ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి | Srisailam mahaksetram, horse, fruits | Sakshi

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Published Mon, Jan 19 2015 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Srisailam mahaksetram, horse, fruits

శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్
 
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌విలేజ్, స్మార్ట్ వార్డు సాధ్యమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్‌వార్డు పేరిట కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ర్యాలీని కలెక్టరేట్ వద్ద శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ ప్రారంభించారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజి, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్ రూం మీదుగా ర్యాలీ కొండారెడ్డి బురుజు చేరుకుంది.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజలు చైతన్యవంతులై జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందిస్తే మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు.

 జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని హంద్రినదిని శుభ్రం చేయాలని, కేసీ కెనాల్ వెంట గార్డెన్ ఏర్పాటు చేసి టూరిస్ట్ స్పాట్‌గా మలచాలని కలెక్టర్‌ను కోరారు. తాను తన స్వగ్రామమైన హుసేనాపురంను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే నగరం, గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

విద్యావంతులు, ఎన్‌జీవోలు సైతం ఈ విషయంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ తాను పులకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫలితాలు పదేళ్ల తర్వాత ఇంకో రూపంలో ఉంటాయన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను, గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచేలా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణా ప్రధానమేనన్నారు. ఇందుకోసం తమ శాఖ ఇప్పటికే 1000 గ్రామాలను సందర్శించిందన్నారు. మంచి మానవ సంబంధాలతో మంచి సమాజం సాధ్యం అవుతుందన్నారు.

ఆర్‌జీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్ శాంతిరాముడు మాట్లాడుతూ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 300 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ తాను కర్నూలు మండలం నూతనపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ప్రైవేటు పాఠశాల ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.

పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మోహన్‌రాజు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం కలపర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ శాంతిప్రియ పాండే, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈవో ఈశ్వర్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement