పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో సిద్ధమైన పందెంకోళ్ల బరి
పందేలకు సై.. కేసులకూ రె‘ఢీ’
పందేల రాయుళ్ల బరితెగింపు
అడ్డుకుంటాం: పోలీసులు
గతం కంటే తగ్గిన హడావుడి
భోగి రోజు అనధికారిక అనుమతులొస్తాయని ఆశలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా ‘పశ్చిమా’న సంక్రాంతికి పందెం కోడి సై అంటోంది. భోగి పండుగ నుంచి కనుమ వరకు మూడు రోజులపాటు నిరంతరాయంగా పందేలు సాగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మునుపటి కంటే హడావుడి బాగా తగ్గినా పండుగ రోజుల్లోనైనా భారీగా నిర్వహించాలని పందేల రాయుళ్లు పట్టుదలతో ఉన్నారు. పోలీసు కేసులనైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు.
కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు మంగళవారం భీమవరంలో లాంఛనంగా కోడి పందేలను ప్రారంభించారు. సుముహూర్తం చూసుకుని మరీ ఆయన రెండు పందెం కోళ్లను బరిలోకి దింపి జిల్లాలో పందేలకు శ్రీకారం చుట్టినట్టు ప్రకటించారు. అయితే కోళ్లకు కత్తులు కట్టకుండా డింకీ పందేలను ఆడించారు. అదేవిధంగా ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబ రాల్లో ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకుని పందేలకు సై అనిపించారు.
నిశిరాత్రి మొదలైన బరుల సందడి
పందేల నిర్వహణకు మంగళవారం రాత్రి నుంచి బరులు సిద్ధం చేస్తున్నారు. డెల్టాలో ప్రధానంగా వెంప, భీమవరంలో ఆశ్రమం తోట, లోసరి, ఐ.భీమవరం, సీసలి, మహదేవపట్నం తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప అత్యంత ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలను తిలకించేందుకు సినీస్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో బుధవారం నుంచి రాత్రింబవళ్లు పోటీలు ఖాయమని నిర్వాహకులు చెబుతున్నారు.
ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం, పంగిడిగూడెం శివారు, నారాయణపురం గ్రామాలు, నల్లజర్ల మండల కేంద్రం, తాడేపల్లిగూడెం మెట్టమీద బరులు సిద్ధం చేస్తున్నారు. నిడదవోలు సమీపంలో 14 బరులు, మొగల్తూరు, వెంప, కాళీపట్నంలోనూ, జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం పట్టణం, కొవ్వూరు నియోజకవర్గంలోని తోగుమ్మి, తాళ్లపూడి, పెద్దేవం, చిక్కాల, మీనానగరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడుల్లో బరులు సిద్ధమయ్యాయి.
జిల్లాలోనే అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 17 చోట్ల బరులు సిద్ధం చేశారు. ఏలూరు సమీపంలోని పెదపాడు మండలం పాత పెదపాడు, దెందులూరు మండలం పెరుగుగూడెంలో బరులు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో మెట్ట ప్రాంతం కంటే డెల్టాలోనే కోడిపందేల హడావుడి కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు
పందేల రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారిని, గతంలో కోడిపందేల కేసులున్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టకుండా ఆడించినా అంగీకరించేదిలేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చెక్‌పోస్టులు పెట్టి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
కృష్ణాకు తరలుతున్న పందెం రాయుళ్లు
మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కోడిపందేలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తుండటంతో చాలామంది పందేల రాయుళ్లు కృష్ణాజిల్లాకు తరలిపోతున్నారు. అక్కడ పోలీస్ యాక్షన్ ఇంత సీరియస్‌గా లేకపోవడంతో రూ.లక్షల్లో పందేలు కాసేవారు కృష్ణాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.