మంత్రి మెప్పు కోసం కంత్రీ నిర్ణయం
మంత్రి మెప్పు కోసం కంత్రీ నిర్ణయం
Published Tue, Dec 31 2013 2:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రిగా జిల్లా విశాల ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన కోండ్రు మురళీ మోహన్ సంకుచిత భావంతో, తన నియోజకవర్గ ప్రజల మెప్పు పొందేందుకు జిల్లా రైతులందరికీ ఉపయోగపడాల్సిన కేంద్రాన్ని రాజాంకు తరలించుకుపోయారు. మెహర్బానీ కోసం రైతు ప్రయోజనాలకు తూట్లు పొడిచారు. రాష్ట్ర మంత్రిగా ఉంటూ నియోజకవర్గ మంత్రిగా తనస్థాయిని కుదించేసుకున్నారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(డబ్లుఏఎల్‌ఎంటీఏఆర్‌ఐ)ను జిల్లా కేంద్రంలో కాకుండా పట్టుబట్టి మరీ రాజాంకు తరలించారు. ఈ నెల ఆరో తేదీన ఆ శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ చేత ఆర్భాటంగా శంకుస్థాపన కూడా చేయించారు.
ధర్మాన కృషితో జిల్లాకు మంజూరు
వాస్తవానికి ఈ శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మొదట ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 15 కోట్లు కూడా కేటాయిం చింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని రైతులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సభ్యుల్లో వృత్తి నైపుణ్యత పెంచేందుకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్నది ఉద్దేశం. సుమారు వెయ్యి మందికి ఉపయోగపడే ఈ సెంటర్‌ను నగర ప్రాంతమైనవిశాఖలో కాకుండా సాగునీటి సంఘాలు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనతో ప్రభుత్వం విశాఖకు బదులు శ్రీకాకుళానికి మంజూరు చేసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో ధర్మాన మాట చెల్లుబాటు కాలేదు. అదే సమయంలో మంత్రి కోండ్రు రాజాంలో ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన చెప్పిన ప్రతి పనీ చేసిన అధికారులు ఆయన రాజీనామా అనంతరం కోండ్రు మాటకు విలువనిచ్చారు. వనరులు, రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా కేంద్రాన్ని రాజాంకు తరలించారు.
రాజాంలో నీటి సంఘాలే లేవు
జిల్లాలో 508 సాగునీటి సంఘాలు ఉండగా, రాజాం ప్రాంతంలో ఒక్కటి కూడా లేదు. ఈ నియోజకవర్గంలోనే ఉన్న మడ్డువలస ప్రాజెక్టు కింద కూడా సంఘాలు లేవు. వంశధార ప్రాజె క్టు కింద 54 సంఘాలు ఉండగా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 454 సంఘాలు ఉన్నా యి. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మరో 500 వరకు ఉన్నాయి. అంటే ఈ రెండు జిల్లాల్లోని మొత్తం సంఘాల కంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువ ఉన్నా యి. పైగా శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత, వెనుకబడిన జిల్లా. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువ. ఈ దృష్టితోనే శ్రీకాకుళంలో ఈ కేంద్రం ఏర్పాటుకు ధర్మాన ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇప్పుడు దాన్ని రాజాంకు మంత్రి కోండ్రు తన్నుకుపోయారు.
శ్రీకాకుళంలో స్థలం ఉన్నా..
శ్రీకాకుళంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలం లేదనే సాకు చూపించి దాన్ని రాజాంకు తరలించారు. కేంద్రం నిర్మాణానికి మూడెకరాల స్థలం అవసరం. మొదట నరసన్నపేట వద్ద ఉన్న వంశధార ప్రాజెక్టు ఏరియాలో ఏర్పాటు చేయాలని యోచించారు. అనంతరం కోండ్రు వ్యూహం ప్రకారం ఆ యోచన విరమించుకుని రాజాంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి శ్రీకాకుళం శివారులోని అంపోలు వద్ద ‘నాక్’ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉంది. అది కాకపోయినా వంశధార గెస్ట్‌హౌస్ ఎదురుగా రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇవేవీ పనికిరావన్నట్లు రాజాంలో మడ్డువలస కార్యాలయాల సమీపంలో రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూడా స్థలం లేదు. కొన్ని భవనాలను పడగొట్టి కొత్త కేంద్రాన్ని నిర్మించాల్సిందే. ఆ పనేదో శ్రీకాకుళంలో చేయొచ్చు కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కళాశాలకు అనుబంధంగా ఉంటే మంచిది...
జిల్లా కేంద్రానికి సమీపంలోని నైరలో వ్యవసాయ కళాశాల ఉంది. అందువల్ల రైతు శిక్షణ కేంద్రాన్ని శ్రీకాకుళం లో ఏర్పాటు చేస్తే నైర కళాశాల ప్రొఫెసర్ల సేవలు కూడా పొందే అవకాశం ఉండేది. అంతే కాకుండా ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల సలహాలు కూడా తీసుకునే వీలు ఉంది. ఇవన్నీ కాదని ఎక్కడో ఉన్న రాజాంలో ఈ శిక్షణ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఏమిటనేది పలువురు రైతుల ప్రశ్న. ఈ ప్రశ్నకు వ్యవసాయ శాఖ కూడా సమాధానం చెప్పలేకపోతోంది.
చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే..
అన్నింటికీ మించి శిక్షణ కోసం మూడు జిల్లాల రైతులు ఈ కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రాజాం పట్టణానికి రావాణా సౌకర్యాలు అంతగా లేవు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు రాజాం వెళ్లాలంటే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాల్సిందే. పైగా ఈ ప్రాంతాల్లోనే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించకుండా మంత్రి కోండ్రు స్వార్థపూరితంగా ఆలోచించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రీజినల్ సెంటర్ లక్ష్యమేమిటి?
ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రీజనల్ రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. అధునాతన సౌకర్యాలతో నిర్మించే ఈ కేంద్రంలో ఏసీ ఆడిటోరియం, డిజిటల్ డిస్‌ప్లే, హాస్టల్ భవనాలు, మేనేజ్‌మెంట్ భవనాలు, క్లాస్ రూమ్‌ల బ్లాక్ వంటివి ఉంటాయి. ప్రధానంగా రైతులకు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు నీటి నిల్వ, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏ సీజన్‌లో ఏ పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయనే వివరాలు, భూమి యాజమాన్య పద్ధతులు, భూసారానికి సంబంధించిన అంశాలు, అధునాతన పద్ధతులు, యంత్రాలతో సాగు పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు.
Advertisement
Advertisement