science students
-
తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి అంటే..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేపట్నుంచి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. దాదాపు 3 లక్షల మంది సైన్స్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజ రవనున్నారు. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానాన్ని ఎత్తేయడంతో విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండదని అధికారులు ఇప్పటికే తెలిపారు. దీంతో ప్రాక్టికల్స్‌పై పెద్దగా ఆసక్తి కన్పించడం లేదని అధ్యాకులు చెబుతున్నారు. అదీగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటివరకు లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్ ఏవీ జరగలేదని తెలుస్తోంది. కాగా, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఏమైనా సందేహా లుంటే నివృత్తి చేసేందుకు 040–24600110 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. -
పరిమితి దాటి అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ఆ కాలేజీలో 240 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులున్నారు.. కానీ కంప్యూటర్లు మాత్రం 50 లోపే! ఇదేకాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీలు విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. విద్యార్థుల చేరికలకు, సెక్షన్ల పెంపునకు అనుగుణంగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు ఉండటం లేదు. 10 నుంచి 20 మంది విద్యార్థులకు ఓ కంప్యూటర్ను అమర్చి మమ అనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆమేరకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అవన్నీ అంతో ఇంతో పేరున్న కాలేజీలు కావడంతో విద్యార్థులు వాటివైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. మరోపక్క కన్వీనర్ కోటా కింద కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ భారీగా పొందుతున్నాయి. చివరకు అక్కడ చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రమాణాలూ పతనమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అమ్మకానికి సీట్లు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఇటీవల పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇలాంటి పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐసీటీఈ, వర్సిటీల్లో పైరవీలు జరిపి కొన్ని యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ఇతర కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 32 విభాగాలకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లు ఉండగా 60,315 సీట్లు భర్తీ అయ్యాయి. 45,888 సీట్లు మిగిలాయి. భర్తీ అయిన సీట్లన్నీ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ సివిల్ వంటి ముఖ్యమైన విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీట్లను కూడా కొన్ని కాలేజీల్లోనే అదనపు సెక్షన్ల పేరిట భర్తీ చేస్తున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లను కూడా డిమాండ్‌ను బట్టి అమ్మకానికి పెడుతున్నారు. దెబ్బతింటున్న ప్రమాణాలు.. సరైన ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మాత్రమే అదనపు సెక్షన్లకు అనుమతించాలని, పరిమితికి మించి మంజూరు చేయవద్దని ఏఐసీటీఈని కోరాలని కమిషన్ భావిస్తోంది. -
సైన్స్ డిగ్రీనా.. సెటిలైనట్లే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మాత్రమే కాదు.. బీఎస్సీ వంటి సైన్స్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభ (ఎంప్లాయబుల్ టాలెంట్) కలిగిన విద్యార్థుల సంఖ్య బీఎస్సీ కోర్సుల్లో భారీగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో దేశంలో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల స్థితిగతులపై అంచనా వేసింది. ఈ సర్వేలో భాగంగా దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100కు పైగా కంపెనీలు, 3.10 లక్షల మంది విద్యార్థులను కలిసింది. వారి అభిప్రాయాలు, పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి నివేదికను వెల్లడించింది. 2017 సంవత్సరంలో ఉద్యోగానికి కావాల్సిన సమర్థత కలిగిన బీఎస్సీ విద్యార్థులు 31.76% ఉంటే అది 2018లో 33.62 శాతానికి పెరిగింది. ఇక 2019 నాటికి ఇది 47.37 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇంజనీరింగ్‌లో పెరగనున్న అవకాశాలు.. వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేసింది. 2014లో 51.74 శాతం మందికి ఎంప్లాయబిలిటీ టాలెంట్ ఉంటే అది 2015లో 54 శాతానికి పెరిగింది. తరువాత మూడేళ్లలో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ 2019 నాటికి మాత్రం ఇలా టాలెంట్ కలిగిన విద్యార్థులు 57.09 శాతానికి చేరుకుంటారని వీబాక్స్ అంచనా వేసింది. బీఎస్సీలోనూ అదే పరిస్థితి. 2014లో బీఎస్సీలో 41.66 శాతం మంది ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉంటే అది 2017 వరకు ఏటా తగ్గుతూ వచ్చింది. అయితే 2018లో మాత్రం పెరిగింది. ఇక 2019లో భారీగా పెరుగుదల నమోదు కానుందని వెల్లడించింది. దేశంలో ఐటీ, ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన వారి సంఖ్య 2014 నుంచి ఇప్పటివరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2014లో ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఎంబీఏ విద్యార్థులు 41.02 శాతం ఉంటే 2018లో 39.4 శాతానికి తగ్గింది. ఇక 2019లో ఈ సంఖ్య 36.44 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఒకప్పుడు ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన ఐటీఐ విద్యార్థులు 46.92 శాతం ఉంటే 2018 నాటికి అది 29.46 శాతానికి పడిపోయింది. 