‘ఆర్‌ఐఓ’లో అవినీతి దందా
ఇంటర్మీడియట్ ప్రాంతీయ కార్యాలయంలో తాజాగా కారు రూపంలో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా తప్పుడు బిల్లులతో అద్దె వాహనం పేరుతో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేస్తున్నారు. సుమారు రూ.ఎనిమిదిన్నర లక్షల వరకు ఓ అధికారి తప్పుడు బిల్లులతో స్వాహా చేశారు. కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోరుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది. వివిధ కళాశాల ప్రిన్సిపాళ్లు సైతం ఈ వ్యవహారంపై విస్మయం చెందుతున్నారు. - నిజామాబాద్ అర్బన్
* సొంత కారుకు అద్దెవసూలు
* మూడేళ్లుగా కొనసాగుతున్న వైనం..
* సుమారు రూ.8.50లక్షలు స్వాహా
జరిగిందిలా..
ఆర్‌ఐఓ కార్యాలయానికి ఓ అధికారి 2012లో బదిలీపై వచ్చాడు. ఇతను మూడేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నారు. పరిపాలన విధానం సాధారణంగా ఉండడం, కార్యాలయం సైతం శివారు ప్రాంతంలో ఉండడంతో ఉన్నతాధికారుల పరిశీలన లేకపోవడంతో కార్యాలయంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. ఓ అధికారి తన సొంత కారును అద్దెవాహనంగా చూపిస్తున్నారు. కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్స్‌కు చెందిన ఇండిక కారును అద్దె పేరిట ఆర్‌ఐవో కార్యాలయంలో కొనసాగుతున్నట్లు చూపిస్తున్నారు. నెలకు రూ.24 వేలు పొందుతున్నాడు.
ఇందుకుగాన బిల్లులును సమర్పించిన కంఠేశ్వర్‌లోని ఓ ట్రావెల్ యజమానికి రూ.3 వేలు ఇస్తున్నారు. మిగితా రూ.21వేలను అధికారి జేబులో వేసుకుంటున్నారు. దీనికిగాను బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని లెక్చరర్, ట్రావెల్ యజమానికి మధ్యవర్థుత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ట్రావెల్స్ యజమాని బిల్లులో ఇండికా కారును ఆ వివరాలను చూపిస్తున్నాడు. కాని సంబంధిత కారు నాలుగు సంవత్సరాల క్రితమే ఆ కారు మరోకరికి విక్రయించడం జరిగింది. ట్రావెల్స్‌లో సంబంధిత నెంబర్లపై ఇండికా కార్లు లేవు. ఇలా అధికారి ట్రావెల్స్‌నుండి తప్పుడు బిల్లులు తీసుకుంటు అద్దె వాహనం పేరిట రూ.ఎనిమిదన్నర లక్షల రూపాయలను స్వాహా చేశారు.
యూజమాన్యాల కానుక
జిల్లాకు వచ్చిన ఆర్‌ఐవో కార్యాలయంలోని ఓ అధికారికి జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు కానుకగా ఒక కారును కొన్నిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రస్తుతం అదేకారులో ఆయన తిరుగుతున్నారు. కాని ట్రావెల్స్ నుండి అద్దె వాహనం సమకూర్చుకున్నట్లు బిల్లులు సృష్టించి డబ్బులు స్వాహా చేస్తున్నాడు.
కార్యాలయంలో ఓ ఉద్యోగి తప్పుడు బిల్లులు ఉన్నందున తాను సంతకాలు పెట్టలేనని తీవ్రం గా మండిపడినట్లు తెలిసింది. లెక్చరర్ల సంఘం నాయకుడితో రెండుసార్లు సదరు ఉద్యోగిని హెచ్చరింపజేసినట్లు సమాచారం. మూడేళ్లుగా ఆర్‌ఐవో కార్యాలయంలో ఈ తతంగంగా కొనసాగుతున్నా బయటకు రాకపోవడం గమనార్హం. కార్యాలయంలోని ఉద్యోగులందరు సమన్వయంతో ఈ అవినీతి బాగోతానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సత్వరమే విచారణ జరిపించాలి
ఆర్‌ఐఓ కార్యాలయంలో అద్దె వాహనం పేరిట నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపాలి. సొంత కారుకు అద్దె పేరిట అధికారులు డబ్బులు స్వాహా చేయడం మూడేళ్లుగా లక్షలాది రూపాయలను కాజేయడంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం.
- శ్రీనివాస్‌గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు