సమస్యలే చదివించాయి..
శ్రీకాకుళం జిల్లాలో నలుమూలలా పర్యటించాను..
చాలా సమస్యలు కదిలించాయి..
వాటిని పరిష్కరించాలంటే ఐఏఎస్ ఒక్కటే మార్గం
అందుకే పక్కా ప్రణాళిక, లక్ష్యంతో చదివాను..
విజేతగా నిలిచా.
మహిళలను ప్రొత్సహిస్తే అబ్దుతాలే..
సివిల్స్ ర్యాంకర్ రెడ్డి వేదిత వెల్లడి
ఎచ్చెర్ల: సివిల్స్.. దేశంలో అత్యున్నత సర్వీస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షకు ఎంతో డిమాండ్ ఉంది. దేశంలో అత్యుత్తమ ఉద్యోగాలు ఈ సర్వీస్‌తోనే సాధ్యం. ప్రజలకు నేరుగా సేవచేసే భాగ్యం దక్కుతుంది. అందుకే చాలామంది యువత సివిల్స్‌లో మెరుగైన ర్యాంకు సాధన కోసం తాపత్రయపడతారు. రాత్రీపగలు శ్రమిస్తారు. రూ.లక్షల్లో వేతనాలు తీసుకున్న వారు సైతం ఉద్యోగాలు విడిచిపెట్టి సివిల్స్ సాధనకోసం తపిస్తారు. నాకు మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని సమస్యలే కదిలించాయి. ఐఏఎస్ సాధనకు ప్రేరణ ఇచ్చాయి. అమ్మ (వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి) ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం కోసం జిల్లా నలుమూలలా తిరిగాను. ప్రజలు సమస్యలు తెలుసుకున్నాను. వారి జీవనాన్ని దగ్గరగా పరిశీలించాను. అలాంటి వారికి ప్రత్యక్షంగా సేవచేయాలంటే ఐఏఎస్ ఒక్కటే మార్గం అనిపించింది. అందుకే రాత్రీపగలు ప్రణాళికా బద్ధంగా చదివాను. అందుకే జాతీయస్థాయిలో71వ ర్యాంకు సాధించగలిగానంటూ రెడ్డివేదిత పేర్కొన్నారు. 23 ఏళ్లకే దేశంలోని అత్యంత కీలకమైన ఐఏఎస్ బాధ్యతలు చేపట్టనున్న వేదితతో ‘సాక్షి’ ఆదివారం ముచ్చటించింది. ఆమె విజయగాథ ఆమె మాటల్లోనే...
ప్రశ్న: సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఎటువంటి ప్రణాళిక అవసరం?
వేదిత: ముందుగా సిలబస్, ఇంటర్వ్యూ వంటి పరీక్ష విధానాన్ని పూర్తిస్ధాయిలో తెలుసుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే పరీక్ష ఇది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విభాగాల్లో ప్రణాళికతో ప్రిపరేషన్ ఉండాలి. ఇష్టమైన, స్కోర్‌కు అవకాశం ఉన్న సబ్జెక్టును ఆప్షన్‌గా ఎంచుకోవాలి. అప్పుడే విజేతగా నిలవొచ్చు. ఎన్ని గంటలు చదివామన్నది కీలకంకాదు. చిత్త శుద్ధి, ఇష్టంతో చదవాలి. వేగత్వం, కచ్చితత్వం రెండూ విజయంలో కీలకం.
ప్రశ్న: సివిల్స్‌పై ఎందుకు మీ దృష్టి మళ్లింది?
వేదిత: ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో అమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. గ్రామాల్లో ప్రజలు సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ప్రయోజనాలు కనిపిం చటం లేదు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలంటే సివిల్స్ ఒక్కటే మార్గం. అందుకే సివిల్స్‌పై నేను దృష్టి పెట్టాను. మా నాన్న నాగభూషణరావు సైతం ఐఎఫ్‌ఎస్ అధికారి. ఆ ప్రభావం కూడా నాపై పడింది.
ప్రశ్న: ప్రస్తుతం మహిళలకు విద్యలో ఎలాంటి ప్రోత్సాహం ఉంది?
వేదిత: నా వరకు తల్లి దండ్రులు విద్యలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లేకుంటే నేను ఈ స్థాయికి చేరేదాన్ని కాదు. అయితే, మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా ప్రయోజనం లేదు. తల్లి దండ్రులు మహిళా విద్యకు ప్రొత్సహించాలి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. పురుషులతో సమానంగా చదువుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. గ్రామాల్లో ఇప్పటికీ మైనర్ బాలికలకు, చదువులో రాణిస్తున్న వారికి వివాహాలు చేసేస్తున్నారు. వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే మహిళలు సైతం సమాజంతో పురుషులతో సమానంగా రాణిస్తారు. మరో పక్క తల్లిదండ్రులు కోరికలు పిల్లపై రుద్దకుండా వారికి నచ్చిన రంగాల్లో వారిని ప్రోత్సహించాలి.
ప్రశ్న: మీ సివిల్స్ ఇంటర్వ్యూ విశేషాలు?
వేదిత: సివిల్స్ ఇంర్వ్యూలో పనిచేసే సామర్థ్యం, వ్యక్తత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానం, ఎంచుకున్న ఆప్షన్ సబ్జెక్టుపై పట్టు, వర్థమాన విషయాలపై అవగాహన వంటి అనేక అంశాలు బోర్డు సభ్యులు అడిగారు. సూటిగా సమాధానం చెప్పాను. ఇంజినీరింగ్, ఆంత్రోపాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం కమ్యూనికేషన్ రంగం విస్తరణపై పలు ప్రశ్నలు సంధించారు. ఏపీలో రైతుల సమస్యలు, రాజధాని భూసేరణ, నక్సలిజం సమస్య వంటి అనేక అంశాలు అడిగారు. ప్రతి ప్రశ్నలో వ్యక్తిత్వ వికాసాన్ని, అభ్యర్థి నిజాయితీని పరీక్షిస్తారు. మెయిన్స్ రాత పరీక్షతో పోల్చుకుంటే ఇంటర్వ్యూలో నాకు మార్కులు అనుకున్న స్థాయిలో రాలేదు. తొలిసారే 71 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.
ప్రశ్న: విజయంలో కోచింగ్ సెంటర్ల పాత్ర ఎంతవరకు ఉంటుంది?
వేదిత: సివిల్స్‌లో పోటీ ఎక్కువ. పోటీ పడేవారు సైతం అందరూ చురుకైన వారే అందుకే. అందుకే కోచింగ్ సెంటర్లు పాత్రకూడా విజయానికి దోహదం చేస్తుంది. మెయిన్స్‌కు ఢిల్లీలోని శ్రీరాంకోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆప్షనల్‌కు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పీవీ లక్ష్మయ్య దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఆన్‌లైన్ పద్ధతిలో తరగతులు విన్నాను. మరోపక్క ఢిల్లీ వచ్చి ఆయన నా సందేహాలను నివృత్తి చేశారు. దీంతో ఆప్షన్ సబ్జెక్టులో మంచి స్కోరు సాధించగలిగాను. మోడల్ ప్రశ్నపత్రాలు సైతం కోచింగ్ సెంటర్ లో ఎక్కువగా చేయడం జరుగుతుంది. తప్పులను విశ్లేషిస్తారు. దీనివల్ల చేసిన తప్పు మరోసారి చేయకుండా జాగ్రత్తపడే అవకాశం లభిస్తుంది. అయితే, కోచింగ్ తీసుకోకుండా సొంత మేటీయల్స్‌తో విజయం సాధించేవారూ ఉన్నారు.