సీఎం జగన్‌తో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
సాక్షి, శ్రీకాకుళం: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. ఇప్పటికే 13 ఏళ్లపాటు ఆయన మంత్రిగా సేవలు అందించారు. జిల్లాకు సంబంధించి ఇదే రికార్డు. తాజాగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ చోటు దక్కడంతో ఆయన సీనియారిటీ మరింత పెరగనుంది. అంతేకాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఘనత ధర్మానకు దక్కింది. రెవెన్యూ మంత్రిగా మూడోసారి పనిచేసిన గౌరవం కూడా ధర్మాన ప్రసాద రావుకే లభించింది.
జిల్లాలో ఇలా..
► శ్రీకాకుళం జిల్లా తరఫున 1952 నుంచి నేటి వరకు 19 మంది నేతలు మంత్రులుగా పనిచేశారు.
► కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న చోటు దక్కించుకున్నారు.
► జిల్లాలో అత్యధిక కాలం(13 ఏళ్లు) మంత్రిగా పనిచేసిన ఘనత ధర్మాన ప్రసాదరావుకు దక్కగా, అత్యల్ప కాలం(31రోజులు) మంత్రిగా పనిచేసిన ఘనత తంగి సత్యనా రాయణకు దక్కింది. నాదెండ్ల భాస్కరరావు హయాంలో రెవెన్యూ మంత్రిగా అతి తక్కువ రోజులు పనిచేశారు.
అత్యధిక రికార్డు ధర్మానదే
► నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989లో ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు తొలిసారి మంత్రిగా నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు.
► ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో కూడా మంత్రి అయ్యారు.
► వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ రెండోసారి ఏర్పా టు చేసిన ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మరణానంతరం ఏర్పడిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పోస్టు దక్కింది. తాజాగా వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి పొందారు.
► అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనతే కాకుండా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం కూడా ధర్మానకే దక్కింది. నేదురుమల్లి జనార్దనరెడ్డి నుంచి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరకు ఆరుగురి వద్ద పనిచేసిన మంత్రిగా రికార్డుకెక్కారు. ఇక రెవెన్యూ శాఖనైతే మూడు సార్లు చేపట్టారు.
► ధర్మాన ప్రసాదరావు తర్వాత అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గౌరవం ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు, మాజీ మంత్రి ప్రతిభా భారతికి దక్కింది.
► తమ్మినేని సీతారాం పదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అత్యధికంగా 18 శాఖలకు పనిచేసిన చరిత్ర సీతారాం పేరున ఉంది.
► తాజాగా చేపట్టిన స్పీకర్ పదవితో కలిపితే 13ఏళ్ల పాటు ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించినట్టు అవుతుంది.
► ప్రతిభా భారతి విషయానికొస్తే మంత్రిగా దాదాపు ఎనిమిదిన్నరేళ్లు, స్పీకర్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment