపడ్డారు.

 సోనియా విభజన వాదానికి కోండ్రు వత్తాసు

 రాష్ట్ర మంత్రి కోండ్రు మురళి సోనియాగాంధీని సమర్థిస్తూ వచ్చారు. సోనియాగాంధీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీమాంధ్రలో అందరికంటే ఎక్కువుగా సమర్థించింది కోండ్రు మురళే కావడం గమనార్హం. పైగా విభజనను వ్యతిరేకిస్తున్నవారిపై ఆయన ఒంటికాలిపై లేచారు. సోనియా గాంధీని సమర్థిస్తూ సమైక్యవాదులపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తమ ప్రాంత ప్రజలు ఆగ్రహించినా పర్వాలేదు.. సోనియా గాంధీ అనుగ్రహం ఉంటే చాలన్న రీతిలో మంత్రి కోండ్రు వ్యవహరించారు. రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన తరువాత కూడా ఆయన కనీసం స్పందించ లేదు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలోనే పడిపోయారు.

 శత్రుచర్ల... విభజనవాదానికి పరోక్ష సహకారం

 జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్త్నున శత్రుచర్ల విజయరామరాజు తీరు కాస్త భిన్నం. కేంద్రమంత్రులు కిశోర్, కృపారాణి, రాష్ట్ర మంత్రి కోండ్రు బహిరంగంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తే... మంత్రి శత్రుచర్ల పరోక్షంగా విభజనకు చేయూత అందించారు. ఆయన సీఎం కిరణ్‌తో జట్టు కట్టారు. విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే మంత్రి పదవిని వదలకుండా జాగ్రత్తపడ్డారు. తద్వారా సీఎం కిరణ్ వ్యూహం ప్రకారం విభజనకు చేయాల్సిందంతా చేశారు. కానీ సమైక్యవాదిగా గుర్తింపు పొందేందుకు తాపత్రయపడ్డారు. విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తరువాత మాత్రం మంత్రి శత్రుచర్ల స్పందించనే లేదు. సీఎం కిరణ్ బాటలో ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు దూరమై తరువాత మళ్లీ ఆ పార్టీతో మమేకమయ్యే యోచనలో ఉన్నారు.

 ఎమ్మెల్యేలూ!... మీరెక్కడ!?

 బొడ్డేపల్లి సత్యవతి... మీసాల నీలకంఠం... నిమ్మక సుగ్రీవులు... కొర్ల భారతి... వీరు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... వీళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఎందుకంటే తాము బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవుల్లో ఉన్నామనే విషయాన్నే వారు మరచిపోయారు. రాష్ట్ర విభజన యత్నాలపై ఎమ్మెల్యేలు ఇంతవరకు కనీసం స్పందించ లేదు. తెలంగాణ ఏర్పాటు బిల్లును లోక్‌సభ ఆమోదించిన తరువాత కూడా ఈ ఎమ్మెల్యేలు పత్తా లేకుండాపోయారు. విభజన తీరును నిరసిస్తూ రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం ప్రజలకు మళ్లీ తమ ముఖం చూపాలన్న ఆలోచనతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ మన ఎమ్మెల్యేలకు ఆ భయం లేదు. రాష్ట్ర విభజన జరిగినా... తమ ప్రాంత ప్రయోజనాలు మంటకలిసిపోయినా వారికి చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే ఎంచక్కా విభజనపై నోరు మెదపకుండా అధిష్టానం కనుసన్నల్లో మెలుగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement