RIO office
-
‘ఆర్ఐఓ’లో అవినీతి దందా
ఇంటర్మీడియట్ ప్రాంతీయ కార్యాలయంలో తాజాగా కారు రూపంలో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా తప్పుడు బిల్లులతో అద్దె వాహనం పేరుతో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేస్తున్నారు. సుమారు రూ.ఎనిమిదిన్నర లక్షల వరకు ఓ అధికారి తప్పుడు బిల్లులతో స్వాహా చేశారు. కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోరుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు సైతం ఈ వ్యవహారంపై విస్మయం చెందుతున్నారు. - నిజామాబాద్ అర్బన్ * సొంత కారుకు అద్దెవసూలు * మూడేళ్లుగా కొనసాగుతున్న వైనం.. * సుమారు రూ.8.50లక్షలు స్వాహా జరిగిందిలా.. ఆర్ఐఓ కార్యాలయానికి ఓ అధికారి 2012లో బదిలీపై వచ్చాడు. ఇతను మూడేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నారు. పరిపాలన విధానం సాధారణంగా ఉండడం, కార్యాలయం సైతం శివారు ప్రాంతంలో ఉండడంతో ఉన్నతాధికారుల పరిశీలన లేకపోవడంతో కార్యాలయంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. ఓ అధికారి తన సొంత కారును అద్దెవాహనంగా చూపిస్తున్నారు. కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్స్‌కు చెందిన ఇండిక కారును అద్దె పేరిట ఆర్ఐవో కార్యాలయంలో కొనసాగుతున్నట్లు చూపిస్తున్నారు. నెలకు రూ.24 వేలు పొందుతున్నాడు. ఇందుకుగాన బిల్లులును సమర్పించిన కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్ యజమానికి రూ.3 వేలు ఇస్తున్నారు. మిగితా రూ.21వేలను అధికారి జేబులో వేసుకుంటున్నారు. దీనికిగాను బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని లెక్చరర్, ట్రావెల్ యజమానికి మధ్యవర్థుత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ట్రావెల్స్ యజమాని బిల్లులో ఇండికా కారును ఆ వివరాలను చూపిస్తున్నాడు. కాని సంబంధిత కారు నాలుగు సంవత్సరాల క్రితమే ఆ కారు మరోకరికి విక్రయించడం జరిగింది. ట్రావెల్స్‌లో సంబంధిత నెంబర్లపై ఇండికా కార్లు లేవు. ఇలా అధికారి ట్రావెల్స్నుండి తప్పుడు బిల్లులు తీసుకుంటు అద్దె వాహనం పేరిట రూ.ఎనిమిదన్నర లక్షల రూపాయలను స్వాహా చేశారు. యూజమాన్యాల కానుక జిల్లాకు వచ్చిన ఆర్ఐవో కార్యాలయంలోని ఓ అధికారికి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు కానుకగా ఒక కారును కొన్నిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రస్తుతం అదేకారులో ఆయన తిరుగుతున్నారు. కాని ట్రావెల్స్ నుండి అద్దె వాహనం సమకూర్చుకున్నట్లు బిల్లులు సృష్టించి డబ్బులు స్వాహా చేస్తున్నాడు. కార్యాలయంలో ఓ ఉద్యోగి తప్పుడు బిల్లులు ఉన్నందున తాను సంతకాలు పెట్టలేనని తీవ్రం గా మండిపడినట్లు తెలిసింది. లెక్చరర్ల సంఘం నాయకుడితో రెండుసార్లు సదరు ఉద్యోగిని హెచ్చరింపజేసినట్లు సమాచారం. మూడేళ్లుగా ఆర్ఐవో కార్యాలయంలో ఈ తతంగంగా కొనసాగుతున్నా బయటకు రాకపోవడం గమనార్హం. కార్యాలయంలోని ఉద్యోగులందరు సమన్వయంతో ఈ అవినీతి బాగోతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సత్వరమే విచారణ జరిపించాలి ఆర్ఐఓ కార్యాలయంలో అద్దె వాహనం పేరిట నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపాలి. సొంత కారుకు అద్దె పేరిట అధికారులు డబ్బులు స్వాహా చేయడం మూడేళ్లుగా లక్షలాది రూపాయలను కాజేయడంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. - శ్రీనివాస్‌గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా
మెదక్ : కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అనంతరం విద్యా వ్యవస్థను రక్షించాలని కోరుతూ ఆర్ఐఓకు వినతిపత్రం అందించారు. -
‘పరీక్షా’ సమయం
శ్రీకాకుళం:ఆందోళనలు, అసౌకర్యాల నడుమ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాజరు చాలకపోవడంతో పలువురు సైన్స్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయలేదు. అటువంటి విద్యార్థులందరూ స్థానిక ఆర్ఐవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హాజరు సరిపోని ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రం జరిమానా కట్టించుకుని పరీక్షలకు అనుమతించారు. దీంతో సైన్స్ గ్రూపుల విద్యార్థులు తమకు ఎందుకు ఆ అవకాశం కల్పించరంటూ ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారులతో వాదనకు దిగారు. సైన్స్ విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేదని, నిబంధనల మేరకే హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఇంతలో పోలీసులు కలుగజేసుకొని విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా శాంతించని వారంతా తీవ్ర ఆందోళన చెందుతూ జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఫర్నిచర్ లేక అవస్థలు ఇదిలా ఉంటే చాలా పరీక్ష కేంద్రాల్లో అసౌకర్యాలు తాండవించాయి. అన్ని కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా సప్లయర్స్ నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ కుర్చీలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిపై కూర్చొని పరీక్ష రాసేందుకు విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. అలాగే హాల్‌టిక్కెట్లలో పరీక్ష కేంద్రాన్ని సూచించడంలో కూడా