- కనులపండువగా శ్రీవారి శాంతికల్యాణం
- శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
- ఆలయంలో పుష్పపరిమళాల శోభ
కోడూరు : ‘గోవిందా.. గోవిందా..’ నామస్మరణతో వెంకటేశ్వరస్వామివారి ఆలయప్రాంగణం ప్రతిధ్వనించింది. కోడూరులో వేంచేసియున్న శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారి శాంతి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు.
తిరుమలకు చెందిన కోగంటి రామానుజాచార్యులు మంత్రవచనాల మధ్య జరిగిన ఈ కళ్యాణమహోత్సవానికి కోడూరు చెందిన అద్దెపల్లి మోహన్‌బాబు, విజయవాడకు చెందిన అరపల్లి ప్రవీణ్‌కుమార్ దంపతులు కల్యాణకర్తలుగా వ్యవహరించారు. టీటీడీ ధర్మప్రచార పరిషత్ జిల్లా సభ్యులు మొవ్వ రఘశేఖరప్రసాద్ కల్యాణ ఘట్టం గురించి భక్తులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ముందుగా స్వామివారి మూలమూర్తులకు మంగళాశాసనం నిర్వహించి, వేదపండితుల పర్యవేక్షణలో పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో చేశారు.
మల్లెపూలతో శ్రీమహావిష్ణు అలంకారం..
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవెంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని మల్లెపూలతో శ్రీమహావిష్ణుగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు ధుంబాల శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లను శ్రీమహావిష్ణువుగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకారంలో స్వామివారు గధ ధరించినట్లు ఏర్పాటు చేసి, బంతిపువ్వులుతో మకరతోరణాన్ని అలంకరించారు.
మేల్కోట తరహాల్లో స్వామివార్లను అలంకరించినట్లు ప్రధానార్చకులు తెలిపారు. పోలీస్ అధికారులు సమకుర్చిన వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని నయనమనోహరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీవారి విద్యుత్ చిత్రపటం భక్తులను ఆకట్టుకుంది. రాత్రికి ఆలయ కల్యాణమండలంలో కోట వారి వంశీయులచే సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు.
దీపాలంకరణసేవలో దీపాలు వెలిగించడానికి కోడూరు, కృష్ణాపురం, యర్రారెడ్డివారిపాలెం, ఇస్మాయల్‌బేగ్‌పేట తదితర గ్రామలకు చెందిన మహిళలు పోటెత్తారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒక్కో ప్రదక్షణకు.. ఒక్కో వాయిద్యంతో..భక్తుల హరినామ సంకీర్తనల మధ్య ద్వాదశ ప్రదక్షణాలు భక్తిప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివార్లను ఆలయ ప్రవేశం చేయించి శ్రీపుష్పయాగం, స్వామివారికి దేవే రులతో కలిసి పవళింపు సేవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు..
బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. అనంతరం లక్ష మల్లెలతో స్వామివారికి అర్చన చేసి ఉత్సవాలు ముగించనున్నట్లు ఆలయ ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు.