నీటి కుంటలతో కరువులోనూ సాగు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
నాదెండ్ల: నీటి కుంటలతో కరువులోనూ పంటలు సాగు చేసుకునేందుకు వీలుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మండల కేంద్రంలో గురువారం కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నీటి కుంటల పనులు ప్రారంభించారు. అనంతరం నీరు - చెట్టు క్రింద నాదెండ్ల గ్రామ పరిధిలోని కొండాయగుంట చెరువులో మట్టి తవ్వకం చేపట్టారు. పుల్లారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వంద నీటి కుంటల ఏర్పాటు లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల నీటి కుంటల ఏర్పాటును లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 670 చెరువులను గుర్తించి రూ.28 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. గణపవరం, సాతులూరు గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
కలెక్టర్ కాంతిలాల్‌దండే, మార్కెట్‌యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, చిలకలూరిపేట నియోజకవర్గ ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ పులి శ్రీనివాసరావు, ఏపీడీ నరేంద్రబాబు, నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు, సర్పంచ్ గోరంట్ల సుబ్బారావు, ఎంపీపీ సాయిలక్ష్మీ జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.