అధికారులు కొత్త విధానాన్ని అవలంభించారు. దీని వలన కూడా విద్యార్థులు కష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఒక కేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళ్లి, అక్కడి నుంచి అసలైన కేంద్రానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమెన్స్ కళాశాల రోడ్డులో ఉన్న చైతన్య కళాశాల అని హాల్‌టిక్కెట్‌పై పేర్కొనడంతో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రం ఉమెన్స్ కళాశాల అనుకొని మొదట అక్కడికి వెళ్లారు. తీరా అక్కడ తమ నెంబరు లేకపోవడంతో మరోసారి హాల్‌టిక్కెట్ చూసుకొని ఆందోళనతో చైతన్య కళాశాలకు పరిగెత్తాల్సి వచ్చింది. అనేక చోట్ల ఇదే పరిస్థితి తారస పడింది. రవాణా సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించే అవకాశం లేకపోయినా తొలి రోజున ఈ నిబంధనను అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఈ నిబంధనను అమలు చేసి ఉంటే ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 20 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయి ఉండేవారు. చాలా కేంద్రాల్లో గాలి, వెలుతురు లేక విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇటువంటి అసౌకర్యాలపై పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల అధికారులతో వాదనలకు దిగారు. అయినా అది అరణ్యరోదనే అయింది. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష జరిగే సమయానికైనా అసౌకర్యాలు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు. తొలిరోజు 1489 మంది గైర్హాజరు ఇంటర్మీడియెట్ తొలిరోజు పరీక్షకు 1489 మంది గైర్హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పరీక్షకు మొత్తం 30,160 మంది హాజరు కావాల్సి ఉండగా 28,671 మంది పరీక్ష రాశారు. తొలి రోజున ఓ విద్యార్థి డిబార్ అయ్యారు. తొగరాం పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని సిట్టింగ్ స్క్యాడ్ పట్టుకొని డిబార్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీనరసింహం పరిశీలించారు. ఆర్ఐవో అన్నమ్మ, డీవీఈవో పాత్రుని పాపారావులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. -
అరకొర సిబ్బంది.. అంతా ఇబ్బంది
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయం (ఆర్ఐవో)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఒకే ఒక్క అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ మినహా కార్యాలయ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటర్మీడియెట్ బోర్డు అలసత్వంతో విద్యార్థులకు కూడా తిప్పలు తప్పడంలేదు. అంతేగాక కార్యాలయంలో ఫైళ్లు కూడా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వివిధ కాళాశాలల విద్యార్థులకు సంబంధించిన డేటా పూర్తి స్థాయిలో నమోదు కావడంలేదు. దీంతో ఏమి చేయూలో తెలియని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అటు ఇంటర్మీడియట్ బోర్డు, ఇటు కళాశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియలో పొరపాట్లు, సిబ్బంది లేమి కారణంగా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. వివరాల నమోదు పక్రియలో పొరపాట్లు చోటు జరుగుతున్నాయి. హాల్‌టిక్కెట్లు తప్పులు వస్తుండటంతో పరీక్షలు జరిగే సమయం వరకు విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్తోనే.. జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలలు, 11 సాంఘీక కళాశాలలు, 4 గిరిజన కళాశాలలు, 14ఏపీ మోడల్ కళాశాలలు, మరో 97 ప్రవేట్ కళాశాలలు ఉండగా దీనిలో 12 కళాశాలల్లో అడ్మిషన్లు నమోదుకాలేదు. సెకండీయర్‌లో దాదాపు 30వేలు, ఫస్టియర్‌లో ఇంతవరకు సుమారు 28వేలకు పైగా అడ్మిషన్లు నమోదయ్యాయి. విద్యార్థుల అడ్మిషన్ల నమోదు, పరీక్షల పక్రియ అంతా ఆర్ఐవో పరిధిలోనే ఉంటుంది. కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ద్వారా గత కొన్నేళ్ల నుంచి ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి వరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన గోపాలరావు గుండెనొప్పి కారణంగా మెడికల్‌లీవ్ తీసుకోవడంతో కార్యాలయ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాస్తవానికి ఇక్కడి ఆర్ఐవో కార్యాలయంలో ఏవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లు, ఒక నైట్ వాచ్‌మ్యాన్ ఉండాలి. అయితే ఇక్కడ మెడికల్ లీవ్‌లో ఉన్న సూపరింటెండెంట్ మినహా రెగ్యులర్ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ విధులు నత్తనడకన సాగుతున్నాయి. అవుట్సోర్సింగ్ ద్వారా ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు అటెండర్లు, ఒక నైట్‌వాచ్‌మ్యాన్ పనిచేస్తున్నారు. విధిలేక కొన్నిసార్లు అటెండర్లు సైతం రికార్డుల నమోదు ప్రక్రియ చేపడుతుండటంతో అంతా తప్పులతడకగా సాగుతోంది. ఇబ్బందులు పడుతున్నాం.. ఆఫీసులో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. వివిధ కళాశాలలకు చెందిన సిబ్బందిని బతిమాలి పనులు చేయించుకుంటున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకుని కార్యాలయంలో సిబ్బందిని తక్షణమే నియమించకపోతే విధులు నిర్వర్తించలేం. - ఎ.అన్నమ్మ, జిల్లా ఆర్ఐవో, ఇంటర్మీడియెట్ బోర్డు