Smart andhra pradesh
-
ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ఈ కాన్ఫరెన్సు పెట్టారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. సాంకేతికత, నిరంతర శ్రమ, వినూత్న ఆలోచనతో మన గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా మార్చుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడాలని ఆయన అన్నారు. మనతోపాటు సమాజం ఎదిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(జిల్లా పరిషత్): ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్‌విలేజ్, స్మార్ట్ వార్డు సాధ్యమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్‌వార్డు పేరిట కర్నూలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ర్యాలీని కలెక్టరేట్ వద్ద శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ ప్రారంభించారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజి, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్ రూం మీదుగా ర్యాలీ కొండారెడ్డి బురుజు చేరుకుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజలు చైతన్యవంతులై జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందిస్తే మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని హంద్రినదిని శుభ్రం చేయాలని, కేసీ కెనాల్ వెంట గార్డెన్ ఏర్పాటు చేసి టూరిస్ట్ స్పాట్‌గా మలచాలని కలెక్టర్‌ను కోరారు. తాను తన స్వగ్రామమైన హుసేనాపురంను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే నగరం, గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యావంతులు, ఎన్జీవోలు సైతం ఈ విషయంలో తమ వంతు సహకారం అందించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ తాను పులకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఫలితాలు పదేళ్ల తర్వాత ఇంకో రూపంలో ఉంటాయన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను, గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచేలా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణా ప్రధానమేనన్నారు. ఇందుకోసం తమ శాఖ ఇప్పటికే 1000 గ్రామాలను సందర్శించిందన్నారు. మంచి మానవ సంబంధాలతో మంచి సమాజం సాధ్యం అవుతుందన్నారు. ఆర్జీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్ శాంతిరాముడు మాట్లాడుతూ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 300 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ తాను కర్నూలు మండలం నూతనపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ప్రైవేటు పాఠశాల ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మోహన్‌రాజు మాట్లాడుతూ ఆత్మకూరు మండలం కలపర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్ శాంతిప్రియ పాండే, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈవో ఈశ్వర్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
18న చంద్రబాబు 'స్మార్ట్' యాత్ర
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా పాదయాత్రతో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 18వ తేదీన 18 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు శాసనసభ నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలో ఆయన ఈ యాత్ర ప్రారంభిస్తారు. జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు శాసనసభ నియోజకవర్గాలలో ఆయన ఈ పాదయాత్ర చేస్తారు. -
5న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం
1న దత్తత గ్రామాల కేటాయింపు అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ పథకాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కొత్త ఏడాది ప్రారంభం రోజైన జనవరి ఒకటో తేదీన దత్తత తీసుకున్న వారికి గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు. తన కలల ప్రాజెక్టు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌కు వర్కింగ్ మాన్యువల్‌ను వెంటనే సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్ విలేజికి సంబంధించిన దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, విద్య, వైద్యం, రోడ్లు, పక్కా గృహాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కొత్త ఆలోచనలతో డాక్యుమెంట్ రూపొందించాలని ప్రణాళికా శాఖను ఆదేశించారు.అనుసరించాల్సిన వర్కింగ్ మాన్యువల్‌ను తక్షణం సిద్ధం చేయాలన్నారు. స్మార్ట్ నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల కొరత నుంచి మిగులు విద్యుత్ సాధించే దిశగా అభివృద్ధి సాధించామని చెప్పారు. ప్రభుత్వ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు, సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యక్రమం కింద కార్పొరేట్ సంస్థల మాదిరిగా గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, రైతు ఉపశమన పథకం, పింఛన్లు, ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం తదితర కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధికి ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కృషిని సీఎం వివరించారు. స్మార్ట్ హెల్త్ కేర్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ఎడ్యుకేషన్, స్మార్ట్ ఇన్ఫ్రా, స్మార్ట్ సిటి జన్, స్మార్ట్ విలేజ్‌లపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ఆయన తిలకించారు.