శ్రీకాకుళం:ఆందోళనలు, అసౌకర్యాల నడుమ జిల్లాలో బుధవారం ఇంటర్‌మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాజరు చాలకపోవడంతో పలువురు సైన్స్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయలేదు. అటువంటి విద్యార్థులందరూ స్థానిక ఆర్‌ఐవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హాజరు సరిపోని ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రం జరిమానా కట్టించుకుని పరీక్షలకు అనుమతించారు. దీంతో సైన్స్ గ్రూపుల విద్యార్థులు తమకు ఎందుకు ఆ అవకాశం కల్పించరంటూ ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారులతో వాదనకు దిగారు. సైన్స్ విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేదని, నిబంధనల మేరకే హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఇంతలో పోలీసులు కలుగజేసుకొని విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా శాంతించని వారంతా తీవ్ర ఆందోళన చెందుతూ జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
ఫర్నిచర్ లేక అవస్థలు
ఇదిలా ఉంటే చాలా పరీక్ష కేంద్రాల్లో అసౌకర్యాలు తాండవించాయి. అన్ని కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా సప్లయర్స్ నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ కుర్చీలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిపై కూర్చొని పరీక్ష రాసేందుకు విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. అలాగే హాల్‌టిక్కెట్లలో పరీక్ష కేంద్రాన్ని సూచించడంలో కూడా అధికారులు కొత్త విధానాన్ని అవలంభించారు. దీని వలన కూడా విద్యార్థులు కష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఒక కేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళ్లి, అక్కడి నుంచి అసలైన కేంద్రానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమెన్స్ కళాశాల రోడ్డులో ఉన్న చైతన్య కళాశాల అని హాల్‌టిక్కెట్‌పై పేర్కొనడంతో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రం ఉమెన్స్ కళాశాల అనుకొని మొదట అక్కడికి వెళ్లారు. తీరా అక్కడ తమ నెంబరు లేకపోవడంతో మరోసారి హాల్‌టిక్కెట్ చూసుకొని ఆందోళనతో చైతన్య కళాశాలకు పరిగెత్తాల్సి వచ్చింది.
అనేక చోట్ల ఇదే పరిస్థితి తారస పడింది. రవాణా సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించే అవకాశం లేకపోయినా తొలి రోజున ఈ నిబంధనను అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఈ నిబంధనను అమలు చేసి ఉంటే ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 20 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయి ఉండేవారు. చాలా కేంద్రాల్లో గాలి, వెలుతురు లేక విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇటువంటి అసౌకర్యాలపై పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల అధికారులతో వాదనలకు దిగారు. అయినా అది అరణ్యరోదనే అయింది. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష జరిగే సమయానికైనా అసౌకర్యాలు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు.
తొలిరోజు 1489 మంది గైర్హాజరు
ఇంటర్మీడియెట్ తొలిరోజు పరీక్షకు 1489 మంది గైర్హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పరీక్షకు మొత్తం 30,160 మంది హాజరు కావాల్సి ఉండగా 28,671 మంది పరీక్ష రాశారు. తొలి రోజున ఓ విద్యార్థి డిబార్ అయ్యారు. తొగరాం పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని సిట్టింగ్ స్క్యాడ్ పట్టుకొని డిబార్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీనరసింహం పరిశీలించారు. ఆర్‌ఐవో అన్నమ్మ, డీవీఈవో పాత్రుని పాపారావులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు.
‘పరీక్షా’ సమయం
Published Thu, Mar 12 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement
Advertisement