సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నా తమ్ముడితో ఎవరో కుట్రతోనే హత్యాయత్నం చేయించారు. ఎవరు చేయించారో చెబుదామన్నా చేయించిన వాళ్లు మా వాడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పలేకున్నాడేమో. వాళ్లేదో డబ్బు ఇస్తామని ఆశ పెట్టి ఉంటారు. దీంతో వీడు భూమి కొందామని అనుకుని ఉంటాడు. అందుకే ఇలా చేసి ఉంటాడేమో. కానీ ఇప్పుడు వాళ్లు డబ్బులు వేసినా ప్రయోజనమేమిటి. నా తమ్ముడు బలైపోతున్నాడు’. ఇవీ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు సోదరి రత్నకుమారి కన్నీటితో అన్న మాటలు. తూర్పుగోదావరి జిల్లా ఠానేల్లంకకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు సోదరి శనివారం ముమ్మిడివరంలో ఆమె ఇంటి వద్ద ‘సాక్షి’తో అన్న మాటలు.
ఆమె ఇంకా ఏమన్నారంటే.... చేతిలో రూపాయి కూడా లేని శ్రీనివాసరావు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. నా తమ్ముడు ఇంతటి నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నా. ఇందుకు కారకులైన వారు ఇప్పుడు నా తమ్ముడిని ఏమి చేస్తారో. వాడు ఏమైపోతాడోనని ఆందోళనగా ఉంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు.
ఇక వాళ్లు పట్టించుకోరు...
ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. ఇక వాడిని వాళ్లు పట్టించుకోరు. అక్కడకు (విశాఖపట్నం) వెళ్లిన తరువాతే అలా అయ్యాడు. ఆ టైంలో ఏమైనా ఇప్పుడు వాడు నిజం చెప్పడానికి లేదు. బాగా భయపెట్టి ఉంటారు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్‌లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. అప్పుడు వాడి చేతిలో రూపాయి ఉండేది కాదు, అక్కా 20 రూపాయలు ఇవ్వమని అడిగే వాడు. బండిలో పెట్రోలు పోసుకోవడానికి కూడా వాడి వద్ద డబ్బులుండేవి కావు. అప్పుడప్పుడు రూ.20లు, రూ.30లు కూడా ఇచ్చినా తీసుకునే వాడు.
ఆరుగురిలో ఒకడు పోయినట్టేకదా
అసలు ఇలా చేయాల్సిన పనికాదు, ఎందుకు చేశాడో తెలియడం లేదు. నా పరిస్థితి ఏమిటని వాడు మెడ వాల్చేసి ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే... టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది. మా ఆరుగురులో ఒకడు చెదిరిపోయినట్టే కదా.. వాడు తిరిగొస్తాడా అని బాధ కలుగుతుంది. వాడి వయసు ఎంత.. ఇలా చేస్తాడంటే నమ్మగలమా.
ఇక దేవుడే దిక్కు: తండ్రి తాతారావు
ఠానేల్లంకలో తండ్రి తాతారావును పలకరిస్తే నా కొడుక్కు దేవుడే దిక్కు అంటూ విలపించాడు. పిల్లలను కంటాం, పెంచుతాం. కానీ ఇలా అవుతాడని అనుకోం కదా. నా భార్య చూస్తే అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వాడు ఇప్పట్లో బయటకు వస్తాడా అని భాద కలుగుతోంది. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు. ఎప్పుడూ ఇలా చేస్తాడని అనుకోలేదయ్యా.
ముఖ్యులు, బాస్‌ల నోట్లో పచ్చివెలక్యాయ...
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్న ఘటన అంతా డ్రామా అంటూ ఎగతాళి చేసిన సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులకు దిమ్మతిరిగేలా శ్రీనివాసరావు రక్తసంబంధీకుల మనోభావాలున్నాయి. సంచలనం కోసం అలా చేశాడని డీజీపీ, అతడు రాసినట్లు చెబుతున్న లేఖే ప్రామాణికమని సిట్ అధికాలు చెప్పడం అంతా తప్పుడు సమాచారమేనని, కుట్ర కోణాన్ని బైటకు తీయకుండా ముఖ్యులు ఆడినట్లు ఆడారని నిందితుడి బంధువుల అభిప్రాయాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఎవరో చేయించారు
Published Mon, Nov 5 2018 2:57 AM | Last Updated on Mon, Nov 5 2018 9:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment