హోదాపై ఎంతకాలం మభ్యపెడతారు? | Srikakulam YSRCP President Reddy Shanthi commets on TDP govt | Sakshi
Sakshi News home page

హోదాపై ఎంతకాలం మభ్యపెడతారు?

Published Sun, Mar 4 2018 11:37 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Srikakulam YSRCP President Reddy Shanthi commets on TDP govt - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకహోదాపై ఇప్పటికీ చంద్రబాబు, టీడీపీ ఎంపీలు స్పష్టంగా వారి విధానాన్ని ప్రకటించకపోవడం శోఛనీయమన్నారు. ప్రత్యేకహోదా కావాలని ఒకసారి, హోదా బదులు ప్యాకేజీతోనే మేలు జరుగుతుందని మరొకసారి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు పేర్కొనడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

 టీడీపీ అదికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ డిమాండ్‌ చేయలేదన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఒక్కసారి కూడా ఢిల్లీకి తీసుకువెళ్లలేదన్నారు. ఇప్పటికైనా హోదాపై టీడీపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండా అన్ని పార్టీలతో కలసి పోరాడతామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించేందుకేనని దుయ్యబట్టారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్‌ చేస్తే ఎక్కడ ఆ కేసును తిరగదోడతారోననే భయంతోనే రాష్ట్ర ప్రజల హక్కు అయి న ప్రత్యేకహోదాను పక్కన పెట్టారని రెడ్డి శాంతి విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ అయితే చంద్రబాబు, ఆయన బినామీలు జేబులు నింపుకొనే అవకాశం ఉంటుందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పోరా టాలు, ధర్నాలు, దీక్షలు చేశారన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టంచేశారు.

హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్‌ల వద్ద హోదా కోరుతూ మహాధర్నా నిర్వహించామన్నారు. రెండవ దశ కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ధర్నా నిర్వహిస్తున్నారని రెడ్డి శాంతి అన్నారు.

 హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహాన్ని గుర్తించిన టీడీపీ, ఆ పార్టీ నేతలు ఇపుడు ప్రత్యేకహోదా పల్లవిని అందుకున్నారన్నారు. ఇదంతా కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఆడుతున్న కపట నాటకమని దుయ్యబట్టారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం కృషిచేస్తున్నానంటూ మీడియాముందు, సమావేశాల్లో జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పడమే తప్ప ఢిల్లీలో ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదని ధ్వజమెత్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement