
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు
సాక్షి, తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజామున మూడు గంటలకు సుప్రభాత సేవలో శ్రీవారిని, అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయన్ని ఆశీర్వదించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, టీటీడీ అతిథ్యం మరువలేమని మైత్రిపాల సిరిసేన టీటీడీ విజిటర్స్ పుస్తకంలో రాశారు. అనంతరం ఆలయం వెలుపల మైత్రిపాల సిరిసేనతో కలిసి శ్రీలంక తూర్పుప్రాంతం గవర్నర్ ఆస్టిన్‌శరణాండో మీడియాతో మాట్లాడుతూ భారత పర్యటన విజయవంతమైందని చెప్పారు. భారతదేశంతో పలు ఒప్పందాలు చేసుకున్నామన్నారు.