2019లో ఎలా ఉంటుందన్న అంచనా కూడా వీబాక్స్ వేయలేదు. పాలిటెక్నిక్‌లో సామర్థ్యాలు కలిగిన వారు 2018లో 32.67 శాతం ఉంటే వచ్చే సంవత్సరానికి 18.05 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఎనిమిదవ స్థానంలో తెలంగాణ... రాష్ట్రాల వారీగా చూస్తే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. గతంలో టాప్ 10లో కూడా లేని తెలంగాణ ఈసారి తమ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చి గత రెండేళ్లుగా చర్యలు చేపట్టిన కారణంగా ఈసారి 8వ స్థానంలో నిలువగలిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2018లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కలిగిన మొదటి పది స్థానాల్లో ఉన్న దిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈసారి కూడా మొదటి పది స్థానాల్లో ఉన్నాయని ఇండియా స్కిల్ రిపోర్టు–2019 పేర్కొంది. ఈసారి కొత్తగా తెలంగాణ, రాజస్థాన్, హరియాణా టాప్–10 రాష్ట్రాల జాబితాలో చేరాయి. 2018 నివేదికలో టాప్–10 రాష్ట్రాల్లో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ఈసారి లేకుండాపోయాయి. -
‘పరీక్షా’ సమయం
శ్రీకాకుళం:ఆందోళనలు, అసౌకర్యాల నడుమ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హాజరు చాలకపోవడంతో పలువురు సైన్స్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు జారీ చేయలేదు. అటువంటి విద్యార్థులందరూ స్థానిక ఆర్ఐవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హాజరు సరిపోని ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రం జరిమానా కట్టించుకుని పరీక్షలకు అనుమతించారు. దీంతో సైన్స్ గ్రూపుల విద్యార్థులు తమకు ఎందుకు ఆ అవకాశం కల్పించరంటూ ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారులతో వాదనకు దిగారు. సైన్స్ విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేదని, నిబంధనల మేరకే హాల్‌టిక్కెట్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. ఇంతలో పోలీసులు కలుగజేసుకొని విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా శాంతించని వారంతా తీవ్ర ఆందోళన చెందుతూ జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఫర్నిచర్ లేక అవస్థలు ఇదిలా ఉంటే చాలా పరీక్ష కేంద్రాల్లో అసౌకర్యాలు తాండవించాయి. అన్ని కేంద్రాల్లో అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా సప్లయర్స్ నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ కుర్చీలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిపై కూర్చొని పరీక్ష రాసేందుకు విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. అలాగే హాల్‌టిక్కెట్లలో పరీక్ష కేంద్రాన్ని సూచించడంలో కూడా అధికారులు కొత్త విధానాన్ని అవలంభించారు. దీని వలన కూడా విద్యార్థులు కష్టాల పాలు కావాల్సి వచ్చింది. ఒక కేంద్రానికి బదులుగా మరో కేంద్రానికి వెళ్లి, అక్కడి నుంచి అసలైన కేంద్రానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమెన్స్ కళాశాల రోడ్డులో ఉన్న చైతన్య కళాశాల అని హాల్‌టిక్కెట్‌పై పేర్కొనడంతో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రం ఉమెన్స్ కళాశాల అనుకొని మొదట అక్కడికి వెళ్లారు. తీరా అక్కడ తమ నెంబరు లేకపోవడంతో మరోసారి హాల్‌టిక్కెట్ చూసుకొని ఆందోళనతో చైతన్య కళాశాలకు పరిగెత్తాల్సి వచ్చింది. అనేక చోట్ల ఇదే పరిస్థితి తారస పడింది. రవాణా సౌకర్యం కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించే అవకాశం లేకపోయినా తొలి రోజున ఈ నిబంధనను అధికారులు అంతగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఈ నిబంధనను అమలు చేసి ఉంటే ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 20 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయి ఉండేవారు. చాలా కేంద్రాల్లో గాలి, వెలుతురు లేక విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇటువంటి అసౌకర్యాలపై పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల అధికారులతో వాదనలకు దిగారు. అయినా అది అరణ్యరోదనే అయింది. గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష జరిగే సమయానికైనా అసౌకర్యాలు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు. తొలిరోజు 1489 మంది గైర్హాజరు ఇంటర్మీడియెట్ తొలిరోజు పరీక్షకు 1489 మంది గైర్హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పరీక్షకు మొత్తం 30,160 మంది హాజరు కావాల్సి ఉండగా 28,671 మంది పరీక్ష రాశారు. తొలి రోజున ఓ విద్యార్థి డిబార్ అయ్యారు. తొగరాం పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని సిట్టింగ్ స్క్యాడ్ పట్టుకొని డిబార్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీనరసింహం పరిశీలించారు. ఆర్ఐవో అన్నమ్మ, డీవీఈవో పాత్రుని పాపారావులు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. -
గురుకుల కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విజయపురి సౌత్‌లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో సైన్స్ - ఆర్ట్స్ విద్యార్థులు గొడవపడ్డారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళాశాల వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.