అరకొర సిబ్బంది.. అంతా ఇబ్బంది
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయం (ఆర్‌ఐవో)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఒకే ఒక్క అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మినహా కార్యాలయ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటర్మీడియెట్ బోర్డు అలసత్వంతో విద్యార్థులకు కూడా తిప్పలు తప్పడంలేదు. అంతేగాక కార్యాలయంలో ఫైళ్లు కూడా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వివిధ కాళాశాలల విద్యార్థులకు సంబంధించిన డేటా పూర్తి స్థాయిలో నమోదు కావడంలేదు. దీంతో ఏమి చేయూలో తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డు, ఇటు కళాశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పొరపాట్లు, సిబ్బంది లేమి కారణంగా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. వివరాల నమోదు పక్రియలో పొరపాట్లు చోటు జరుగుతున్నాయి. హాల్‌టిక్కెట్లు తప్పులు వస్తుండటంతో పరీక్షలు జరిగే సమయం వరకు విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు.
ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్‌తోనే..
జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘీక కళాశాలలు, 4 గిరిజన కళాశాలలు, 14ఏపీ మోడల్ కళాశాలలు, మరో 97 ప్రవేట్ కళాశాలలు ఉండగా దీనిలో 12 కళాశాలల్లో అడ్మిషన్లు నమోదుకాలేదు. సెకండీయర్‌లో దాదాపు 30వేలు, ఫస్టియర్‌లో ఇంతవరకు సుమారు 28వేలకు పైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల నమోదు, పరీక్షల పక్రియ అంతా ఆర్‌ఐవో పరిధిలోనే ఉంటుంది. కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ద్వారా గత కొన్నేళ్ల నుంచి ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన గోపాలరావు గుండెనొప్పి కారణంగా మెడికల్‌లీవ్ తీసుకోవడంతో కార్యాలయ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
వాస్తవానికి ఇక్కడి ఆర్‌ఐవో కార్యాలయంలో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లు, ఒక నైట్ వాచ్‌మ్యాన్ ఉండాలి. అయితే ఇక్కడ మెడికల్ లీవ్‌లో ఉన్న సూపరింటెండెంట్ మినహా రెగ్యులర్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ విధులు నత్తనడకన సాగుతున్నాయి. అవుట్‌సోర్సింగ్ ద్వారా ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు అటెండర్లు, ఒక నైట్‌వాచ్‌మ్యాన్ పనిచేస్తున్నారు. విధిలేక కొన్నిసార్లు అటెండర్లు సైతం రికార్డుల నమోదు ప్రక్రియ చేపడుతుండటంతో అంతా తప్పులతడకగా సాగుతోంది.
ఇబ్బందులు పడుతున్నాం..
ఆఫీసులో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వివిధ కళాశాలలకు చెందిన సిబ్బందిని బతిమాలి పనులు చేయించుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని కార్యాలయంలో సిబ్బందిని తక్షణమే నియమించకపోతే విధులు నిర్వర్తించలేం.
- ఎ.అన్నమ్మ, జిల్లా ఆర్‌ఐవో, ఇంటర్మీడియెట్ బోర్డు