సినిమా స్టూడియోను తలదన్నేలా... | Stage set for simultaneous inauguration of 3 lakh houses | Sakshi
Sakshi News home page

సినిమా స్టూడియోను తలదన్నేలా...

Published Fri, Jul 6 2018 2:43 AM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM

Stage set for simultaneous inauguration of 3 lakh houses - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘సొంత ఇంటిలో ఉంటే ఆనందం, భద్రత ఉంటుంది.. బాడుగ ఇంటిలో ఉంటే ఎప్పుడూ అద్దె అడుగుతారని భయంగా ఉంటుంది. పూరింట్లో ఉంటే వర్షం, ఎండలతో భయంగా  బతకాలి.. వర్షాకాలమొస్తే ఎప్పుడు ఇళ్లు కూలిపోతుందో తెలియదు.. అందుకే ఐదేళ్లలో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తాం’’.. అంటూ నిత్యం సీఎం చంద్రబాబు చెప్పే మాటలు. ఇలా మాటలు చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం అంతంతమాత్రంగా ఉంటోంది. గృహ నిర్మాణ శాఖకు ఏటా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నా ఆ మేరకు నిధులు మాత్రం ఖర్చు చేయడంలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014–15లో రూ.808 కోట్లు కేటాయిస్తే ఇందులో కేవలం రూ. 298.04 కోట్లు ఖర్చుపెట్టారు.

ఆ తర్వాత 2015–16 రూ.897కోట్లకు గాను. రూ.551.43 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. 2016–17లో రూ.1,132 కోట్లు, 2017–18లో రూ.1,457 కోట్లు కేటాయించినా అంతకుముందు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లకు మాత్రమే బిల్లులు చెల్లించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో 2018–19లో రూ.3,734 కోట్లు కేటాయించి హడావుడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా గురువారం విజయవాడ నుంచి ఒకేసారి 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం ముఖ్యమంత్రి ఆర్భాటంగా నిర్వహించారు.

ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఆపసోపాలు అంతా ఇంకా కాదు. అనంతపురం జిల్లాలో 12276570ఎన్‌హెచ్‌1099814 ఐడీతో ఆదిలక్ష్మమ్మ పేరిట ఇల్లు మంజూరు చేశారు. అయితే, నిర్మాణం పూర్తయినట్లు ఇంటి ఫొటో అప్‌లోడ్‌ చేయకుండా లగేజి బ్యాగ్‌ ఫొటో పెట్టి వాటిని కూడా గృహ ప్రవేశం చేసినట్లు గృహప్రవేశం ఖాతాలో వేశారు. అదేవిధంగా 122765504ఎన్‌హెచ్‌1156019 ఐడీతో ఆదినారాయణ ఇంటికి బదులు మోటార్‌ సైకిల్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేసి ఇల్లు పూర్తయినట్లు చూపడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాక, ఈ పథకం కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువగా దక్కించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

గత ఏడాదీ ఇంతే..
ఇదిలా ఉండగా.. గత ఏడాది అక్టోబరు 2న కూడా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంకింద నిర్మించిన లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాల పేరిట విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో 15 వేలు ఇళ్లు కూడా పూర్తిచేయకుండానే లక్ష ఇళ్లు పూర్తిచేశామంటూ హడావుడి చేశారు. అలాగే, అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా రెండేళ్ల కిందట విజయవాడ శివారు ప్రాంతం జక్కంపూడి కాలనీలో సీఎం చంద్రబాబు 10 వేల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు పునాది కూడా పడలేదు. వివిధ జిల్లాల్లో గృహ నిర్మాణ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి..

అనంతపురం జిల్లాలో 25వేల ఇళ్లను ప్రారంభించినట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన ఉండడంలేదు. చాలాచోట్ల ఇంటి నిర్మాణాలు అసంపూర్తిగానే ఉండడం గమనార్హం. ఈ జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన సి.తిమ్మరాజు తండ్రి మారెప్ప పేరుతో ఎన్టీఆర్‌ స్వగృహం మంజూరు కాగా ఇటీవల దానికి శ్లాబ్‌ వేశారు. ఇందుకు సంబంధించిన కట్టెలు కూడా ఇంకా తొలగించకుండానే గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు రిబ్బన్‌ కత్తిరించి స్వీట్లు పంచిపెట్టారు.
 వైఎస్‌ఆర్‌ జిల్లావ్యాప్తంగా 10,200 ఇళ్లను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇందులో సగం వరకు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జిల్లాలో రూ.40 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో వున్నాయి.
 కర్నూలు జిల్లా గడివేముల మండలం కరిమద్దెల గ్రామంలో ఏడాది కిందటే పూర్తయి నివాసం ఉంటున్న ఇళ్లలోనూ ప్రవేశాలు నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. ఏడాదిగా నివాసం ఉంటున్న మూడు ఇళ్లను ప్రారంభించడం చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు.  జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా గృహప్రవేశాలు జరిగాయి.
 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ కాకిలెక్కలే కనిపిస్తున్నాయి. జిల్లాలో 2016–17 నుంచి ఇప్పటివరకు మూడేళ్ల లక్ష్యాలకు సంబంధించి 50,160 ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. వాటిలో సగమే మాత్రమే పూర్తిచేశారు. గురువారం అధికారులు ప్రారంభించామని చెబుతున్న 18,890 ఇళ్లలోనూ అనేకం వివిధ దశల్లో ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయి.  
 శ్రీకాకుళం జిల్లాలో 17,498 ఇళ్లలో గురువారం సామూహిక గృహప్రవేశం చేసినా వాటిలో నిర్మాణం పూర్తయినవి సగం కూడా లేవు.  
  విజయనగరం జిల్లాలో ప్రారంభోత్సవ జాబితాలో అసంపూర్తి ఇల్లు చేర్చడంతో జిల్లా మంత్రి ప్రారంభించకుండా వదిలేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలేదని జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి.
 గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలో మొత్తం 290 ఇళ్లకు పైకప్పులు పూర్తయ్యాయి. వీటిలో కొన్నింటినే అధికారులు, ప్రజాప్రతినిధులు గురువారం ప్రారంభించారు. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రామ ముఖ్య నేత పర్వతనేని భానుప్రసాద్‌ గోడౌన్‌ తరహాలో ఇంటిని నిర్మించడంపై ఆక్షేపణలు వస్తున్నాయి. ఇళ్ల పేరుతో గోడౌన్లు నిర్మించుకోవచ్చా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదే జిల్లా గోరంట్లలో దాదాపు ఆరు నెలల క్రితమే నిర్మాణాలు పూర్తి చేసుకుని లబ్ధిదారులు నివాసం ఉంటున్న ఇళ్ళను ప్రారంభించడం విమర్శలకు దారితీసింది.  
 ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 50,060 గృహాలు మంజూరు చేయగా ఇందులో 24వేల గృహ నిర్మాణాలు పూర్తిచేసినట్లు అధికారులు లెక్కలు చూపారు. కానీ, ఇందులో గురువారం 19,474 ఇళ్లకు మాత్రమే గృహ ప్రవేశాలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. కానీ, వీటిల్లో ఇందులో 20 శాతం గృహాలు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం.  


సినిమా స్టూడియోను తలదన్నేలా...
గుంటూరు రూరల్‌: ముట్టుకుంటే జారిపోయే గోడలు.. పట్టపగలు నక్షత్రాలను తలపించే ఇంటి సీలింగ్‌.. ఇంట్లో రూ.35–50 వేల విలువ చేసే సోఫా సెట్లు... కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇంటీరియర్‌.. సినిమా స్టూడియోనే తలదన్నే విధంగా ఇంటి నిర్మాణం.. ఇలా నిర్మించిన గృహాలను ఎవరైనా పేదవాళ్ళ ఇల్లంటారా? గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకంలో నిర్మించిన ఇళ్ళలో ఇదొకటి. ప్రభుత్వం నుంచి రూ.2.5 లక్షల రుణం తీసుకుని గోరంట్ల గ్రామంలో అధికార పార్టీకి చెందిన సానుభూతిపరుడు నిర్మించిన ఇల్లు.. చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఇంటిని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, గుంటూరు నగర మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ తదితరులు గురువారం ప్రారంభించారు. కలెక్టర్‌ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రూ.25–35 లక్షలతో ఇంటిని నిర్మించిన లబ్ధిదారులకు, ఏవిధంగా  ఎన్టీఆర్‌ గృహకల్పలో రుణం మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం చిన్నమురహరిపురం (సీఎం పురం) గ్రామంలో కూడా ఇదే తరహాలో ఇల్లు నిర్మించారు. కీలు సాయమ్మ పేరుతో ఉన్న ఇల్లు ఖరీదు రూ.20లక్షల పైమాటేనని స్థానికులు చెబుతున్నారు. సాయమ్మ భర్త పోలయ్య టీడీపీలో కీలక కార్యకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement